క్యాడర్‌ మీద లీడర్‌ ప్రత్యేక శ్రద్ధ…ఆదర్శంగా భూమన కరుణాకర్‌ రెడ్డి

  • కింది స్థాయి కార్య‌క‌ర్త‌లకు స‌ముచిత గౌర‌వం
  • ఏ స‌మ‌స్య తెచ్చినా త‌క్ష‌ణం ప‌రిష్కారం
  • ముఖ్య‌నాయ‌కుల‌కు నామినేటెడ్ ప‌దవులు
  • భూమ‌న‌కు తోడుగా కుమారుడు అభిన‌య్ రెడ్డి

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా నాయకుడి కోసం రాత్రిబవళ్లూ పనిచేశాం. అప్పుడు మా నాయకుడు అవసరమున్నా లేకున్నా ఫోన్‌ చేసి మాట్లాడేవారు. ఎక్కడ కనిపించినా ఆప్యాయంగా పలకరించేవారు. అధికారం వచ్చాక క్యాడర్‌ను అస్సలు పట్టించుకోవడం లేదు. ఏదైనా పని కోసం వెళ్లినా సరిగా పట్టించుకోవడం లేదు. ఎదురుగా కనిపించినా చూసీచూడనట్లు వెళుతున్నారు….ఇదీ అనేక నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణి కార్యకర్తల ఆవేదన.

తిరుపతి ఎంఎల్‌ఏ భూమన కరుణాకర్‌ రెడ్డి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటున్నారన్న ప్రశంసలు వినిపిస్తున్నాయి. క్యాడర్‌ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, పార్టీ కోసం పని చేసిన వారిని గుర్తించి వారు తీసుకొచ్చే సమస్యలను పరిష్కరించడమే కాకుండా….నామినేటెడ్‌ పదవులు ఇప్పించి అందర్నీ సంతృప్తిపరిచేందుకు కృషి చేస్తున్నారని చెబుతున్నారు.

తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అధికార పార్టీ నేతలను ఆశ్రయించడం మామూలే. ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు తమ వద్దకు వచ్చే వారిని శాసన సభ్యుల వద్దకు తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడం పరిపాటి. అలా చేసినపుడే కింది స్థాయి కార్యకర్తలకు ప్రజల్లో గౌరవం దక్కుతుంది. పార్టీ పట్ల అభిమానం పెరుగుతుంది.

తిరుపతికి సంబంధించినంత వరకు సమస్యల పరిష్కారం కోసం, చిన్నచిన్న పనుల కోసం తన వద్దకు వచ్చే వారిని ఎంఎల్‌ఏ భూమన కరుణాకర రెడ్డి అప్యాయంగా పలకరించి ఆ పనిచేసి పంపుతున్నారని స్థానిక వైసిపి నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంఎల్‌ఏ అందుబాటులో ఉన్నా లేకున్నా….ఆయన కుమారుడు భూమన అభినయ్‌ రెడ్డి కార్యకర్తలకు, నేతలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నారు. ఎవరు తన వద్దకు వచ్చినా, వారు చెప్పేది ఓపిగ్గా విని సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అభినయ్‌కి పార్టీ కార్యకర్తలు ఏ సమయంలోనైనా ఫోన్‌చేసి మాట్లాడే అవకాశం ఉంది. ఇవన్నీ పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

తిరుపతిలో పార్టీ కోసం పని చేసిన నాయకులను గుర్తుపెట్టుకుని నామినేటెడ్‌ పదవులు ఇప్పిస్తున్నారు. తిరుపతి టౌన్‌ బ్యాంకుకు ఛైర్మన్‌, వైఎస్‌ ఛైర్మన్‌, డైరెక్టర్‌ పదవులు ఇప్పించారు. అదేవిధంగా తాజాగా తిరుపతిలోని తాళ్లపాక పెద్దగంగమ్మ, వేషాలమ్మ, అంకాలమ్మ, కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాల పాలక మండళ్లను నియమించారు. మొత్తంగా ఇప్పటిదాకా 40 మంది నాయకులకు నామినేటెడ్‌ పదవులు దక్కాయి. జిల్లాలోని మరేఇతర నియోజకవర్గంలోనూ ఇంత మందికి నామినేటెడ్‌ పదవులు లభించలేదు.

జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఆలయాలు ఉన్నప్పటికీ….ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ముందుగా తిరుపతిలోని ఆలయాలకు పాలక మండళ్లు వేయించుకున్నారు. అందుకే కొందరికైనా నామినేటెడ్‌ పదవులు ఇప్పించగలిగారు. రానున్న రోజుల్లో నామినేటెడ్‌ పదవులు ఎక్కడున్నా సాధ్యమైనంత త్వరగా వాటి నియామకాలు చేపడుతామని చెబుతున్నారు.

నామినేటెడ్‌ పదవుల పందేరాన్ని ఎప్పుటికప్పుడు వాయిదా వేస్తూ, సంవత్సరాలు గడిపేయడం, ఆ పదవులపై ఆశ పెట్టుకున్న నాయకులతో ఎప్పటికప్పుడు పని చేయించుకోవడం, ఎప్పుడో ఆఖరులో పదవులు ఇవ్వడం, అది మూన్నాళ్ల ముచ్చటగా మిగలడం గతంలో చూశాం. అందుకు భిన్నంగా ఇప్పుడు నామినేటెడ్‌ పదవులను త్వరితగతిన భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై వైసిపి నేతలు, కార్యర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా భూమన కరుణాకర్‌ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్‌ రెడ్డి తమ కేడర్‌ పట్ల చూపుతున్న శ్రద్ధను పక్క నియోజకవర్గాల వైసిపి కార్యకర్తలూ అభినందిస్తున్నారు.

I ధర్మచక్రం ప్రతినిధి, తిరుపతి

1 Comment

  1. Nannu yenthagaano mahadhaanandhaaniki lonuchesindhi paina cheppina maatalu.. gaurava bhoomana karunannaku chiranjeevi abhinayki naa hrudayapoorvaka dhanyavaadaalu. Namasthe.

Leave a Reply

Your email address will not be published.


*