కుట్ర చేస్తున్నదెవరు? రాంగోపాల్‌ వర్మనా… బాలకృష్ణనా…!!

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మహానటుడు జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తీస్తున్న లక్ష్మీపార్వతీస్‌ ఎన్‌టిఆర్‌ సినిమా ఒక్క పాటతోనే తీవ్ర వివాదాస్పదమయింది. వెన్నుపోటు….కుట్ర…అంటూ సాగిన పాటపై తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టిటిడి నేతలు…వర్మపై కారాలు మిరియాలు నూరుతున్నారు. కేసులు పెడుతున్నారు. వర్మ బొమ్మలను కాల్చుతున్నారు. కాళ్లకింద వేసి తొక్కుతున్నారు.

మరోవైపు ఎన్‌టిఆర్‌ తనయుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి జీవితగాథ ఆధారంగా రెండు సినిమాలు తీస్తున్నారు. సినిమా విశేషాలకు సంబంధించి కథానాయకుడు, రాజకీయ అంశాలకు సంబంధించి మహానాయకుడు పేరుతో రెండు చిత్రాలు రూపొందుతున్నాయి. ఈ సినిమాల్లో ఎన్‌టిఆర్‌ పాత్రను బాలకృష్ణ పోషిస్తున్నారు.

బాలకృష్ణ తీస్తున్న సినిమాలపై పొగడ్తల పన్నీరు చల్లుతున్నారు. వర్మ సినిమాపై నిప్పులు కురిపిస్తున్నారు. వర్మ కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బాలకృష్ణ సినిమాలు ఎన్‌టిఆర్‌ ప్రతిష్టను అమాంతం పెంచుతాయని చెబుతూ…వర్మ తీస్తున్న సినిమా ఎన్‌టిఆర్‌ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉంటుందని విమర్శిస్తున్నారు.

నిజంగా ఎన్‌టిఆర్‌కు కీడు చేస్తున్నదెవరు? ఈ వ్యవహారాల్లో కుట్ర, దగా, మోసం చేస్తున్నదెవరు? రాంగోపాల్‌ వర్మనా…? బాలకృష్ణనా…?

ఎన్‌టిఆర్‌ బయోపిక్‌ ఆలోచన వచ్చినప్పటి నుంచి ఈ సినిమా చుట్టూ వివాదాలు ముసురుతూనే ఉన్నాయి. మొదట్లో తేజను దర్శకునిగా ఎంచుకున్నారు. సినిమా ముహూర్తం కూడా అయిన తరువాత….ఆయన తప్పుకున్నారు. తాను సినిమా చేయలేనని చెప్పాశారు. తేజ ఎందుకు తప్పుకున్నారు? చేతగాక తప్పుకున్నారా? లేక వాస్తవాలను వక్రీకరించలేక, ఎవరికో నచ్చినట్లు తీయడం ఇష్టంలేక విరమించుకున్నారా?

జీవితగాథను సినిమాగా తీయాలంటే….కీలకమైన ఘటనను విస్మరించకూడదు. వక్రీకరణలూ ఉండకూడదు. అందరికీ తెలిసిన విషయాలను అసలు తప్పుమార్గం పట్టించకూడదు. మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన మహానటి సినిమా అంతగా విజయం సాధించిందంటే…అందుకు కారణం ఆమె జీవితాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పడమే. ఎవరికో కోపం వస్తుందని వాస్తవాలను దాచిపెట్టడమో, వక్రీకరించడమో చేస్తే….అతి దర్శకుని తప్పిదం అవుతుంది. వృత్తికి చేసిన ద్రోహం అవుతుంది.

బాలకృష్ణ తీస్తున్న సినిమాల్లో….ఎన్‌టిఆర్‌ జీవితంలోని కీలక ఘట్టాలన్నీ ఉంటాయా…? అనే అనుమానాల నుంచే సమస్య మొదలయింది. ఎన్‌టిఆర్‌ సినిమా జీవితంలో పెద్ద వివాదాలు లేకున్నా….రాజకీయ జీవితంలో చాలానే ఉన్నాయి. అప్పటిదాకా దేశాన్ని, రాష్ట్రాలను ఏకక్షత్రాధిపత్యంగా ఏలుతున్న కాంగ్రెస్‌పై తిరుగుబాటు ప్రకటించి, తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎనిమిది నెలల్లోనే అఖండ విజయాన్ని సాధించి, ఆంధ్రప్రదేశ్‌ అధికార పీఠాన్ని అధిష్టించారు ఆ మహానేత. కొంతకాలానికే…ఆయన అమెరికా వెళ్లిన సందర్భాన్ని అదును చూసుకుని, ఎన్‌టిఆర్‌ను పదవీచ్యుతున్ని చేశారు నాదేండ్ల భాస్కర్‌రావు. దీనిపై రాష్ట్ర ప్రజల్లో పెద్ద తిరుగుబాటే వచ్చింది. దీంతో అనివార్యంగా మళ్లీ ఎన్‌టిఆర్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టక తప్పలేదు.

ఇక….ఎన్‌టిఆర్‌ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశం అత్యంత కీలకమైన ఘట్టం. ముఖ్యమంత్రి పీఠంపై ఉన్నా, అంతులేని కీర్తిప్రతిష్టను సంపాదించిన దగ్గరుండి చూసుకునేవాళ్లు లేకపోవడంతో….ఎన్‌టిఆర్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన జీవిత గాథ రాయడానికి వచ్చిన లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారు. సహజంగానే ఆమెకు ప్రాధాన్యత పెరిగింది. అప్పటిదాకా చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నవాళ్లు లక్ష్మీపార్వతి చుట్టూ తిరగడం ప్రారంభించారు. ఇది ఎన్‌టిఆర్‌ కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. లక్ష్మీపార్వతికి రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ముద్రవేసి, ఆమెను బూచిగా చూపించి, ఎంఎల్‌ఏలను తనవైపు తిప్పుకుని, ఎన్‌టిఆర్‌ను ముఖ్యమంత్రీ పీఠం నుంచి దించారు చంద్రబాబు నాయుడు.

దీన్ని వెన్నుపోటుగా ఎన్‌టిఆర్‌ అభివర్ణిస్తే… తిరుగుబాటుగా చంద్రబాబు చెప్పుకున్నారు. వైశ్రాయ్‌ హోటల్‌లో ఉన్న ఎంఎల్‌ఏలను కలవడానికి వెళ్లిన ఎన్‌టిఆర్‌పై చెప్పులు విసిరారు. ఆత్మాభిమానం నిండుగా, మెండుగా కలిగిన ఆ మహావ్యక్తికి అంతకంటే అవమానం ఇంకొకటి ఉంటుందా? తన పార్టీని, ప్రభుత్వాన్ని మోసంతో, కుట్రతో లాక్కున్నారని ఎన్‌టిఆర్‌ ఆక్రోశించారు. కుట్ర రాజకీయాలు తెలియన ఎన్‌టిఆర్‌ నిస్సహాయంగా ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు. ఆ మనోవేదనలోనే ఆయన కన్నుమూశారు.

బాలకృష్ణ తీస్తున్న సినిమాలో ఈ ఘట్టాలు (లక్ష్మీపార్వతి ప్రమేయం, చంద్రబాబు నడిపించిన రాజకీయ తంత్రం…) ఉంటాయా అనేదే ప్రశ్న. ఆ అనుమానం నుంచి పుట్టిందే లక్ష్మీపార్వతీస్‌ ఎన్‌టిఆర్‌. సినిమాలో ఇవన్నీ ఉంటాయా…అని బాలకృష్ణను అడిగినపుడు, సినిమా ఎక్కడ మొదలుపెట్టాలో, ఎక్కడ ముగించాలో మాకు బాగా తెలుసు…అని సమాధానం ఇచ్చారు. ఎన్‌టిఆర్‌ను పదవీచ్యుతున్ని చేసినపుడు హరిక్రిష్ణ వంటి వాళ్లు కూడా చంద్రబాబుతో ఉన్నప్పటికీ…ఆ తరువాత హరిక్రిష్ణ పశ్చాత్తాపం చెందారు. సొంతపార్టీ పెట్టుకున్నారు. చంద్రబాబు ‘చాణక్యం’ ముందు ఏమీ చేయలేకపోయారు. అందుకే…టిడిపితో అంటీముట్టనట్లు ఉండిపోయారు. చంద్రబాబుతో వియ్యం అందుకున్న బాలకృష్ణ సహజంగానే టిడిపికి దగ్దరయ్యారు. ఆయనొక్కరు తప్ప ఎన్‌టిఆర్‌ కుటుంబం దూరంగానే ఉంది. దగ్గుబాటు వెంకటేశ్వరరావు వంటి వారూ రాజకీయాలకు పూర్తిగా దూరమైతే….పురందీశ్వరి ఇతర పార్టీల్లో చేరారు. ఈ పరిణామాలన్నీ తెలిసిన వారికి….బాలకృష్ణ సినిమాలో చంద్రబాబును ఇబ్బందిపెట్టే ఏ అంశాలూ ఉండబోవని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

రెండు నెలల క్రితం రాంగోల్‌ వర్మ విడుదల చేసిన ఓ వీడియోలో…. ‘నా దగ్గర నిజం ఉంది. నిజానికి సంబంధించిన సత్యం ఉంది. సత్యాన్ని తలదన్నే యతార్థం ఉంది. అది వైశ్రాయ్‌ సంఘటనలవచ్చు. మీ ఇంటిలో…వంటింట్లో జరిగిన కుట్రలవ్వచ్చు….సార్‌…నిజం నాకంటే ఎక్కువగా మీకు, మీ ఫ్యామిలీకి, మీ ఇంటి అల్లుడికి బాగా తెలుసు సార్‌. మీరు నిజం చెప్పరు. అందుకే నేను చెప్పాల్సివస్తోంది.’ అని అంటున్నారు. ఆ నిజాలను తమ సినిమాలోనూ చూపిస్తామని ఇప్పటిదాకా సినిమా దర్శకుడుగానీ, అన్నీతానై వ్యవహరిస్తున్న బాలకృష్నగానీ ప్రకటించలేదు. అందుకే వర్మ సినిమాకు ప్రాధాన్యత వచ్చింది.

ఇక…రాంగోపాల్‌ వర్మ సినిమా వెనుక ఏ రాజకీయ ప్రయోజనాలైనా ఉండొచ్చు. ఆ మాటకొస్తే…బాలకృష్ణ తీస్తున్న సినిమాల వెనుకా రాజకీయ ప్రయోజనాలున్నాయి. 2019 ఎన్నికలకు రెండు మూడు నెలలు ముందు ఈ సినిమాలు విడుదల చేయడంలోని ఉద్దేశ్యమే అది. సినిమా తీసి ఒక పార్టీ లబ్ధిపొందాలని భావించినపుడు….ప్రత్యర్థి పార్టీ కూడా అలాంటి ఆలోచన చేయడాన్ని తప్పుబట్టలేం. అందుకే ఆ విషయాన్ని పక్కనపెట్టేద్దాం.

రాంగోపాల్‌ వర్మ కుట్రలు చేస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్‌టిఆర్‌ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు తనను మోసం చేశారని ఎన్‌టిఆర్‌ స్వయంగా చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోలూ ఉన్నాయి. ఎన్‌టిఆర్‌ తన చివరి రోజుల్లో ఏ క్షోభను ఆనుభవించారో ఆ క్షోభను చూపించడం కుట్ర అవుతుందా…? దాన్ని దాచిపెట్టడం…? ఆ క్షోభకు కారకులైన వారిని తప్పించాలనుకోవడం కుట్ర అవుతుందా..? వర్మ సినిమా విడుదలైతే…అప్రతిష్టపాలయ్యేది చంద్రబాబు నాయుడు తప్ప…ఎన్‌టిఆర్‌ కాదు. లక్ష్మీపార్వతీస్‌ ఎన్‌టిఆర్‌ సినిమాతో…. ఎన్‌టిఆర్‌పై జరిగిన కుట్రలు బయటపడుతాయిగానీ…ఆ సినిమా ఎన్‌టిఆర్‌పై కుట్ర కాబోదు. అందుకే వర్మ సినిమాపై అంత ఉలికిపాటు.

ఏదిఏమైనా….ఒక్కటి మాత్రం నిజం. ఎన్‌టిఆర్‌కు జరిగిన అన్యాయాన్ని కప్పిపుచ్చాలని, నాడు జరిగిన కుట్రలను దాచిపెట్టాలని నిజమైన ఆయన అభిమానులెవరూ కోరుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే….బాలకృష్ణ సినామా ద్వారానైనా, వర్మ చిత్రంద్వారానైనా అవన్నీ బయటికి వస్తే సంతోషిస్తారు కూడా. జయహో ఎన్‌టిఆర్‌.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*