కెసిఆర్‌కు చెన్నై భోజనం రుచించివుండదు!

బిజెపి, కాంగ్రెస్‌ యేతర పార్టీలతో కూటమి ఏర్పాటు చేసి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో రాష్ట్రాలను పట్టుకుని తిరుగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి, ఆర్‌ఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 29న చెన్నై వెళ్లి డిఎంకే నేతలైన కరుణానిధి, స్టాలిన్‌ను కలిశారు. తాను ఏర్పాటు చేయాలనుకుంటున్న కూటిలో చేరమని ఆహ్వానించారు. తమిళనాడులో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అన్నాడిఎంకె అధికారంలో ఉంది. సినీనటులు కమలహాసన్‌, రజినీకాంత్‌ కొత్తగా పార్టీలు పెట్టారు. ఇక ఎంపికె, డిఎండికె, ఎండిఎంకె వంటి పార్టీలు అనేకం ఉన్నాయి. అయితే కెసిఆర్‌ ప్రస్తుతానికి డిఎంకే నేతలను మాత్రమే కలిశారు. జయలలిత మరణం తరువాత అన్నాడిఎంకె పరిస్థితి అమగ్యగోచరంగా ఉంది. 2019 ఎన్నికల నాటికి ఆ పార్టీ ఏమవుతుందో కూడా తెలియని దుస్థితి. ప్రస్తుతానికి మోడీ కనుసన్నల్లో ఆ పార్టీ నడుస్తోంది. అందుకే ఆ పార్టీని కెసిఆర్‌ పట్టించుకోలేదు. అయితే…బిజెపి, కాంగ్రెస్‌ యేతర పార్టీలతో కూటమి అంటే కమల్‌ హాసన్‌ను తప్పక కలవాల్సిందే. ఎందుకంటే ఆయన కూడా అలాంటి భావజాలంతోనే ఉన్నారు. ఇక రజినీకాంత్‌ బిజెపికి దగ్గరగా ఉంటారన్న వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఈ ఇద్దరినీ తరువాతైనా కలుస్తారా…లేదా అనేది చూడాలి. ఇంకా శరత్‌కుమార్‌, విజయ్‌కాంత్‌ వంటి సినిమా నటుల పార్టీలూ ఉన్నాయి. వీరితోనూ మాట్లాడాల్సివుంటుంది.

ఇక అసలు విషయానికొస్తే…చెన్నైకు అతిథిగా వెళ్లిన కెసిఆర్‌కె స్టాలిన్‌ విశాలమైన అరటి ఆకు పరచి, తమిళనాడు వంటకాలు వడ్డించారు. తమిళనాడు సాంబారు తాగాలన్నంత రుచిగా ఉంటుంది. ఎంత మంచి భోజనం పెట్టినా కెసిఆర్‌కె రుచించివుండదు. ఎందుకంటే…ఆయన చెన్నైలో ఉన్నా ఆలోచనలన్నీ హైదరాబాద్‌లో ఉండివుంటాయి. అక్కడే అదేరోజు ప్రొఫెసర్‌ కోదండరాం ఆధ్వర్యంలో ‘తెలంగాణ జన సమితి’ పార్టీ ఆవిర్భవించింది. నిరంకుశంగా పాలిస్తున్న కెసిఆర్‌ను గద్దె దించడానికే జన సమితి ఆవిర్భవించిందని ఆయన ప్రకటించారు. ఆవిర్భావ సభ అందరూ ఊహించినదాని కంటే బాగానే జరిగింది. ఇప్పటికే తెలంగాణలో బహుజన ఫ్రంట్‌ ఏర్పాటయింది. కాంగ్రెస్‌ ఊపుమీదుంది. తెలంగాణ జన సమితి, బహుజన లెఫ్ట్‌ఫ్రంట్‌ ఏకమైతే టిఆర్‌ఎస్‌ ఇబ్బందికరమే. డిల్లీలో బిజెపి, కాంగ్రెస్‌లను గద్దెనెక్కనీకుండా చూడాలని కెసిఆర్‌ ప్రయత్నిస్తుంటే…తెలంగాణలో కెసిఆర్‌ను గద్దె దించడానికి శక్తులన్నీ ఏకమవుతున్నాయి. కెసిఆర్‌ తన మాటలతో ఇలాంటి వాటిని పూచికపుల్లలా తీసిపడేయచ్చుగానీ….ఆ పార్టీకి ఇది కచ్చితంగా ఆందోళన కలిగించే అశంమే. అందుకే….ఆయన చెన్నైలో తమిళనాడు భోజనం తిన్నా…అదేమంత రుచించివుండదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*