కెసిఆర్ గారు…. సీమను రతనాల సీమ చేయడమంటే ఇదేనా…?

సరిగ్గా వారం రోజులు కూడా కాలేదు. దైవ దర్శనం కోసం కంచికి వెళ్లివస్తూ చిత్తూరు జిల్లా నగరిలో వైసిపి ఎమ్మెల్యే రోజా ఇంట ఆతిథ్యం తీసుకొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మీడియాతో మాట్లాడుతూ రాయలసీమను రతనాల సీమ చేసేందుకు తాను బద్ధుడై వున్నట్లు
ఉద్ఘాటించారు. గోదావరి కృష్ణ నదులు అనుసంధానం చేయడం ద్వారా సీమను కోనసీమలాగా మార్చడంలో తిరుగుండదనే ప్రచారం ముమ్మరం చేశారు. అంతే కాదు. అంత క్రితం ఒకమారు ఉత్తరాంధ్ర మొదలుకొని రాయలసీమ వరకు సాగునీరు అందించే పథకాల గురించి ఎపి ఇంజనీరింగ్ ఛీప్ లాగా ప్రకటన చేసిన సందర్భమూ లేకపోలేదు.

పాపం….వెర్రివాళ్లై నీటి కోసం మొహం వాచి కన్నుల కాయలుకాచేట్టు ఎదురుచూస్తున్న సీమ ప్రజలు కెసిఆర్ మాటలను నమ్మక తప్ప లేదు. ఇప్పుడు కెసిఆర్ కన్నా రెండాకులు ఎక్కువగా మన ముఖ్యమంత్రి నదుల అనుసంధానం గురించి ఆరాట పడుతున్నారు. ఇదంతా బాగానే వుంది.

అయితే వారం రోజులు కూడా గడవ లేదు… సీమవాసులకు తెలంగాణ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అధికంగా నీరు తరలించుతోందని కృష్ణ యాజమాన్యం బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసి సీమ ప్రాంత ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ నెల 10, 11, 12 తేదీల్లో 9.24 టియంసిలు పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండీ తరలించి 7.28 టియంసిలే తరలించినట్లు చెబుతున్నారని, ఈ అంశం పరిశీలనకు సంయుక్త బృందం ఏర్పాటుకు అనుమతించాలని, తెలంగాణ ఇంజనీరింగ్ ఛీప్ లేఖ రాశారు. గమనార్హమైన అంశమేమంటే నీటి ఎద్దడి రోజుల్లో ఇలాంటి ఫిర్యాదు చేస్తే కొంత మేరకు అర్థం చేసుకోగలం. వరదలు వెల్లువెత్తి వందల టియంసిలు నీరు సముద్రం పాలవుతున్న తరుణంలోనూ ఇటువంటి ఫిర్యాదును సీమ ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి..!
అదీ రెండు టిఎంసిల నీరు అదనంగా తీసుకున్నారని ఫిర్యాదు చేశారంటే దీన్ని ఏరకమైన సుహృద్భావం అనాలనో పండితుడైన ముఖ్యమంత్రి కెసిఆర్ చెబితేనే బాగుంటుంది.

వాస్తవంలో ఏంజరిగిందో పక్కన పెడితే ఒక వేపు కృష్ణకు వరద వెల్లువెత్తి వందల టియంసిల నీరు సముద్రం పాలు అవుతోంది. సీమలో చినుకు పడలేదు. తాగునీటికే కటకట లాడి పోతున్నారు.. గొంతెండి పోతున్న రాయలసీమకు అదనంగా అదీ రెండు టిఎంసిలు తరలించారని స్నేహ సుహృద్భావాలు వెల్లి విరిసే రోజుల్లోనే పేచీకి దిగారంటే మున్ముందు నదులు అనుసంధానం జరిగితే పరిస్థితులు ఎంత భయంకరంగా వుంటాయో సీమ వాసులను ఆలోచనలో పడేస్తోంది.

         - శంకరయ్య, 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*