కింగ్‌ కాదు…కింగ్‌ మేకరూ కాదు…దేవెగౌడ వ్యూహాత్మక తప్పిదం

కర్నాటక ఎన్నికల్లో జనతాదళ్‌ (ఎస్‌) – జెడిఎస్‌ అధినేత వ్యూహాత్మక తప్పిదంతో భారీ మూల్యమే చెల్లించుకున్నారు. కింగ్‌ మేకర్‌గా చక్రం తిప్పదామనుకున్న దళపతి అప్రధాన్యంగా మిగిలిపోయారు. కాస్త ముందుచూపుతో వ్యవహరించివుంటే దేవెగౌడ్‌ చుట్టూ రాజకీయాలు తిరగుతుండేవి. బిజెపిని నమ్మి ఆయన నిండా ముగిపోయారు. కమళదళం మాత్రం…దేవేగౌడ ముఖాన రెండు పొగడ్తలు విసిరేసి తిరుగులేనట్లుగా లాభపడింది.

మాజీ ప్రధాని దేవెగౌడ్‌ ఎలాగైనా తన కుమారుడు కుమారస్వామిని కర్నాటక ముఖ్యమంత్రి పీఠంపైన కూర్చోబెట్టాలనుకున్నారు. అయితే ఆయన అంతుదుకు తగిన ఎత్తుగడలను రూపొందించుకోలేదు. బిజెపిని తక్కువ అంచనా వేసి చేసిన తప్పిదాల వల్ల ఆయన ఎటూకాకుండాపోయారు. బిజెపికి పూర్తి మెజారిటీ రాబోదని, తమ సహకారం లేనిదే ఏమీ చేయలేరన్న నమ్మకంతో…ఎన్నికల ముందే ఆ పార్టీతో మెత్తగా వ్యవహరించారు. త్రిముఖ పోటీ జరిగినట్లు కనిపిస్తున్నా బిజెఎస్‌, బిజెపి ఎన్నికలకు మునుపే లోపాయికారి అవగాహనకు వచ్చాయి. జెడిఎస్‌ బలంగా ఉన్న కొన్ని స్థానాల్లో బిజెపి బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టింది. బిజెపి బలంగా ఉన్న కొన్ని స్థానాల్లో జెడిఎస్‌ బలహీన అభ్యర్థిని పోటీకి పెట్టింది. ఈ అవగాహనతో జెడిఎస్‌ కంటే బిజెపి ఎక్కువగా లాభపడింది. జెడిఎస్‌ సహకారం లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థాయికి ఎదిగింది. ఎన్నికల ముందే బహిరంగంగా పొత్తుపెట్టుకుంటే…జాతీయ స్థాయిలో బిజెపిపై వ్యతిరేకత అంతా కాంగ్రెస్‌కు పోయేది. అలాకాకుండా జెడిఎస్‌ ప్రత్యేకంగా పోటీ చేయడం వల్ల బిజెపిపైన ఉన్న వ్యతిరేక రెండుగా చీలిపోయింది. బిజెపి ఓటమే లక్ష్యంగా జెడిఎస్‌ పావులు కదిపివుంటే….కాంగ్రెస్‌తో అవగాహన చేసుకుని పోటీ చేసివుంటే, బిజెపి అడ్రెస్‌ గల్లంతయ్యేది.

ఈ పరిస్థితిని గమనించే నరేంద్రమోడీ ముందు నుంచి జెడిఎస్‌తో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కాంగ్రెస్‌కు పెద్దలను గౌరవించడం తెలియదని, తనకు దేవెగౌడ అంటే అపారమైన గౌరవం ఉందని, ఆయన కారు ఎక్కేటప్పుడు తాను స్వయంగా డోరు తీస్తానని…ఇలా దేవెగౌడను ఆకాశానికెత్తేస్తూ మాట్లాడారు. ఇది జెడిఎస్‌ కార్యకర్తల్లో బిజెపి పట్ల సానుకూల ధోరణి ఏర్పడటానికి ఉపయోగపడింది. జెడిఎస్‌ కూడా కాంగ్రెస్‌నే ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తూ….బిజెపితో మొత్తగా వ్యవహరించింది. దీంతో భారీ మూల్యమే చెల్లించింది. బిజెపి పోటీ చేసిన అన్ని స్థానాల్లో జెడిఎస్‌ బలమైన అభ్యర్థులను నిలబెట్టివుంటే…ఆ పార్టీకి అన్ని సీట్లు వచ్చేవి కావు. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో తప్పక జెడిఎస్‌ సహకారం అవసరమయ్యేది. బిజెపి దృతరాష్ట్ర కౌగిలి అని దేవేగౌడకు ఇప్పటికైనా అర్థమైవుండాలి. దాని వ్యూహాలు, ఎత్తుగడలు చాలా నాటకీయంగా ఉంటాయని టిడిపితో బిజెపి వ్యవహరించిన తీరును బట్టి అర్థమైవుండాలి. ఇవేవీ పట్టకుండా అవకాశవాదంగా వ్యవహరించినందుకు జెడిఎస్‌కు తగిన శాస్తి జరిగిందనుకోవాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*