కొబ్బరి చిప్ప ధర రూ.1,365 ఆశ్చర్యపోయినా ఇది నిజం…!

ఏ వస్తువు కావాలన్నా ఆన్‌లైన్‌లో దొరుకుతున్న కాలం ఇది. కంప్యూటర్ల నుంచి పొయ్యిలో వేసే పిడకల దాకా ఏది కావాలన్నా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఆన్‌లైన్‌ కంపెనీలు ప్రతిదాన్నీ మార్కెట్‌ చేసేస్తున్నాయి. ఈ ధోరణి చూసి రాజేశ్వరి అనే ఐపిఎస్‌ అధికారి ఆశ్యర్యం వ్యక్తం చేస్తూ తానూ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. ఇంతకీ ఆ అధికారిని అంతగా ఆశ్చర్యానికి గురిచేసిన విషయం ఏమంటే…కొబ్బరి చిప్పను రూ.1,365 ధరతో అమ్మకానికి పెట్టడమే. ఇంతకీ అసలు విషయం ఏమంటే….

కొబ్బరి కాయ ధర రూ.20 – రూ.30 మించదు. కొబ్బరి కాయలు పండించే రైతుకైతే ఏ ఐదు రూపాయలో పది రూపాయలో వస్తుంది. అలాంటి కాయల్లో కొబ్బరి తీసేసిన తరువాత మిగిలే చిప్పలను పొయ్యిలో మండించి వంట చెరకుగా వినియోగిస్తుంటారు. వాటినే కొంత అందంగా మలచి విక్రయించేవాళ్లు తయారయ్యారు. ఇటువంటి కొబ్బరి చిప్పల ధర రూ.100 దాకా ఉంది. అయితే…ప్రముఖ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థ కొబ్బరి చిప్ప ధరను రూ.1,365గా ప్రకటించింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమంటే…ఇది డిస్కౌంట్‌ ధర. దీని పూర్తి ధర మూడు వేల రూపాయలట. 55 శాతం డిస్కౌంట్‌తో రూ.1,365కే ఇస్తామని ఆ సంస్థ తన అమ్మకానికి పెట్టింది.

ఏం చేద్దాం…డబ్బున్న మారాజులు ఏదైనా, ఎంతకైనా కొనేస్తారన్న గట్టి నమ్మకం సదరు ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థకు గట్టిగా ఉన్నట్లుంది. లేకుంటే…కొబ్బరి చిప్పను ఇంత ధరతో అమ్మకానికి పెట్టే సాహసం చేయగలదా? అయినా ఈ చిప్పను ఎవరు కొంటారా చూద్దాం!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*