ఖాకీ దొరలు ఆ చదువుకైనా గౌరవం ఇస్తారా?

పోలీసు శాఖలో ఎంత ఉన్నతస్థాయి పోస్టులో ఉన్నా….ఆ పైస్థాయి అధికారి నుంచి అవమానాలు ఎదుర్కోక తప్పదు. ఏకవచనంతో సంబోధించడమేగాదు…కానిస్టేబుల్‌ వంటి ఉద్యోగులను ఒరేయ్‌…తరేయ్‌ అని పిలిచే పద్ధతులూ ఉన్నాయి. ఆర్డర్లీ వ్యవస్థ అనేది ఒకటి పోలీస్‌ డిపార్టుమెంటులో ఒకప్పుడు ఉండేది. దాన్ని కొన్నేళ్ల క్రితమే రద్దు చేశారు. ఆర్డర్లీ వ్యవస్థ అంటే…కానిస్టేబుళ్లతో ఎస్‌ఐ స్థాయి అధికారి నుంచి తమ ఇళ్లతో పని చేయించుకోవడం. అంటే బట్టులు ఉతికడం, పిల్లలను స్కూల్‌ దింపిరావడం, మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు తేవడం, ఇంట్లో పాత్రలో తోమడం, చెట్లకు నీళ్లు పట్టడం వంటి పనులన్నీ చేయాలి. చాలా ఏళ్ల క్రితం నరేష్‌ హీరోగా ‘పోలీసు భార్య’ అనే సినిమా వచ్చింది. అందులో ఈ ఆర్డర్లీ వ్యవస్థను కళ్లకు కట్టినట్లు చూపించారు. మొదట్లో ఈ సినిమాకు పోలీసోడి పెళ్ళాం అని పేరు పెట్టినా….పోలీసుల నుంచి వచ్చిన అభ్యంతరాలతో పోలీసు భార్యగా మార్చారు. సినిమా విడుదలైన తరువాత పోలీసులే ఎగబడి చూశారు. కారణం తమ కష్టాలను తెరపైన చూపించడమే. ఇది బ్రిటీష్‌ కాలం నుంచి ఉన్న వ్యవస్థ. దీనిపైన పెద్ద దుమారం రేగడంతో రద్దు చేశారు. అధికారికంగా రద్దయివుండొచ్చుగానీ… అనధికారికంగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కాకుంటే కాస్త మారివుండొచ్చు.

అయినా….ఇప్పుడు ఇదంతా ఎందుకంటే….పోలీసు డిపార్టుమెంటులోకి కొత్తగా 5,248 మంది కానిస్టేబుళ్లు వస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకప్పుడు కానిస్టేబుల్‌ అంటే పదో తరగతి, అంతకంటే తక్కువ చదువుకున్నవాళ్లు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు ఎంపికైన కానిస్టేబుళ్లలో 1,431 మంది (27.26 శాతం) బిటెక్‌, ఎంటెక్‌, ఎంసిఏ, ఎంబిఏ వంటి ఉన్నత చదువులు చదివినవాళ్లేనట. 1400 మంది మాత్రమే ఇంటర్‌ క్వాలిఫికేషన్‌ కలిగిన వాళ్లు ఉన్నారు. అంటే దాదాపు 3,800 మంది డిగ్రీ, ఆపై చదువులు చదివినవాళ్లు. కిందిస్థాయి ఉద్యోగాల్లోనూ ఉన్నత విద్యావంతులైన వాళ్లు ఉండటం వల్ల పనిలో నాణ్యత పెరుగుతుంది. చురుకుదనం పెరుగుతుంది. ఆ మాటనే పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పుడు జరిగే నేరాలను విశ్లేషించాలన్నా, ఛేదించాలన్నా సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి. అలాంటి పరిజ్ఞానం ఈ తరం యువతకు పుష్కలంగా ఉంది. ఆ విధంగా చూసినపుడు ఉన్నత విద్యావంతులైన కానిస్టేబుళ్లు కేసుల విచారణలో ఎంతగానో దోహదపడతారు. ప్రజలతో మెలిగే విధానంలోనూ హుందాగా, గౌరవంగా ఉండే అవకాశం ఉంది. సమస్యల్లా….ఈ చదువులకైనా గౌరవం ఇచ్చి….గతంలో లాగా కానిస్టేబుళ్లను ఒరేయ్‌…తరయ్‌ అనే మాటలకు చోటివ్వకుండా ఉన్నతాధికారులు మసులుకుంటారా…అనేదే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*