కెసిఆర్ గారూ… సీమను రతనాలసీమ చేస్తామని మీరేనా మాట్లాడుతున్నది?

– పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పగలగొట్టాలని చెప్పడం మరచిపోయారా?
– ఇంతలోనే ఎంత మార్పు!

కృష్ణా నదీ జలాలు పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా దొంగతనంగా రాయలసీమకు తరలించుకుపోతున్నారని సరిగ్గా గత నీటి సంవత్సరంలో మీరు ఆరోపించ లేదా? కృష్ణ బేసిన్ నుండి పోతురెడ్డిపాడుహెడ్ రెగ్యులేటర్ ద్వారా పెన్నా బేసిన్ కు అక్రమంగా నీరు తరలిస్తున్నారని అభ్యంతరం చెబుతూ బ్రెజేష్

కుమార్ ట్రిబ్యునల్ ముందు మీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన విషయం ఇంతలోనే మరచి పోయారా? ఉమ్మడి రాష్ట్రంలో జీవో 69 రద్దును మీరు వ్యతిరేకించ లేదా? ఇంతకీ ఇప్పుడు 69 జీవో రద్దుకు అంగీకరించుతారో లేదో తేల్చి చెప్పి రత్నాల సీమ గురించి మాట్లాడండి. ఎంతలో ఎంత మార్పు? ఇంతలోనే రాయలసీమ పై ఇంత ప్రేమాభిమానాలు ఎందుకు పుట్టుకొచ్చాయి? రాయలసీమను రతనాల సీమ చేస్తామని మీరు చెప్పడాన్ని సీమ ప్రజల చెవులు నమ్మడం లేదు. ఈ అనుమానాలకు జవాబు చెప్పండి. లేదా గతంలో సీమ యెడల విషం కక్కింది తప్పని గాని లేదా ప్రస్తుతం తెలంగాణ అవసరాల దృష్ట్యా మాటలు మార్చుతున్నానని గాని చెబితే బావుంటుంది.

మీకూ-చంద్రబాబు నాయుడు తగాదాలు వుండవచ్చు. ఆరోజు వున్న సీమ ప్రజలే ఈ రోజు వున్నారు. మీ రాజకీయ వైషమ్యాలతో ఒకనాడు సీమ ప్రజల ప్రయోజనాలతో మీరు చెలగాట మాడారు. ఈ వాస్తవం గుర్తించి సీమ ప్రజలకు ముందుగా
క్షమాపణలు చెబితే గాని మాటలు మార్చిన మీ ప్రసంగాన్ని సీమ ప్రజలు అవగతం చేసుకోలేరు. మీరు ఈ రోజు ఎన్ని మాయ మాటలు చెప్పినా సీమ ప్రజలు నమ్మే స్థితిలో లేరు.

బచావత్ కమిషన్ ఎపికి మిగిల్చిన కృష్ణమిగులు జలాలను బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్  అన్ని రాష్ట్రాలకు పంపకం చేసింది. . ఇప్పుడు రాయలసీమ యెడల సానుభుతి ఒలక బోస్తూ గోదావరి మిగులు జలాలు కూడా కాజేసేందుకు సిద్ద మౌతున్న అంశం మీరు ఎంత దాచినా దాగదు. బచావత్ కమిషన్ అవశేష ఎపికి కేటాయించిన కృష్ణ నికర జలాలు 511 టియంసిలు కూడా తిరిగి పంపకం చేయాలని ట్రిబ్యునల్ వద్ద అఫిడవిట్ దాఖలు చేసిన అంశం మా ప్రజలు ఏలా మరచిపోతారు? నదుల అనుసంధానంలో తెలంగాణ ఇంజనీర్లు బృందం రూపొందిన పథకం ప్రకారం ఉమ్మడి ఎపికి గోదావరి ట్రిబ్యునల్ కేటాయించిన నీరు తీసి వేసి మిగిలిన జలాలు మొత్తం పంచు కొనేందుకు సిద్ధం కావడం నిజం కాదా? దిగువ రాష్ట్రమైన ఎపికి మిగులు జలాల హక్కులు ఈ అనుసంధానంతో హరించడం వాస్తవం కాదా?

పట్టిసీమ నుండి వచ్చిన 80 టియంసిలలో 45 టియంసిలు ఇవ్వాలని మొన్నటి వరకు అడగడం మరచి పోయారా? మరి తెలంగాణ లో రెండు మూడు ప్రాజెక్టుల నుండి కృష్ణ బేసిన్ కు 240 టియంసిల జలాలు తరలిస్తున్నారే…అందులో ఎపికి వాటా ఇవ్వాలి కదా? ఇవన్నీ తప్పించు కొనేందుకు నదులు అనుసంధానం తెర మీదకు తెచ్చారని సీమ ను రత్నాల సీమ చేస్తానని చెబుతున్నారంటే మీ సమాధానం ఏమిటి?

ఆ రోజుకు ఈ రోజుకు సీమ ప్రజలు ఒకేలాగావున్నారు. మరి నాలుగైదు నెలల కిందట సీమ ప్రజల ప్రయోజనాలపై మీరు కక్కిన విషం ఏలా మాయమౌతుంది? కాలు జారినా వెనక్కి తీసికోవచ్చు. మాట జారితే వెనక్కి తీసుకోవడం ఎట్టిపరిస్థితుల్లోనూ కుదర లదని పండితులైన మీకు తెలియదని భావించలేం. ఏతావాతా తేలిన దేమంటే అవసరార్థం మాటలు మార్చే ఫక్తు రాజకీయ వేత్తగానే సీమను రతనాలూసీమ చేస్తామని ప్రకటించినట్లు భావించాలసి వుంది.

             – వి.శంకరయ్య, 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*