కెసిఆర్ – చంద్రబాబు తిట్ల పురాణంలో వెలుగు చూస్తున్న చారిత్రక వాస్తవాలు

తెలంగాణ, ఎపి రాష్ట్రాల ముఖ్యమంత్రుల వాద సంవాదం రసకందాయంలో పడింది. విశేష మేమంటే ఈ తిట్ల పురాణంతో చరిత్రలో  సమాధి చేయబడిన కొన్ని వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. కెసిఆర్ కు వ్యతిరేకంగా టిడిపి నేతలుగాని ముఖ్యమంత్రి చంద్రబాబుగాని చెబుతున్న సమాధానాల సారాంశంలో రెండు మూడు అంశాలు ఇతరులు ఎవరైనా ప్రస్తావించితే అంత ఎత్తున టిడిపి నేతలు లేచేవారు. నేడు అవసరం కొద్దీ తుదకు పరోక్షంగా వారే అంగీకరించు తున్నారు.

కెసిఆర్ – చంద్రబాబు అంశంలోనే కాదు. చరిత్రలో పలు సందర్భాల్లో కొన్ని
వాస్తవాలు తాత్కాలికంగా మరుగు పడటం కాలం కర్మం కలసి వస్తే వెలుగు చూడటం సహజమే..

ఎపి ముఖ్యమంత్రి చేత జై తెలంగాణ అనిపించానని కెసిఆర్ గొప్పలకు పోయి ఆరోపించారు. ఇందుకు సమాధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ఎప్పుడూ తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని సమాధానం చెప్పారు. మరి రాష్ట్ర విభజనను–వ్యతిరేకించింది ఎవరు? సీమాంధ్ర ప్రజలు మాత్రమేనని ముఖ్యమంత్రి అంగీకరించారు. తను రాష్ట్ర విభజనకు అనుకూలమని ఇప్పటికైనా అంగీకరించి నందుకు అభినందించాలి. ఈ మాట రాష్ట్ర విభజన సమయంలో ముఖ్యమంత్రిగాని టిడిపి నేతలుగాని ఎందుకు చెప్ప లేక పోయారు?

రాష్ట్ర విభజనతో సీమాంధ్రకు అన్యాయం జరిగిందని ఈ పాపమంతా కాంగ్రెస్బి, జెపిలు భరించాలని ముఖ్యమంత్రి తో పాటు టిడిపి నేతలు ఇటీవల వరకు వాదించారు. ప్రస్తుతం పాపమంతా బిజెపి పై నెడుతున్నారు.  రాష్ట్ర విభజన సమయంలో విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ప్రజలు ఉద్యమాలు సాగించారు.  ఎపికి అన్యాయం జరుగకుండా విభజన జరగాలని ఏ రాజకీయ పార్టీ నేత అయినా, తుదకు ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా పోరాడిన సందర్భంలేదు కదా?  రెండు రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఇలా విభజన చేయవచ్చని ఏదైనా ప్రతిపాదన పెట్టారా? లేదే?

విభజన పాపంలో ముఖ్యమంత్రికి భాధ్యత వున్నా ఇన్నాళ్లు తప్పించుకు తిరిగి ఇపుడు తెలంగాణ లో మార్కులు వేసు కొనేందుకు లేదా కెసిఆర్ నోరు మూయించేందుకు వాస్తవాలు అంగీకరించుతున్నారు. సీమాంధ్ర కు అన్యాయం జరిగిందని కాలర్ ఎగ రేసి ఉపన్యాసాలు దంచే ఎవరైనాకూడా సరే ఆ రోజుల్లో ఒక్క ప్రతి పాదన చేశారా? . ఆలాంటి ప్రతి పాదనలు చేస్తే రాష్ట్ర విభజనకు అనుకూలురనే ముద్ర పడుతుందని ఆఖరుకు చంద్రబాబు కూడా ఆ సాహసం చేయ లేదు కదా.

ఇలాగే మరో ముఖ్య మైన అంశం తెర మీదకు వచ్చింది. కెసిఆర్ కు రాజకీయ బిక్ష టిడిపి పెట్టిందని, చంద్రబాబు వద్ద మంత్రి గా పని చేసి తిరిగి చంద్రబాబు నే పరుష పద జాలంతో దూషించడం సరికాదని టిడిపి నేతలు చెబుతున్నారు. అంత వరకు బాగానే ఉంది.  కాని వివాదాస్పదమైన వైస్రాయి హోటల్ ఎపిసోడ్ తీసుకు వచ్చి – అప్పుడు కథ అంతా నడిపింది కెసిఆర్ అని ముఖ్యమంత్రి కొందరు టిడిపి నేతలు ఆరోపించు తున్నారు.  కెసిఆర్ ను బదనాం చేసేందుకు ఈ ఎపిసోడ్ టిడిపి నేతలు తీసుకు వచ్చి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు.

ఆ రోజుల్లో ఎన్టీఆర్ కు జరిగిన ఘోర అన్యాయం అవమానంలో కెసిఆర్ పాత్ర వుందని బురద చల్ల బోయి అంతిమంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో ఎన్టీఆర్ కు అన్యాయం అవమానం జరిగింది వాస్తవమేని అంగీకరించారు. ఒక్కో సమయంలో ఎంత దాచుకున్నా వాస్తవాలు ఆగవు. అనుకోకుండా బహిర్గతం అవుతాయి. వర్షంపడితే వాతలు మాసి పోతాయనే భావనతో ఈ రోజు ముఖ్యమంత్రి ఏమైనా మాట్లాడితే ప్రజలు మాత్రం వాచ్ డాగ్ లుగా వుంటారు. ఎన్టీఆర్ నుండి తెలుగు దేశం పార్టీని చంద్రబాబు హైజాక్ చేశారని కెసిఆర్ చేసిన ఆరోపణ తిప్పి కొట్ట బోయి… తుదకు ముఖ్యమంత్రి చంద్రబాబు వైస్రాయి హోటల్ ఎపిసోడ్ సందర్భంగా ఎన్టీఆర్ కు అపకారం జరిగింది వాస్తవమేని అంగీరించుతూ ఇందులో కెసిఆర్ కు కూడా భాగస్వామ్యం లేదా అని చెప్పి బొక్క బోర్ల పడ్డారు.

ప్రస్తుతం టిడిపిలో అంతా రివర్స్ గా జరుగుతోంది. ఎవరైనా నేత నోరు జారితే ముఖ్యమంత్రి పిలిచి క్లాస్ తీసుకునే వారు. గతంలో ప్రధాని మోడి పిడికెడు మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చి వెళ్లారని కడుపు మండి జయదేవ్ విమర్శ చేస్తే మోడీ మీద ఈగ వాలకుండా చూచి జయదేవ్ ను పిలిచి మందలించిన అంశం మనం ఇంకా మరచి పోలేదు. ఇప్పుడు ఆలా కాదు. తరచూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగానే పప్పులో కాలు వేస్తున్నారు. తమాషా ఏమంటే అధినేత ముందు నోరు విప్పే నేత టిడిపిలో లేరు. ఫలితంగా ఒక దాని వెంబడి మరొక తప్పు జరుగుతోంది.

                                                                                                   – వి. శంకరయ్య, 984839401

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*