కెసిఆర్‌ గారూ…మీ గురువును చూసి నేర్చుకోండి!

ఫెడరల్‌ ఫ్రంట్‌ నిర్మిస్తానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్‌ అధినేత గత కొంతకాలంగా విమానం వేసుకుని దేశమంతా పర్యటిస్తున్నారు. ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తున్నారు. అయితే ప్రాంతీయ పార్టీల నేతలంతా ఒకచోటికి చేరితే…ఆ వేదికను ఉపయోగించుకోవడంలో కెసిఆర్‌ విఫలమయ్యారు. అదే వేదికను ఒకప్పటి కెసిఆర్‌ రాజకీయ గురువు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా మలచుకున్నారు. ప్రాంతీయ పార్టీలతో చంద్రబాబు నాయుడే కూటమి ఏర్పాటు చేయబో తున్నంతగా పత్రికలు, మీడియా హడావుడి చేశాయి. కర్నాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సభకు దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల నేతలను ఆహ్వానించారు. అయితే…కుమారస్వామి కాంగ్రెస్‌ సహాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటం, కాంగ్రెస్‌ అధినేతలు సోనియా, రాహుల్‌ గాంధీ కూడా ప్రమాణస్వీకారోత్సవ సభలో పాల్గొనడంతో కెసిఆర్‌ ఆ వేదికపైకి వెళ్లేందుకు సిద్ధపడలేదు. అందుకే ఒకరోజు ముందుగానే వెళ్లి కుమారస్వామిని అభినందించి వచ్చేశారు. బెంగళూరు సభకు మమతా బెనర్జీ, అఖిలేష్‌ యాదవ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, వామపక్షాల నేతలు, శరత్‌ యాదవ్‌ తదితరులు వచ్చారు. వీరందరితో చంద్రబాబు నాయుడు చర్చలు జరిపినట్లు వార్తలొచ్చాయి. ‘ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేయడమే మా పని…ఇందుకు నేను, చంద్రబాబు నాయుడు ముందడుగు వేస్తున్నాం’ అని మమతా బెనర్జీ ప్రకటించారు. కెసిఆర్‌ కోల్‌కతాకు వెళ్లి గతంలోనే ఆమెను కలిశారు. తీరా ఆమె ఇటువంటి ప్రకటన చేశారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా జరిగింది. అటువంటి పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడే కాంగ్రెస్‌ కలిసి వేదిక పంచుకోడానికి వెనుకాడలేదు. కెసిఆర్‌ మాత్రం ఆ పని చేయలేనంటూ….ప్రాంతీయ పార్టీల నేతలను కలుసుకునే అవకాశం కోల్పోయారు. కెసిఆర్‌ ఉండివుంటే సీన్‌ ఇంకోలా వుండేది. ఈ సభకు వెళ్లాలా వాద్దా అనే మీమాంశ నుంచి సరైన నిర్ణయం తీసుకోవడంలో కెసిఆర్‌ విఫలమయ్యారు. చంద్రబాబు సక్సెస్‌ అయ్యారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*