క్యాన్సర్‌ చికిత్సకు కేరాఫ్‌ తిరుపతి!

క్యాన్సర్‌ మహమ్మారి ఏటా వేలాది మందిని బలగొంటోంది. మన దేశంలో 14.50 లక్షల మంది క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. ప్రాథమిక దశలో గుర్తిస్తే తప్ప క్యాన్సర్‌ నయంకాదు. క్యాన్సర్‌ చికిత్స బాధతో కూడుకున్నదేగాదు ఖరీదైనది కూడా. సరైన ఆస్పత్రులూ అందుబాటులో లేవు. అయితే…ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి క్యాన్సర్‌ చికిత్సకు కేరాఫ్‌ అడ్రెస్‌గా మారబోతోంది. టాటా ట్రస్టు ఏర్పాటు చేయనున్న క్యాన్సర్‌ చికిత్స, పరిశోధనా సంస్థకు 31.08.2018న శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే.

తిరుమల తిరుపతి దేవస్థానం అలిపిరి రోడ్డులో 25 ఎకరాల స్థలాన్ని టాటా ట్రస్టుకు కేటాయించింది. ఈ ఆస్పత్రి కోసమే టాటా ట్రస్టు ఏర్పాటు చేసిన అలిమేలు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పనులు మొదలుకానున్నాయి. ప్రపంచస్థాయి వైద్య సదుపాయాలతో రూపుదిద్దుకోనున్న టాటా క్యాన్సర్‌ ఆస్పత్రి వచ్చే ఏడాది జూన్‌లో ప్రారంభంకానుంది. ఇప్పటికే ముంబై, కలకత్తాలో టాటా ట్రస్టు క్యాన్సర్‌ ఆస్పత్రులను నిర్వహిస్తోంది. ఈ ఆస్పత్రుల్లో ఏటా వేలాది మంది చికిత్సపొందుతున్నారు.

తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న క్యాన్సర్‌ ఆస్పత్రిలో 20 లీనియర్‌ యాక్సిలేటర్‌ పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పరికరాలతోనే కిమో థెరఫీ వైద్యం చేస్తారు. మొత్తం 300 పడకలు ఏర్పాటు చేస్తారు. చికిత్స మాత్రమే కాకుండా పరిశోధన, పునరావాస కేంద్రాలూ ఏర్పాటవుతాయి. తిరుపతిలోని స్విమ్స్‌లో లీనియర్‌ యాక్సిలేటర్‌ పరికరాలు రెండు మాత్రమే ఉన్నాయి. రోగులు, వారి బంధువులు బస చేయడానికి అవసరైన డార్మెటరీలనూ ఇక్కడ నిర్మిస్తారు.

టాటా ఆస్పత్రుల్లో పేదవారికి ఉచితంగా వైద్య సేవలు అందుతాయి. చెల్లించగల స్థోమత ఉన్నవారి వద్ద మాత్రం ఫీజులు తీసుకుంటారు. తిరుపతి ఆస్పత్రిలో 40 శాతం మందికి ఉచిత వైద్యం అందిస్తామన్న ఒప్పందంతోనే టిటిడి 25 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అంతేకాకుండా…ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చిన వారిని ఏ కారణంతోనైనా తిప్పిపంప బోమన్న హామీని కూడా టాటా ట్రస్టు ఇచ్చింది.

టిటిడి దాదాపు రూ.1000 కోట్ల విలువైన భూమిని టాటా ట్రస్టుకు ఇవ్వడంపై కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఈ భూమికి ట్రస్టు ఏడాదికి ఎకరాకు లక్ష రూపాయల వంతున లీజు చెల్లిస్తుంది. అంటే 25 ఎకరాలకు రూ.25 లక్షలు చెల్లిస్తుంది. క్యాన్సర్‌కు అత్యాధునిక, ప్రపంచస్థాయి ప్రమాణాలతో చికిత్స అందుబాటులోకి వస్తే…దానిముందు టిటిడి ఇచ్చిన భూమి విలువ పెద్దగా లెక్కలోకి రాదు. ప్రస్తుతం బర్డ్స్‌ ఆస్పత్రికి ఎంత ప్రతిష్టవుందో…తిరుపతిలో ఏర్పాటు కాబోయే టాటా క్యాన్సర్‌ ఆస్పత్రికీ అంతటి ప్రతిష్ట వస్తుందనడంలో సందేహం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*