కెసిఆర్‌లో అప్పుడే ప్రధాని కళ వచ్చేసిందోచ్‌..!

బిజెపికి, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తానంటూ రాష్ట్రాలు పట్టుకుని తిరుగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుకు అప్పుడే ప్రధాన మంత్రి కళ వచ్చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ‘రైతుబంధు’ పథకానికి సంబంధించి పత్రికలకు ఇచ్చిన ప్రకటనలను చూస్తే….కెసిఆర్‌ దేశ ప్రజలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. రైతులకు పంటల సాగుకోసం ఏడాదిలో రూ.8000 ఇచ్చే రైతుబంధు పథకాన్ని ప్రవేశపెడుతున్న కెసిఆర్‌…దాన్ని దేశ వ్యాపితంగా ప్రచారం చేసుకుంటున్నారు. తెలుగు పత్రికలకు రెండు పేజీల పూర్తి ప్రకటనలు ఇచ్చిన ఆయన….తమిళనాడు, కర్నాటక, కేరళ, బెంగాల్‌….ఏ రాష్ట్రాన్నీ విడిచిపెట్టకుండా భారీ ప్రకటనలు ఇచ్చారు. ‘దేశ రైతాంగానికి స్వర్ణయుగం’ అని శీర్షికతో ప్రకటనలు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ పథకం దేశంలోని అన్ని రాష్ట్రాలూ అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని కాబోలు. తాను ప్రధానమంత్రి అయితే ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టగలనని దేశ ప్రజలకు చెప్పడం కావచ్చు. ఎన్ని కోట్లు ఖర్చు చేశారోగానీ ఆయా ప్రాంతీయ భాషల్లో ప్రకటనలు ఇచ్చారు. తాను భవిష్యత్తులో చేయబోతున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయత్నాలకు దీన్ని అవకాశంగా ఉపయోగించుకున్నారు. ఈ ప్రకటనల్లో కెసిఆర్‌ ఫొటో తప్ప వ్యవసాయ మంత్రి ఫొటో కూడా లేదు. దీనికి కారణం దేశ వ్యాపితంగా కెసిఆర్‌ ఫోకస్‌ కావాలనుకోవడమే కావచ్చు. ఏమైనా అప్పుడే కెసిఆర్‌లో ప్రధాన మంత్రి కళ వచ్చేసింది.

ఇక రైతుబంధు పథకం విషయానికొస్తే….వైసిపి అధినేత జగన్‌ గత ఏడాది కాలంగా నవరత్నాలు పేరుతో ప్రచారం చేస్తున్న పథకాల్లో ఇదీ ఉంది. వ్యవసాయానికి ఏడాదికి రూ.12 వేలు పెట్టుబడి కోసం రైతులకు ఇస్తానని జగన్‌ ప్రకటించారు. ఇంతలోనే కెసిఆర్‌ ఈ పథకాన్ని కొద్దిగా మార్పులు చేసి, ఒక్కో పంట కాలానికి రూ.4000 పెట్టుబడిగా ఇస్తానని ప్రకటించారు. ఈ పథకం దేశంలోని రైతాంగానికి స్వర్ణయుగం అంటూ దేశమంతా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రెడిట్‌ కెసిఆర్‌కు దక్కుతుందా లేకా జగన్‌ మోహన్‌ రెడ్డికి దక్కుతుందా? ఎవరికి దక్కినా ఓ మంచి పథకానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు కెసిఆర్‌ను అభినందించాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*