కెఇ గారూ…మీరు ఉరేసుకోవాల్సిన పరిస్థితి రాకూడదనే కోరుకుంటున్నాం!

కెఇ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి. కర్నూలు జిల్లాలో బలం, బలగం ఉన్న నాయకుడు. ఒక బిసిని ఉప ముఖ్యమంత్రిని చేశానని చెప్పుకునేందుకు చంద్రబాబు నాయుడు ఆయన్ను ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. పేరుకు ఉప ముఖ్యమంత్రి అయినా….ఆ పదవి ద్వారా ఆయనకు కొత్తగా వచ్చిన అధికారాలు ఏమీ లేవు. ఇంకా చెప్పాలంటే…రెవెన్యూలో ఆయనకు తెలియకుండానే చినబాబు ప్రమేయంతో కొన్ని బదిలీలు జరిగినట్లు వార్తలొచ్చాయి. అది వేరేసంగతిగానీ….ముఖ్యమంత్రి చంద్రబాబును బలంగా సమర్ధించే నాయకుల్లో కెఇ ఒకరుగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే….ఆయన ఒక కీలక ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటే ఉరేసుకుంటానని అన్నారు.

ఇటీవల కాలంలో తెలుగుదేశం కేంద్ర ప్రభుత్వం నుంచి, ఎన్‌డిఏ నుంచి బయటకు వచ్చిన తరువాత కాంగ్రెస్‌కు దగ్గరవుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య చంద్రబాబు రహస్యంగా రాహూల్‌ గాంధీని కలిసినట్లు వార్తలొచ్చాయి. ఇటీవల కర్నాకటలో జెడిఎస్‌తో కలిసి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే….ప్రమాణ స్వీకారోత్సవానికి బాబు హాజరయ్యారు. అక్కడ రాహుల్‌ గాంధీతో కరచాలనం చేయడం పెద్ద చర్చనీయాంశం అయింది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టిడిపి నేతగా ఉన్న చంద్రబాబునాయుడు… అదే కాంగ్రెస్‌ పార్టీ నాయకులైన సోనియా, రాహుల్‌తో కలిసి వేదిక ఎలా పంచుకుంటారని చాలా మంది ప్రశ్నించారు. అయితే…అది జెడిఎస్‌ కార్యక్రమం అయినందు వల్లే వెళ్లామని టిడిపి సమర్ధించుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, టిడిపి పొత్తుపెట్టుకుంటాయన్న ప్రచారం జోరందుకుంది. దీని గురించి అడిగినపుడు కెఇ కృష్ణమూర్తి తీవ్రంగా స్పందించారు. అలా జరిగితే ఉరేసుకుంటానని చెప్పారు.

తమ పార్టీ అధినేతపై కెఇకి ఉన్న నమ్మకానికి ఆయన్ను అభినందించాల్సిందే. అయితే రాజకీయాల్లో ఏదైనా జరగడానికి ఆస్కారముంది. బిజెపితో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని అనేక సార్లు చెప్పిన బాబు….అవన్నీ మరచిపోయి ఆ పార్టీతో పొత్తుపెట్టుకున్నారు. కలిసి ప్రభుత్వాలను పంచుకున్నారు. ఇదే సూత్రం కాంగ్రెస్‌కు వర్తించదని ఏమీ లేదు. ఇప్పుడు రాష్ట్రంతో తమ ప్రథమ శత్రువు బిజెపి అని టిడిపి నాయకులు చెబుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ ప్రథమ శత్రువు అనేది వాస్తవమేగానీ….ఇప్పుడు ఆ పార్టీని అలా ప్రథమ శత్రువుగా చూడటం లేదు. పొత్తుపై కాంగ్రెస్‌, టిడిపి శ్రేణులు ఆశావహంగానే ఉన్నాయి. ఎన్నికల్లో ఏదో ఒక తోడు అవసరం అనే భావన టిడిపిలో బలంగా ఉంది. ఇలాంటి వాస్తవాలన్నీ గ్రహించకుండా….తనకు కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకతే చంద్రబాబుకూ ఉంటుందన్న ధోరణిలో కెఇ స్పందించినట్లున్నారు. ఏమైనా కెఇ ఉరి వేసుకోవాల్సినంత పరిస్థితి రాకూడదనే అందరం కోరుకుందాం.

1 Comment

  1. ANY MIRACLE CAN HAPPENS IN POLITICS NOW A DAYS. LET US WATCH. SHRI KE SIR IS A VERY GOOD POLITICIAN HAVING EXPERIANCE.PERHAPS HE UNDIGESTED THE HAPPENINGS.HE MAY BE OBSERVING.

Leave a Reply

Your email address will not be published.


*