కెసిఆర్‌, జగన్‌లతో ఇరుకునపడిన చంద్రబాబు!

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇద్దరూ కలిసి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇరుకునపడేశారు. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడిని రైతుకు ఉచితంగా అందించే ‘రైతుబంధు’ పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారంచుడుతోంది. రబీలో రూ.4,000, ఖరీఫ్‌లో రూ.4,000 ఇస్తామని కెసిఆర్‌ ప్రటించారు. దీనివల్ల 58 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. వైసిపి అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి ఏడాది క్రితం ప్రకటించిన ‘రవరత్నాలు’ పథకాల్లోనూ ఇదివుంది. పంటల సాగు కోసం ఏడాదికి రూ.12,000 ఇస్తానని జగన్‌ ప్రటించారు. పాదయాత్రలో ఇదే విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇంతలోనే కెసిఆర్‌ పథకాన్ని ఆచరణలో పెట్టారు. వాస్తవంగా రైతులు పంటల సాగుకు పెట్టుబడులు దొరక్క అప్పులపాలవుతున్నారు. స్వామినాథన్‌ వంటి వాళ్లు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ…వ్యవసాయానికి పెట్టుబడులు ప్రభుత్వమే సమకూర్చాలని సిఫార్సు చేశారు. దీన్ని కెసిఆర్‌ ఆచరణలోకి తేవడం అభినందించాల్సిందే. ఇది ఎంతవరకు సక్రమంగా అమలు చేస్తారనేది తరువాత అంశం. ఇప్పుడు చంద్రబాబుకు సమస్య వచ్చిపడింది. ఇక్కడి రైతులకూ ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టాల్సిన అనివార్యపరిస్థితి ఏర్పడింది. రుణమాఫీ అనేది ఒక ఏడాదికి సంబంధించిదినది. ఇది ఎప్పటికీ మేలు చేసే పథకం. మరి చంద్రబాబు నాయుడు ఈ పథకంపై ఎలా స్పందిస్తారో చూడాలి?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*