కామెడీ చేయలేకపోయిన ‘దేవదాస్‌’!

అలనాటి ఆణిముత్యం దావదాసు పేరును ‘దేవదాస్‌’గా మార్చి ఆనాటి దేవదాసులోని అక్కినేని నాగేశ్వరరావు తనయుడు, నవ మన్మధుడు అక్కినేని నాగార్జున ఓ ప్రధాన పాత్రలో మల్టీస్టారర్‌ మూవీగా తెరకెక్కిన దేవదాస్‌ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. మాఫియా డాన్‌గా నాగార్జున, డాక్టర్‌గా నేచురుల్‌ స్టార్‌ నాని నటించిన ఈ చిత్రం….ఈ ఇద్దరి అభిమానులకు నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. ఆ దేవదాసు పూర్తి ట్రాజడీ చిత్రమైతే….ఈ దేవదాస్‌ను కామెడీ డ్రామాగా రూపుదిద్దాలనుకున్నాడు దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య. అయితే ఆ ప్రయత్నాలు సంపూర్ణంగా ఫలించలేదు.

ప్రతీకారం కోసం ప్రాణాలు తీసే డాన్‌గా నాగార్జున (దేవ), హంతకుల ప్రాణాలైనా కాపాడాలనుకునే డాక్టర్‌గా నాని (దాస్‌)….ఈ ఇద్దరి మధ్య అనూహ్యం కుదిరిన స్నేహం….ప్రాణాలు నిలబెట్టడంలోనే నిజమైన సంతోషం, ఆనందం ఉందని దేవ రీలైజ్‌ కావడమే…ఈ సినిమా కథ. చాలా చిన్న కథ కావడంతో సినిమాను నడిపించడానికి కథనంపైనే ఆధారపడాల్సివచ్చింది. అందుకే ఇందులో ములుపులు, స్టిస్ట్‌లు పెద్దగా కనిపించవు.

అనాథ అయిన దేవను చిన్నప్పుడే ఓ డాన్‌ (శరత్‌ కుమార్‌) దగ్గరకు తీసుకుంటాడు. డేవిడ్‌ ముఠా పెద్ద డాన్‌ను హత మార్చిన తరువాత….అప్పటి దాకా అజ్ఞాతంలో ఉన్న దేవ హైదరాబాద్‌ వస్తాడు. దేవ ఎలావుంటాడో కూడా తెలియని పోలీసులు అతన్ని పట్టుకోవడం కోసం ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో దేవ గాయపడతాడు. మరోవైపు ఎంబిబిస్‌ గోల్డ్‌మెడలిస్టు అయిన దాస్‌…కార్పొరేట్‌ ఆస్పత్రిలో డాక్టర్‌గా చేరతాడు. మంచి పని చేసినా…అక్కడి ఈర్ష్యద్వేషాల వల్ల ఉద్యోగం కోల్పోతాడు. ఓ గల్లీలు చిన్న క్లీనిక్‌ తెరుస్తాడు. పోలీసుల కాల్పుల్లో గాయపడిన దేవ చికిత్స కోసం దాస్‌ క్లీనిక్‌కు వస్తాడు. అతనికి చికిత్స చేస్తాడు. అతనే పోలీసు కాల్పుల్లో గాయపడిన దేవా అనే సంగతి దాస్‌కు తెలుస్తుంది. అయినా…పోలీసులకు చెప్పకుండా అతన్ని కాపాడుతాడు. దీంతో ఇద్దరి మధ్య స్నేహం అంకురిస్తుంది. మరోవైపు నాని ప్రేమించే రుష్మిక దేవను పట్టుకోడానికి అండర్‌ కవర్‌గా పనిచేసే పోలీసు అధికారి. నాని ద్వారా దేవాను పట్టుకోవాలన్నది ఆమె వ్యూహం. నాగార్జున ఓ టివి యాంకర్‌ – జాహ్నవిని ప్రేమిస్తాడు. ఆమె ప్రేమను అడ్డుపెట్టుకుని డాన్‌ దేవలో ఎలా పరివర్తన తీసుకొచ్చాడనేది తెరపైన చూడాలి.

కామెడీ డ్రామా జానర్‌గా తీయాలనుకున్న ఈ సినిమాలో తగినంత కామెడీ లేకపోవడం పెద్ద మైనస్‌ పాయింట్‌. ఇటువంటి కామెడీ డ్రామాలో సీను సీనుకూ పంఛ్‌లు పడుతూనే ఉండాలి. ప్రేక్షకుడు నవ్వలేక కడుపుపట్టుకోవాలి. అలాంటి సన్నివేశం ఒక్కటి కూడా ఇందులో లేదు. మంచి సంభాషణలు కరువయ్యాయి. వెన్నెల కిశోర్‌, సీనియర్‌ నరేష్‌ వంటి నటులున్నా వారిని సరిగా ఉపయోగించుకోలేకపోయారు దర్శకుడు. అక్కడక్కడా కాస్త బోరుకొట్టినట్లుగా, సాగదీసినట్లగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో నాగార్జున చనిపోయినట్లు చూపించి…కొన్ని నిమిషాల్లోనే బతికున్నట్లు చూపించి చిన్న ట్విస్ట్‌తో ప్రేక్షకులను అలరించారు. నటన విషయానికొస్తే…నాని అమాయకత్వం, నిజాయితీ, వృత్తినిబద్ధత కలగలిసిన డాక్టర్‌గా పూర్తిస్థాయిలో నటన ప్రదర్శించారు. నాగార్జున చాలా సునాయాసంగా నటించారు. సూపర్బ్‌ అని చెప్పుకోదగ్గ పాత్ర ఇంకొకటి లేదు.

మల్టీ స్టార్‌ర్‌ సినిమా అంటే….ఒకరికంటే ఎక్కువ హీరోల అభిమానులను సంతృప్తపరచాల్సివుంటుంది. కలెక్షన్లూ బాగానే ఉంటాయి. అయితే…ఫెయిలైతే ఇద్దరి అభిమానుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సివుంటుంది. ఈ విషయాన్ని దేవదాస్‌ సినిమా రుజువు చేస్తోంది. రెండు నెలలు ముందుగా సినిమా చూపించివుంటే… మెరుగులు దిద్దేందుకు అవకాశం ఉండేదని విడుదలకు ముందే నాగార్జున ఎందుకు వ్యాఖ్యానిచారో సినిమా చూసిన తరువాత అర్థమవుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*