కెెసిఆర్‌ తిట్లను బాగా గుర్తుపెట్టుకున్న టిడిపి నేతలు!

ఫెడరల్‌ ప్రంట్‌పై వైసిపి, టిఆర్‌ఎస్‌ నేతలు చర్చలు జరిపారన్న వార్తలు రాగానే తెలుగుదేశం నాయకులు…తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌, ఆంధ్రావాళ్లను ఏమని తిట్టారో, ఎలా తిట్టారో రాసుకువచ్చి మరీ మీడియాకు చెప్పారు. ఆంధ్రా బిర్యానీ సద్దిలా ఉంటుందని కెసిఆర్‌ అన్నారట. ఆంధ్రవాళ్లంతా దోపిడీదారులే అని అన్నారట. విభజన చట్టంలోని అనేక అంశాల్లో ఏపికి రావాల్సిన వాటా దక్కనీకుండా కెసిఆర్‌ అడ్డుపడుతున్నాడట. అంతేకాదు…కెసిఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ ద్రోహి అట. ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేస్తున్న కెసిఆర్‌తో జగన్‌ ఎలా కలుస్తారని టిడిపి నాయకులు ప్రశ్నించారు.

ఇదంతా బాగానేవుంది. కెసిఆర్‌ తిట్టిన తిట్లు తెలంగాణ ఎన్నికల సమయంలో టిడిపి నాయకులకు ఎందుకు గుర్తుకురాలేదనేది ప్రశ్న. టిఆర్‌ఎస్‌తో కలిసి పని చేయాలనుకుంటే కెసిఆర్‌ తిరస్కరించారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడే స్వయంగా ఒకటికి నాలుగుసార్లు చెప్పారు. ఆంధ్రవాళ్లను అంతగా దూషించిన వ్యక్తితో పొత్తుకు ఎందుకు ప్రయత్నించారు? విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన వాటాను రాకుండా అడ్డుపడుతున్న ద్రోహితో ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఎందుకు అనుకున్నారు?

ఉద్యమ సమయంలో కెసిఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు పనిగట్టుకుని చెప్పడం వెనుక….ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను రెచ్చగొట్టడం మినహా మరో ఔచిత్యం కనిపించదు. ఆమాటకొస్తే….తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు తిట్టలేదా? తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదా? ఇంకా చెప్పాలంటే తెలంగాణ టిడిపి నాయకులూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని….నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందంటూ ఆంధ్రవాళ్లను నిందించలేదా? అలాంటప్పుడు కెసిఆర్‌ ఒక్కరే తిట్టినట్లు ఇప్పుడు ప్రచారం చేయడంలోని ఆంతర్యం ఏమిటి?

తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత కెసిఆర్‌ ఎప్పుడైతే… చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానని ప్రకటించారో అప్పటి నుంచే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను రెచ్చగొట్టడం ప్రారంభించారు. కెసిఆర్‌ వల్లే ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతోందని, అలాంటి వ్యక్తితో జగన్‌ కలుస్తున్నారని ప్రచారం మొదలుపెట్టారు. కెసిఆర్‌ తెలుగుదేశంపైన చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై చేసిన వ్యాఖ్యలుగా ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సెంటిమెంటు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందే ఎత్తుగడ వేస్తున్నారు.

ఇక టిఆర్‌ఎస్‌తో జగన్‌ పొత్తుపెట్టుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అయినా….ఆంధ్రప్రదేశ్‌లో టిఆర్‌ఎస్‌కు ఏముందని పొత్తుపెట్టుకుంటారు? ఇది ఫెడరల్‌ ఫ్రంట్‌కు సంబంధించిన చర్చలు మాత్రమే అని మొత్తుకుంటున్నా….’మీరు పొత్తు పెట్టుకుంటున్నారు… కలిసిపోతున్నారు…’ అంటూ టిడిపి నేతలు వరుసకట్టి విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌తో టిడిపి పొత్తుపెట్టుకుంటే తప్పులేదుగానీ…తమకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని ఉద్యమించిన కెసిఆర్‌తో చర్చిస్తేనే ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేసినట్లు ఫోకస్‌ చేస్తున్నారు.

ఏమైనా రాజకీయాల కోసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలనుకోవడం గర్హనీయం. రాజకీయ విమర్శలు చేసుకోవచ్చుగానీ….తెలంగాణ ఉద్యమ సమయంలో లాగా రెండు ప్రాంతాల మధ్య అగ్గి రాజేయాలనుకోవడం క్షంతవ్యం కాదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*