‘కుమారస్వామి ….మీరు ఒక మాటనే వంద రకాలుగా చెబుతున్నారు’

దక్షిణ భారత సూపర్‌ స్టార్‌గా పేరుపొందిన రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశానికి ముందుగా వస్తున్న ‘కాలా’ చిత్రం ఈనెల 7న విడుదలవుతోంది. కర్నాటకలో ఈ సినిమాకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. కావేరీ జలాల విషయంలో రజనీకాంత్‌ తమిళనాడును సపోర్టు చేస్తూ మాట్లాడటంతో…కొన్ని కన్నడ సంఘాలు కాలాను విడుదలకానీకుండా అడ్డుకుంటామని ప్రకటించాయి. ఈనేపథ్యంలో నిర్మాత అయిన రజనీ అల్లుడు కోర్టును ఆశ్రయించారు. కాలా చిత్రాన్ని విడుదల చేసుకోడానికి అవసరమైన భద్రత కల్పించాలని న్యాయస్థానం కర్నాకట ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ…కోర్టు ఆదేశాల మేరకు కాలా చిత్రానికి తగిన భద్రత కల్పిస్తామని చెప్పారు. అదే నోటితో…మరోవైపు ‘కాలా’ చిత్రాన్ని విడుదల చేయవద్దని డిస్ట్రిబ్యూటర్లకు పిలుపునిచ్చారు. రెండు నాలుకల మాటలు ఏమిటని ప్రశ్నిస్తే….’ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా విడుదల కాకపోవడమే మంచిదని నా అభిప్రాయం. కావేరీ సమస్య పరిష్కారమయ్యాక సినిమాను ఎప్పుడైనా విడుదల చేసుకోవచ్చు.’ అని అతి తెలివిగా సమాధానం ఇచ్చారు. పైగా తానూ సినిమాలకు డిస్ట్రిబ్యూటరేనని గుర్తు చేశారు. తాను ఈ మాట ముఖ్యమంత్రిగా చెప్పడం లేదని, కన్నడవాసిగా చెబుతున్నానని సన్నాయినొక్కులు నొక్కారు.

రాజకీయ కారణాలతో సినిమాలను అడ్డుకోవడం పరిపాటిగా మారిపోయింది. పద్మావత్‌ సినిమాను అడ్డుకునేందుకు బిజెపి ఎంతగా ప్రయత్నించిందో అందరికీ తెలిసిందే. ఆఖరికి సుప్రీం కోర్టు ఆదేశించినా కొన్ని రాష్ట్రాల్లో సినిమా విడుదల కాలేదు. ఇప్పుడు కర్నాటకలో కాలా పరిస్థితి కూడా అలాగే అవుతుందా…అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రభుత్వ అధినేతగా ఉన్న వ్యక్తి…కోర్టు ఆదేశాలను సాంకేతికంగా అమలు చేయాలనుకోవడమే ఇందుకు కారణం. సినిమాను విడుదల చేయాలనుకుంటే…భద్రత కల్పించాలి. అంతేతప్ప…భద్రత కల్పిస్తామని చెబుతూనే మరోవైపు చిత్రాన్ని విడుదల చేయొద్దంటూ… డిస్ట్రిబ్యూటర్లకు చెప్పడం ఏమిటి? ఒక ముఖ్యమంత్రే ఆ మాట చెప్పిన తరువాత డిస్ట్రిబ్యూటర్లు సినిమా విడుదలకు సిద్ధపడతారా? ఈ సినిమా వివాదం గురించి కర్నాటకకు చెందిన సినీనటుడు ప్రకాష్‌రాజ్‌ మాట్లాడుతూ…కావేరీ వివాదానికి, సినిమా విడుదలతో ముడిపెట్టకూడదన్నారు. రెండూ వేరేవేరే అంశాలని చెప్పారు. సినిమా అంటే ఒక రజనీకాంత్‌ మాత్రమే కాదన్నారు. కర్నాకటలో కాలా విడుదలవుతుందో లేదో చూడాలి.

ఏమైనా కుమార స్వామి తీరును ప్రశ్నిస్తూ బాషా సినిమా తీరులో డైలాగు చెప్పమని రజనీకాంత్‌ను అడిగితే….’ఈ బాషా ఒకసారి చెబితే వందసార్లు చెప్పినట్లే….కుమారస్వామీ మీరు ఒకే మాటలను వంద రకాలుగా చెబుతున్నారు’ అని చెబుతారేమో!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*