‘కుక్కకాటుకు చెప్పుదెబ్బ’ చందంగా మోడీకి బాబు జవాబు!

ఇంగ్లీషులో టిట్‌ ఫర్‌ టాట్‌, తెలుగులో కుక్కకాటుకు చెప్పుదెబ్బ అనే సామెతులు ఉన్నాయి. ఎదుటి వాళ్లు చేసిన దానికి అదే రీతిలో సమాధానం చెబితే….అలాంటప్పుడు ఈ సామెతలు ఉపయోగిస్తుంటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి చంద్రబాబు అటువంటి సమాధానమే చెప్పారు. ఇంతకీ విషయం ఏమంటే…

ప్రధాన మంత్రితో అపాయింట్‌మెంట్‌ కోసం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి నిరీక్షించిన సందర్భాలు ఉన్నాయి. అయినా మోడీ అపాయింట్‌మెంటు ఇవ్వకపోవడంతో ఆయన్ను కలవకుండానే బాబు అమరావతికి తిరిగి వచ్చిన ఉదంతాలున్నాయి. దానికి బదులు తీర్చుకున్నారు చంద్రబాబు. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల నిర్వహణకు జాతీయ స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ప్రధాని స్వయంగా హాజరయ్యే ఈ కమిటీ సమావేశానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం పంపారు. ఈనెల 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సమావేశం జరిగింది. అయితే….అదే సమయంలో అమరావతిలో మంత్రివర్గ సమావేశం పెట్టుకున్నారు చంద్రబాబు. ముఖ్యమంత్రికి మంత్రివర్గ సమావేశం ఉన్నందున ఢిల్లీలో జరిగే మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల కమిటీ సమావేశానికి హాజరుకాలేరని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. మహాత్మాగాంధీపైన రాష్ట్రానికి అపారమైన గౌరవం ఉందని, ఆయన వచ్చే జయంతి రోజున రాష్ట్రానికి బహిరంగ మల విసర్జన రాష్ట్రంగా ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ లేఖలో పేర్కొంది. ఈసారి జరగబోయే సమావేశంలో పాల్గొనడానికి సిఎం ఆసక్తితో ఉన్నారని తెలియజేసింది. ఏదేమైనా ఢిల్లీ సమావేశానికి సిఎం గైర్హాజరయ్యారు.

గతంలో ప్రధాన మంత్రి కాకితో కబురంపినా చంద్రబాబు రెక్కలు కట్టుకుని వాలిపోయేవారు. ఇప్పుడూ వెళ్లాలనుకునివుంటే….క్యాబినెట్‌ సమావేశాన్ని ఒకరోజు వాయిదా వేసుకునివుండొచ్చు. ‘మీరు పిలిచినా మేము రావాల్సిన పనిలేదు’ అనే సందేశాన్ని ప్రధానికి తెలియజేయడానికే బాబు గైర్హాజరయ్యారని అనుకోవాలి. మొత్తంమ్మీద టిట్‌ ఫర్‌ టాట్‌ అనే రీతిలో ప్రధాన మంత్రికి సమాధానం చెప్పినట్లుంది ఈ చర్య.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*