కెసిఆర్ గారూ, స్నేహమంటే ఇదేనా.. !?

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రస్తుతం చెట్ట పట్టాలేసుకొని వ్యవహరిస్తున్నారు. ఒకరి మీద మరొకరు ఈగ వాలనీయడం లేదు. కృష్ణ, గోదావరి నదులకు ఈ ఏడాది వరదలు వచ్చినట్లే ఇరువురు ముఖ్యమంత్రులు మధ్య, రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్నేహ సౌభ్రాతృత్వ సంబంధాలు వెల్లువెత్తి వరదలై పారుతున్నాయి. దురదృష్టం ఏమంటే ఈ వరదల ఉధృతికి మాత్రం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యంగా రాయలసీమ ప్రజల ప్రయోజనాలు ఆనవాలు లేకుండా కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది.

రాయలసీమ ప్రజల ప్రయోజనాలను తెలంగాణ ప్రభుత్వం తోక కోసి సున్నం పెడుతున్నా ఎపి ప్రభుత్వాన్ని పక్కన బెడితే అనూహ్యమైన మత్తులోపడి ఇన్నాళ్లూ నీళ్ల కోసం గళం ఎత్తిన సీమవాసులు గొంతుకలు మూగ పోయాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కంచి దైవ దర్శనం కోసం వెళ్లి తిరిగి వెళ్తూ నగరిలో మాట్లాడుతూ గోదావరి, కృష్ణ నదులు అనుసంధానంతో రాయలసీమను రతనాల సీమ చేస్తామన్నారు. ఈ పాటికే ఎన్నో మార్లు మోసపోయిన సీమ ప్రజలు ఓహో ఇంకేముందని అందరూ కాకున్నా పలువురు సంబరపడ్డారు. తిరిగి రెండు రోజులకే దిమ్మ దిరిగే వార్త విన్నారు.

ఆగస్టు 10 నుండి 12 తేదీలు మధ్య రెండు రోజులు పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి రెండు టిఎంసిల జలాలు ఎక్కువగా విడుదల చేశారని తెలంగాణ ఇంజనీరింగ్ ఛీఫ్ కృష్ణ యాజమాన్యం బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన కు రాయలసీమలో ఓ మోస్తరు స్పందన వచ్చింది. రానున్న ప్రమాదం గుర్తించ లేదు.
ఇదిలావుండగా కృష్ణ నదికి వరద వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 400 టియంసిల జలాలు సముద్రం పాలయ్యాయి. ఇంకా ఇప్పుడు కూడా ప్రకాశం బ్యారేజీ నుండి వేల క్యూసెక్కులు విడుదల అవుతున్నాయి.‌ ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజనీరింగ్ ఛీఫ్ బోర్డుకు లేఖ రాస్తూ వందల టియంసిలు నీరు సముద్రం పాలవుతున్నందున ప్రస్తుతం ఇరు రాష్ట్రాలు వాడుకున్న నీటి లెక్కలు పరిగణనలోనికి తీసుకోకూడదని కోరారు. ఈ లేఖను బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి పంపింది. అందుకు తెలంగాణ ససేమిరా అనింది. ఎందుకంటే ఎపి కి 150 టియంసిలు, తెలంగాణకు 55 టియంసిల నీరే కేటాయింపబడింది. అంతేకాదు…శ్రీ శైలం నుండి రాయలసీమకు వంద టియంసిలు కేటాయించితే తెలంగాణకు కేవలం 14.56 టియంసిల నీటి కేటాయింపులు జరిగాయి.

రెండు రోజుల్లో రెండు టిఎంసిల నీరు తరలించినందుకు బోర్డుకు ఫిర్యాదు చేయడమే కాకుండా వందల టియంసిలు సముద్రం పాలు కావడానికి అంగీరించుతూ ఎపి వరద సమయంలో వాడుకున్న నీరు లెక్కించాలని కోరడం ఇదెక్కడి స్నేహ సౌభ్రాతృత్వమో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పవలసివుంది. మున్ముందు రాయలసీమను రతనాల సీమ చేయడ మంటే ఇదేనా? ఇప్పటికే పలుమార్లు మోసపోయిన సీమ వాసులు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వద్దకు వెళ్లి స్నేహమంటే ఏలా వుంటుందో తెలుసు కొని వస్తే భవిష్యత్తుకు ఉపయోగ పడుతుంది. ప్రధానంగా సీమ పరిరక్షణ ఉద్యమ నేతలకు ఈ అనుభవం ఎంతో అవసరం

  • వి.శంకరయ్య,
    విశ్రాంత పాత్రికేయులు, 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*