కోట్లు మింగిన ‘నీరు-చెట్టు’ లోగుట్టు…త్వరలోనే రట్టు ! శ్రీకాళహస్తి నీటిపారుదల శాఖ అధికారుల్లో ఒణుకు..!!

  • వలిపి శ్రీరాములు,
  • ధర్మచక్రం ప్రతినిధి, శ్రీకాళహస్తి

నీటి పారుదల శాఖ అధికారుల గుండెల్లో ‘నీరు-చెట్లు’ గుబులు రేపుతోంది. శ్రీకాళహస్తి డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ నజీర్‌ హుస్సేన్‌ మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఆయనకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. నీరు-చెట్లు పనుల్లో జరిగిన అవినీతిని గుర్తించేందుకు ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించడంతో ఆ శాఖ అధికారుల్లో ఒణుకు మొదలయింది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిజాయితీగా విచారణ జరిపిస్తే నీరు-చెట్లు పనుల్లో జరిగిన అవినీతి అవినీతి రట్టవుతుందనడంలో సందేహం లేదు.

నీటిపారుదల శాఖ శ్రీకాళహస్తి డివిజన్‌ పరిధిలో మొత్తం 830 చెరువులున్నాయి. ఈ చెరువుల్లో నీరు-చెట్టు పనుల కోసం గత ప్రభుత్వం రూ.125 కోట్లు మంజూరు చేసింది. మొత్తం 1150 పనులు మంజూరుకాగా ఇందులో రూ.10 లక్షల కంటే తక్కువ విలువ చేసే పనులు 1,050 ఉన్నాయి. రూ.10 లక్షలకు మించిన పనులు 100 దాకా ఉన్నాయి. రూ.10 లక్షల లోపు విలువైన పనులన్నీ నామినేషన్‌ పద్ధతిలో కేటాయించారు. కొన్నిచోట్ల రూ.10 లక్షలకుపైగా విలువైన పనులు కూడా నామినేషన్‌ పద్ధతిపైనే అప్పగించారు. టెండర్లు లేకుండా నామినేషన్‌ పద్ధతిలో ఇచ్చే విధానం అధికారులకు, కాంట్రాక్టర్లకు వరమయ్యాయి.

నిబంధనలకు నీళ్లు : ఈ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నాయి. జీవో నెం.1897, తేదీ : 19.04.2017 ద్వారా నీరు-చెట్టు పనులకు మార్గదర్శకాలు జారీ చేశారు. దీని ప్రకారం చెరువుల్లో పూడికతీత, ఫీడర్‌ ఛానల్స్‌ పూడికతీత, చెరువు కట్ట పటిష్టపరచడం, తూములకు మరమ్మతులు…వంటి పనులు చేయాలి. అయితే ఈ నిబంధనలు చాలావరకు పాటించలేదు. ఇక ఏపిఎస్‌ఏసి (ఏపిసాక్‌) నిధులతో చెక్‌డ్యామ్‌లు నిర్మించాలి. పాత చెక్‌డ్యామ్‌ల మరమ్మతుల కోసం ఈ నిధులు వాడకూడదు. రూ.3 లక్షల విలువైన పనులు ఎంపిడివో పరిధిలోకి వస్తాయి. అయితే…ఈ పనుల్లోనూ నిబంధనలను అతిక్రమించారు. కొన్ని చెరువుల పనులను విభజించి కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఇలా ఎందుకు చేశారో అధికారులకే ఎరుక. నీరు-చెట్టులో రూ.10 లక్షల లోపు పనులను జన్మభూమి కమిటీ సభ్యులకు మాత్రమే అప్పగించాలి. అయితే చాలాచోట్ల ఆ కమిటీలతో సంబంధం లేని వారికి అప్పగించారు.

పాత పనులకు కొత్త రూపు : ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన చోటే నీరు-చెట్టు పనులు చేపట్టారు. అప్పటికే చేసిన పనులనే కొత్తగా చేసినట్లు… యంత్రాలతో కొత్తిగా మట్టితవ్వి మాయచేశారు. అసులు నీరు-చెట్టు కింద రూపాయి ఖర్చు చేయకున్నా…ఉపాధి హామీలో చేసిన పనులనే చూపెట్టి నిధులు స్వాహా చేసిన ఉదంతాలున్నాయి. ఈ అక్రమాలపై ఎప్పటికప్పుడు పత్రికల్లో కథనాలు వచ్చినా….స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. అక్రమాలకు పాల్పడిన అధికారులకు, కాంట్రాక్టర్లకు అప్పటి అధికార పార్టీ అండదండలు ఉండటమే ఇందుకు కారణం.

నజీర్‌ హుస్సేన్‌కు నోటీసులు : శ్రీకాళహస్తి నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు నజీర్‌ హుస్సేన్‌కు ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఈ తరుణంలో ఆయన సెలవుపై వెళ్లడం చర్చనీయాంశం అయింది. ప్రధానంగా నీరు-చెట్టు పనులకు సంబంధించిన రికార్డులను ఎస్‌ఇకి ఎందుకు అప్పగించలేదని నోటీసుల్లో ప్రశ్నించారు. నీరు-చెట్టు నిధులతో చెరువుల అభివృద్ధి పనులు చేపట్టమంటే…పైపులైను పనులు, కల్వర్టులు, రక్షిత గోడులు, పక్క గోడలు, కాజ్‌వే పనులు ఎందుకు చేశారని అడిగారు. ఏసిఎస్‌ఏసి నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు వినియోగించారని నిలదీశారు. నీరు-చెట్టు పనులను జన్మభూమి కమిటీలకు బదులు ఇతరులకు ఎందుకు ఇచ్చారో వివరణ ఇవ్వాలని నోటీల్లో కోరారు. జిల్లా కలెక్టర్‌ అనుమతి లేకుండా పనులు కేటాయించడాన్ని కూడా తప్పుబట్టారు. వీటన్నింటిపై వివరణ ఇవ్వాలని నజీర్‌ను ఉన్నతాధికారులు ఆదేశించారు.

అద్దె వాహనం తకరారు : శ్రీకాళహస్తి నీటిపారుదల శాఖ కార్యాలయంలో అద్దె వాహనం వివాదం కొనసాగుతోంది. ఈ కార్యాలయ ఉన్నతాధికారి కోసం అటవీశాఖ అధీనంలోని ఒక వాహనాన్ని కేటాయించారు. ఆ వాహనాన్నే సదరు అధికారి వినియోగించేవారు. ఇదే సమయంలో మరో వాహనం (ఏపి03 టిహెచ్‌ 0571) అద్దెకు తీసుకున్నట్లు లెక్కలు చూపుతూ నిధులు డ్రా చేశారు. నిబంధనల ప్రకారం అద్దె వాహనానికి నెలకు రూ.35 చెల్లించాల్సివుండగా….2017 నవంబర్‌ నుండి 2018 ఫిబ్రవరి దాకా నెలకు రూ.45 వేలు చెల్లించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అద్దె పేరుతో 21.03,2018న 1,75,224 డ్రా చేశారు. 22.03.2018న రూ.43,806 డ్రా చేశారు. ఆ తరువాత 2018 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు నెలకు రూ.35,000 చెల్లిస్తున్నారు. ఇలా చేయడం వివాదంగా మారింది.

విజిలెన్స్‌ విచారణ : రాష్ట్ర వ్యాపితంగా నీరు-చెట్టు పనులోల జరిగిన అక్రమాలపై విచారణ జరిపించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ సభ్యులు ఇప్పటికే పడమటి మండలాల్లో విచారణ సాగిస్తున్నారు. త్వరలోనే తూర్పు మండలాల్లో విచారణ మొదలుకానుంది. దీంతో నీటిపారుదల శాఖ అధికారుల్లో ఆందోళన మొదలయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*