కెసిఆర్ రిట‌ర్న్ గిఫ్ట్ వ్యాఖ్య‌ల‌కు విప‌రీత అర్థాలు..!

తెలంగాణ ఎన్నికల్లో వేలుపెట్టిన చంద్రబాబుకు సరైన గుణపాఠం చెప్పడానికి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో తాను జోక్యం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు కెసిఆర్‌ మాటలకు విపరీత అర్థాలను తీస్తూ…..ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ఆయనపైకి ఉసుగొల్పే కుట్రలకు అప్పుడే తెరతీసింది తెలుగుదేశం అనుకూల మీడియా. బాబును రక్షించడం కోసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య చిచ్చుపెట్టేడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.

తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత తొలిసారి మీడియాతో మాట్లాడిన కెసిఆర్‌…తెలంగాణ ఎన్నికల్లో జోక్యం చేసుకున్నందున తాను కూడా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో కల్పించుకుంటానని చెప్పారు. బాబు నాకు గిఫ్ట్‌ ఇచ్చారు…రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వకుంటే ఎలా? విజయవాడకు వెళ్లి ఆ గిఫ్ట్‌ ఏదో ఇస్తాను…అని తనదైన శైలిలో కెసిఆర్‌ చెప్పారు.

కెసిఆర్‌ కోపమంతా చంద్రబాబు నాయుడిపైనే. ఎందుకంటే కెసిఆర్‌ను గద్దె దింపడానికి తనకు బద్ధశత్రువైన కాంగ్రెస్‌తో చంద్రబాబు జతకట్టారు. ప్రచారంలో కెసిఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అప్పటిదాకా కాస్త డీలాగా వున్న కాంగ్రెస్‌…చంద్రబాబు జత కలిసే సరికి ఎక్కడలేని బలం వచ్చినట్లు ప్రవర్తించింది. కెసిఆర్‌ ఓడిపోతున్నారన్నంతగా ప్రచారం చేశారు. అయితే ఫలితాలు కెసిఆర్‌కు అనుకూలంగా వచ్చాయి.

అందుకే కేసిఆర్‌…ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో తాను జోక్యం చేసుకుంటానని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి లక్షల మంది తమకు ఫోన్లు చేసి…ఇక్కడి రాజకీయాల్లో జోక్యం చేసుకోమని కోరుతున్నారని కూడా కెసిఆర్‌ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ నేరుగా ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేయకపోవచ్చుగానీ… ఆయన తెలగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారనడంలో సందేహం లేదు. తెలుగుశాన్ని ఓడించడం కోసం కెసిఆర్‌ తన శాయశక్తులా కృషి చేస్తారనడంలో అనుమానాలు అవసరం లేదు.

అందుకే….అప్పుడే చంద్రబాబు తన అనుకూల మీడియా ద్వారా కెసిఆర్‌పై దాడి మొదలుపెట్టారు. ఓ టివి ఛానల్‌ ఇదే అంశంపై చర్చ నిర్వహించింది. కెసిఆర్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వడమంటే ఏమిటి? ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టులను అడ్డుకుంటారా? అనే కోణంలో చర్చ లేవదీసింది. రిటర్న్‌ గిఫ్ట్‌ అంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఇస్తారా…అనే అర్థం లేని చర్చను మొదలుపెట్టింది. చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానని కెసిఆర్‌ చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు రంగుపులిమే ప్రయత్నం చేశారు. అంతేకాదు…తెలంగాణ ఉద్యమ కాలంలో ఆంధ్ర నాయకులకు వ్యతిరేకంగా కెసిఆర్‌ మాట్లాడిన మాటల వీడియోలనూ మెల్లగా ప్రచారంలోకి తెస్తున్నారు.

ఇటువంటి చర్చ, ఇటువంటి ప్రచారం…రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేలా ఉంది. అంతేకాదు…హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్రులకూ ఇబ్బంది కలిగిస్తుంది. ఇంకా చెప్పాలంటే…తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడే ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. సీమాంధ్ర సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే పర్యటించారు. మీరెవరూ భయపడాల్సిన పనిలేదు…నేనున్నాను అంటూ పరోక్షంగా విభేదాలను సృష్టించేందుకు పూనుకున్నారు. అయితే…చంద్రబాబు మాటల్లోని కుత్సితాన్ని సెటిలర్లు గుర్తించారు. అందుకే…ఆ ప్రాంతాల్లోనూ కూటమి అభ్యర్థులను ఓడించారు.

ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకోవాలంటే….ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్‌ఎస్‌ కాస్త కటవుగా ఉన్నమాట వాస్తవం. అప్పుడు టిఆర్‌ఎస్‌ గురించి సెటిటర్ల కాస్త భయం నెలకొన్నమాట కూడా వాస్తవమే. అయితే…ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణలోని సీమాంధ్రులకు చిన్నపాటి ఇబ్బంది కూడా కలిగించలేదు. ఇది సెటిలర్లకు ఎంతో భరోసానిచ్చింది. అందుకే…గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలైనా, ఈవాల్టి అసెంబ్లీ ఎన్నికల్లోనైనా టిఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచారు సీమాంధ్రులు.

ఇటువంటి ఆచరణ కళ్లముందు ఉండగా….చంద్రబాబుకు వ్యతిరేకంగా కెసిఆర్‌ చేసిన వ్యాఖ్యలకు విపరీత అర్థాలు, అనవర్థమైన భాష్యాలు చెబుతూ…తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేందుకు కుతంత్రాలు ప్రారంభించారు. చంద్రబాబుకు వ్యతిరేకమంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు వ్యతిరేకం ఎలా అవుతుంది? తెలుగుదశం పార్టీకి చెందిన వ్యాపార వేత్తలపై ఐటి, ఈడి దాడులు జరిగినపుడు కూడా…ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై జరుగుతున్న దాడిగా అభివర్ణించేందుకు టిడిపి అనుకూల మీడియా ప్రయత్నించింది. ఇప్పుడూ అదే చేస్తోంది. అయితే…దీన్ని తెలుగు ప్రజలు అంత తేలిగ్గా విశ్వసించబోరన్న వాస్తవం త్వరలోనే అందరికీ బోధపడుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*