కుప్పం ఎమ్మెల్యే గారికి… కుప్పం పౌరుడిగా నా బహిరంగ లేఖ

Nara Chandrababu Naidu

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ నెల 24, 25 తేదీల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కుప్పానికి చెందిన హరినాథ్ అనే వ్యక్తి చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ లేఖ యథాతథంగా….


కుప్పం ఎమ్మెల్యే గారికి…కుప్పం పౌరుడిగా నా బహిరంగ లేఖ

గౌరవ ఎమ్మెల్యే గారు,

మిమ్మల్ని గెలిపించిన వారి యోగక్షేమాలు విచారించే తీరిక లేని మీరు రాజకీయాలు చేయడానికి మాత్రమే కుప్పం వస్తారా? ఏడాదిలో ఎన్ని సెకెన్లు మా కోసం కేటాయిస్తున్నారు? ఎన్ని నిమిషాలు మా కష్టాల గురించి ఆలోచిస్తున్నారు ? మీకు శ్రమ లేకుండానే కుప్పం ప్రజల్లో చైతన్యం పెరుగుతోంది సార్. అనుమానం ఉంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని గమనించండి.

రాష్ట్రంలో మీ పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా ఒక ఎమ్మెల్యేగా మా ప్రాంతం గురించి పట్టించుకోవాల్సిన భాద్యత మీకు లేదా? కేవలం మీ రాజకీయ షికార్లకు మాత్రమే వస్తారా సార్?

గత 35 ఏళ్లుగా కుప్పానికి మీరే ఎమ్మెల్యే. మా తాతల కాలం నుంచి మాకు, మా బిడ్డలకు ఓటు హక్కు వచ్చేటంత వరకూ మీ పాలనే సాగింది. కుప్పానికి మీరు ఏమేమో చేశారని మీ నుండి సాయం పొందిన వారు, ఏమీ చేయలేదని మీరు గిట్టని వారు అంటున్నారు.

ఒక సీఎంగా మీ స్థాయికి తగిన అభివృద్ధి కుప్పంలో చేయలేదని, కుప్పం ప్రజలు కష్టంలో ఉంటేనే మిమ్మల్ని గుర్తించుకుంటారనే భావంతోనే నిర్లక్ష్యం చేశారని నేను అనుకొంటున్నాను.

సార్, మీరు ఉత్తమ…అత్యుత్తమ సీఎంగా ఎల్లో మీడియా భజనలో పడి ఆత్మద్రోహం చేసుకోకుండా మీరు ఉత్తమ ఎమ్మెల్యేనో, కాదో దయచేసి ఆలోచించండి. మీరు ఒక్కరు సక్రమంగా ఉంటే, అంకితభావంతో పనిచేస్తే కుప్పం ప్రజల జాతకాలు ఎపుడో మారేవని నమ్ముతున్నాను.

సార్, నిజం చెప్పే వారిపై ఎదురుదాడి చేసే మీ / మీ భజనపరుల తీరు మార్చుకుని వాస్తవాలు గుర్తించే ప్రయత్నం ఇప్పటికైనా చేస్తారని ఆశిస్తాను.

వందనాలతో…
హరినాథ్ SG,
ఒక కుప్పం పౌరుడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*