కొత్త పెళ్లికూతురు దొరికినట్లే…పెళ్లికి లగ్నం ఎప్పుడో అడగండి!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్త పెళ్లికూతురు కోసం చూస్తున్నారు అని ప్రతిపక్ష నేత జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. 70 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబు ఏమిటి? కొత్త పెళ్లికూతురు కోసం చూడటం ఏమిటి అనే అనుమానం, ఆసక్తి ఎవరికైనా కలుగుతుంది. ఏమీలేదు….గత ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేయడమేగాక, ఎన్నికల అనంతరం ఏర్పడిన కేంద్ర ప్రభుత్వంలో టిడిపి భాగం పంచుకుని; రాష్ట్రంలో టిడిపి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో బిజెపికి చోటు కల్పించి; రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసన అంటూ కొన్ని నెలల క్రితం ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్న చంద్రబాబు నాయుడు…కాంగ్రెస్‌తో దోస్తీ కోసం ప్రయత్నిస్తున్నారని గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. ఎన్‌డిఏలో ఉన్నప్పుడే చంద్రబాబు రహస్యంగా రాహుల్‌ గాంధీని కలిసినట్లు వదంతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో బెంగుళూరులో జరిగిన కుమారస్వామి ప్రకాణ స్వీకారోత్సవంలో… రాహుల్‌ గాంధీ, సోనియాగాంధీతో కలిసి చంద్రబాబు నాయుడు కనిపించారు. దీంతో తెలుగుదేశం పార్టీ తన బద్ధశత్రువైన కాంగ్రెస్‌కు దగ్గరవుతున్న దృశ్యం స్పష్టంగా కళ్లకు కట్టింది. దాన్ని దృష్టిలో ఉంచుకునే జగన్‌ మోహన్‌ రెడ్డి ‘కొత్తపెళ్లి కూతురు’ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ చిన్న సవరణ చేసుకోవాల్సివుంది. చంద్రబాబుకు కొత్తపెళ్లి కూతురు దొరికినట్లే. పెళ్లికి లగ్నం ఎప్పుడనేదే తేలాలి. జగన్‌ అడగాల్సిందే అదే!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*