గల్ఫ్ యుద్ధంపై ప్రశ్నిస్తే ఎన్టీఆర్ ఏమన్నారు…‌సిగరెట్ల‌ ధర పెంపుపై‌ అర్ధరాత్రి డెస్క్ లో సబ్ ఎడిటర్లు ఏం చెశారు..!

  • ఇటు ఫీల్డ్… అటు డెస్క్ జర్నలిస్టుగా రాఘవశర్మ అనుభవాలు

మూడు దశాబ్దాల పాత్రికేయ జీవితంలో ఎందరో మంచి జర్నలిస్టులతో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది. కొంత కాలం రిపోర్టింగ్‌లో, మరి కొంత కాలం డెస్క్‌లో ఉభయచరంలా పనిచేయడం వల్ల అనేక మంది జర్నలిస్టులను, ప్రముఖులను సన్నిహితంగా పరిశీలించే అవకాశం ఏర్పడిరది. వారి అసాధారణ ప్రతిభ, వారి వ్యక్తిత్వం నా స్మృతిపథంలో మెదులుతూనే ఉంటాయి.

గల్ఫ్‌ యుద్ధం….ఎన్‌టిఆర్‌!
రెండు దశాబ్దాల క్రితం కాకినాడలో నేను ఆంధ్రభూమికి స్టాఫ్‌ రిపోర్టర్‌గా పనిచేస్తున్నప్పుడు గల్ఫ్‌ యుద్ధం మొదలైంది. ఆరోజు తెల్లవారుజామునే ఇరాక్‌పై అమెరికా బాంబుదాడి జరిగింది. ప్రతిపక్ష నేతగా ఉన్న ఎన్టీ రామారావు తన కార్యక్రమాన్నిటినీ రద్దు చేసుకుని ఉదయం పది గంటలకు కాకినాడలో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టారు. ‘ఇది మానవాళికి దుర్దినం’ అన్నారు. యుద్ధానికి వ్యతిరేకంగా ఎంతో ఆవేశంతో చాలాసేపు మాట్లాడారు. ‘యుద్ధ నివారణకు మీరేమైనా కృషి చేయదలిచారా?’ అని కొంటె ప్రశ్న వేశాను. ఆ  ప్రశ్నను కూడా ఆయన చాలా సీరియస్‌గా తీసుకుని, ఎంతో ఆత్మవిశ్వాసంతో ‘ఆహ్వానం రానీండి బ్రదర్‌ అలాగే చేద్దాం’ అన్నారు. అప్పుడాయన భోళాతనాన్ని, నిర్మలమైన మనస్తత్వాన్ని, శాంతిపై ఆయనకున్న నిబద్ధతను దర్శించగలిగాను. మర్నాడు అన్ని పత్రికల్లోనూ దాదాపు ఒకటే బ్యానర్‌ ‘గల్ఫ్‌ యుద్ధనివారణకు ఎన్టీయార్‌ కృషి’. గుండె గుభేల్‌ మన్నది.  

గల్ఫ్‌ యుద్ధం మొదలైనప్పుడు చాలా మందిలో అమెరికాపై వ్యతిరేకత, సద్దాంపై అభిమానం పెరిగింది. యుద్ధం మొదలైన రోజు కాకినాడలో ఒక పత్రిక రిపోర్టర్‌కు కూతురు పుట్టింది. ‘కొడుకు పుడితే సద్దాం పేరు పెట్టుకోవాలనుకున్నాను’ అని రిపోర్టర్ల ముందు బాధపడిపోయాడు. ‘సద్దాం కాకపోతే ‘సద్ది’ అని పెట్టుకో’మని కొందరు ఎగతాళి చేశారు. సద్దాంకు బదులుగా ‘సదామి’ అని పెట్టుకోవచ్చన్న విషయం ఆరోజుల్లో మాకెవరికీ తెలియదు. తెలిసినట్టయితే ఆ పేరు పెట్టేవాడేమో!?  అగ్రరాజ్య ఆధిపత్యాన్ని ధిక్కరించే సద్దాంను జాతికి, మతానికి అతీతంగా ఆ రిపోర్టర్‌ అభిమానించడం నాకు బాగా నచ్చింది.

బీహార్‌ ప్రెస్‌బిల్లు…
మూడున్నర దశాబ్దాల క్రితం మాట. నేను పత్రికల్లోకి రాకముందు బీహార్‌ ప్రెస్‌బిల్లు వచ్చింది. పత్రికా స్వేచ్ఛను హరించే ఈ బిల్లుకు వ్యతిరేకంగా తిరుపతి బాలాజీ భవన్‌లో ‘ప్రజాస్వామ్య హక్కు పరిరక్షణ సంస్థ’ తరపున పెద్ద సభపెట్టాం. సభకు వక్తగా పిలవడానికి జర్నలిస్టు కాలనీలోని  వరదాచారి ఇంటికి వెళ్లాం. అప్పుడాయన ఆకాశవాణి విలేకరి. ఇంట్లో కుర్చీలు లేవు. చాపపైనే కూర్చుని వార్తలు రాసుకుంటున్నారు. రేణిగుంటలోని ఈనాడు ఎడిషన్‌ ఇన్‌చార్జి పతంజలి ఇంటికి వెళ్లాం. ఆయన ఇంట్లో నాలుగు గోడలకు అమర్చిన అమారుల్లో ఎన్ని పుస్తకాలో! ‘సభల్లో నాకు మాట్లాడే అవాటు లేదు. మీకు మాట్లాడే మనిషిని చూపిస్తా’ అంటూ ఈనాడులో సీనియర్‌ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్న ప్రకాష్‌ ఇంటికి తీసుకెళ్లారు. బాలాజీ భవన్‌ నిండింది. వరదాచారి, ప్రకాష్‌తో పాటు చాలా మంది మాట్లాడారు. సభ అయిపోయేవరకు పతంజలి కూడా ప్రేక్షకుల్లో కూర్చున్నారు.

‘సూపర్‌లీడ్‌ పిచ్చోడు’
కొన్నేళ్ల తరువాత విజయవాడ ఆంధ్రభూమిలో నేను సబ్‌ఎడిటర్‌గా చేరినప్పుడు ఎడిషన్‌ ఇన్‌చార్జిగా ప్రకాష్‌ మళ్లీ పరిచయమయ్యారు. సూపర్‌లీడ్‌ రాయడంలో  ఆయనకు ఆయనే సాటి. రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వం కూలిపోయినప్పుడు ఆంధ్రభూమిలో ఆయన రాసిన సూపర్‌ లీడ్‌ ఎంత బాగుందంటే, బహుశా ఏ ఇంగ్లీషు పత్రికలో కూడా అంతబాగా రాసి ఉండరు. ఆయన రాసిన ఏ ఒక్క సూపర్‌లీడ్‌ను మెచ్చుకోకుండా ఉండలేం. ‘సూపర్‌లీడ్‌ పిచ్చోడు’ అని కొందరు ఎగతాళి చేసేవారు. నాచారంలో నల్లడబ్బు గురించి కానీ,  కల్పన మృతి గురించి కానీ ఆయన చెపుతుంటే, వాటికి లేఖకుడిగా పనిచేసిన నేను పొందిన అనుభూతి అంతా ఇంతా కాదు. అతి చిన్న వాక్యాలు, అంతర్లీనంగా కవిత్వం, బమైన వ్యక్తీకరణ పాఠకుడిని కట్టిపడేస్తాయి.

చిన్నప్పుడు తప్పిపోయి కేరళలో ఉన్న పిల్లవాడిని…
అక్కడే పరిచయమైన చీఫ్‌ సబ్‌ఎడిటర్‌ క్ష్మణరావుగారు మానవీయ కథనాలు రాసేవారికి మంచి మార్గదర్శకు. ‘గుండె గొంతుకలో..’ అన్న శీర్షికన ఆంధ్రభూమిలో రోజూ మానవీయ కథనం వచ్చేది. అవి ఎంత బాగుండేవంటే మంచి తెలుగు రాయాలంటే ‘గుండె గొంతుకలో..’ చదవాలి అన్న మాట ప్రచారంలోకొచ్చేసింది. వార్తలో మఫిషిల్‌ ఎడిటర్‌గా పని చేస్తున్న క్ష్మణరావు నన్ను నెల్లూరుకు పంపించి, శతాధిక వృద్ధురాలైన సినీ నటి గంగారత్నం గురించి రాయించారు. ‘శతాధిక బతుకు నౌక’ అన్న మరో మానవీయ కథనాన్నీ  రాయించారు. ఆ కథనాలకు ఎంత స్పందన వచ్చిందో! ముఖ్యంగా, తిరుపతిలో తల్లి తండ్రుల నుంచి తప్పిపోయి కేరళ చేరిన ఐదేళ్ల పిల్లవాడిని, ఏడేళ్ల తరువాత, పన్నెండేళ్ల వయసులో మళ్లీ తల్లిఒడి చేర్చడానికి వార్తను వారధిగా చేసిన ఆయన కృషి అద్భుతం, అనితరసాధ్యం. ఇందుకోసం రాష్ట్రంలో ఉన్న వార్త యంత్రాంగాన్నంతా కదిలించారు. అందులోని చివరి ఘట్టంలో నేను కూడా పాలుపంచుకోవడం ఒక మధురానుభూతిని మిగిల్చింది.

పెద్దపెద్ద వాళ్లతో….
వార్త రావడానికి ఏడాది ముందు పాశం యాదగిరి సంపాదకత్వంలో హైదరాబాదులో వర్తమానం అన్న దినపత్రిక  ప్రారంభమైంది. అభ్యుదయ ఆలోచనతో ప్రారంభమైన ఆ పత్రిక చిన్నదైనా, అందులో చాలా గొప్పగొప్ప జర్నలిస్టు పనిచేసేవారు. పాశం యాదగిరి గతంలో ఉదయం స్టేట్‌బ్యూరో చీఫ్‌గా పనిచేశారు. ఆఫీసులో స్థిరంగా కూర్చునేవారు కాదు. ఎప్పుడూ తిరుగుతుండేవారు. ఏరోజైనా బ్యానర్‌ వార్త కోసం సందేహిస్తుంటే వెంటనే రాసిచ్చేసేవారు. సమాచారం కోసం వెతుక్కోవడం అనేది ఉండదు. ఆయనొక హైదరాబాదు విజ్ఞాన సర్వస్వం అని చెప్పవచ్చు. ఈనాడు ప్రారంభమైనప్పుడు దానికి బ్యూరో చీఫ్‌గా పనిచేసిన యలమంచి శేఖర్‌ కారేసుకొచ్చి అందరికంటే ఎక్కువగా, ఉచితంగా సేవ చేసేవారు. ‘నా శిష్యుడు పేపరు పెడితే నేను పనిచేయకుండా ఎలా ఉంటా?’ అనేవారు. ఈనాడు ప్రారంభమైనప్పుడు యలమంచి శేఖర్‌ బ్యూరోలో పాశం యాదగిరితోపాటు తిరుపతికి చెందిన సీఆర్‌ నాయుడు కూడా పనిచేశారు. శేఖర్‌ ఆలోచనకు పూర్తి భిన్నమైనది గాంధీ ఆలోచన. శేఖర్‌ ఉచితంగా చేయడం వల్ల యజమానుల దృష్టిలో మనలాంటి వారికి విలువలేకుండా పోతోందనేవారు. గాంధీ ఈనాడులో కొంత కాలం సంపాదకీయాలు రాశారు. ప్రముఖ పత్రికలన్నింటిలో పనిచేశారు. గొప్ప మేధావి, బహుగ్రంథకర్త. పత్రికా యజమానులతో విసుగెత్తిపోయి, పబ్లిషర్‌గా అవతారమెత్తి, ‘పీకాక్‌ క్లాసిక్స్‌’ పేరుతో  తెలుగులో మంచి మంచి పుస్తకాను వెలువరించారు. రష్యా వెళ్లి మార్క్సిస్టు ఫిలాసఫీ చదువుకున్నారు. మరొక మంచి మనిషి విశ్వేశ్వరరావు. ప్రభలో చీఫ్‌ సబ్‌ఎడిటర్‌గా రిటైరై, డెబ్భై ఏళ్ల వయసులో కుటుంబం గడవడానికి మధ్యాహ్నం వరకు కృష్ణా పత్రికలో, సాయంత్రం నుంచి వర్తమానంలో పనిచేసేవారు. ఆయన నోరు తెరిస్తే చాలు ఎన్ని జాతీయాలు దొర్లేవో! కొన్ని  కడుపుబ్బ నవ్విస్తే, మరికొన్ని ఇబ్బంది పెట్టేవి. వర్తమానం చిన్న పత్రికైనా ఇలా పెద్ద పెద్ద వాళ్ల మధ్య కూర్చుని పనిచేయడం నాకొక గొప్ప అవకాశం. అదర్శాలతో మొదలైన వర్తమానం ఏడాది తరువాత అప్పుకు అంకితమై, వేరే వాళ్ల చేతిలోకి వెళ్లిపోయింది.

సిగరెట్‌ ధరలు పెరిగినపుడు…
తిరుపతిలో ఆంధ్రజ్యోతి ఎడిషన్‌ పెట్టినప్పుడు రిపోర్టర్‌గా చేరాను. డెస్క్‌లో చాలా మంది కవులు, రచయితలు. ఒకరిని మించినవారు ఒకరు. రిపోర్టర్లపైన పెత్తనం చెలాయించే ధోరణి ఉండేది కాదు. మంచి స్నేహపూరిత వాతావరణం ఉండేది. ఒకరో ఇద్దరో తప్ప అంతా ధూమపాన ప్రియులే. చీఫ్‌ సబ్‌ఎడిటర్‌గా ఉన్న శౌరయ్య చాలా సరదాగా ఉండేవారు. ఓ రోజు రాత్రి ఉన్నట్టుండి ‘సిగిరెట్‌ ధరలు పెరిగిపోయాయి. దానిపైన నాకు వార్త కావాలి’ అన్నారు. రాత్రి పన్నెండవుతోంది. సమాచారం సేకరించాలి కదా, రేపిస్తానన్నాను. చేతిలో సిగరెట్‌ పట్టుకుని ‘కుదరదు ఇప్పుడే కావాలి’ అన్నారు.  ‘ఆ వార్త ఇవ్వకుండా ఇంటికి వెళ్లడానికి వీల్లేదు’ అంటూ హుకుం జారీ చేశారు. ఒక్కొక్క సబ్‌ఎడిటర్‌ దగ్గరకెళ్లి వాళ్ల విలాపాన్ని తెలుసుకుని ‘విషాదయోగంలో స్మోకర్లు’ అని రాశాను. ‘ఖగపతియమృతము తేగా భుగభుగమని చుక్క పొంగి భూమిని వ్రాలెన్‌ పొగచెట్టై జన్మించెను పొగతాగనివాడు దున్నపోతైపుట్టున్‌’ అని కన్యాశ్కుంలో గిరీశం చెప్పిన పద్యంతో మొదలు పెట్టాను. ధరలు పెరిగిపోవడంతో సిగరెట్టును చివరివరకు పీల్చి పిప్పి చేసి స్మోకర్లు ఎలా చేతులు మూతులు కాల్చు కుంటున్నారో రాశాను. తెల్లారి పేపరు  చూసేసరికి నేను రాసిన వార్త రాసినట్టు వచ్చింది కానీ, చివరన ‘సిగరెట్టు ఒక కొన నిప్పుతో కాలిపోతుంటుంది. మరొక కొన మూర్ఖుడి పెదాల మధ్య నలిగిపోతుంటుంది’ అని జార్జిబెర్నార్డ్‌షా చెప్పిన మాటను జోడిరచారు. రాత్రి మా సంభాషణను గమనించిన సబ్‌ఎడిటర్‌ గోపరాజు నారాయణరావు(ధూమపాన వ్యతిరేకి) శౌరయ్యను ఏడిపించడం కోసం అలా ముక్తాయింపు ఇచ్చారు. ప్రముఖ రచయిత కేఎస్వీ నరసింహం కొంత కాలం మాకు బ్యూరో చీఫ్‌గా పనిచేశారు. చాలా ప్రోత్సహించారు. ఆరోజుల్లో మాకు ప్రెస్‌క్లబ్‌ లేదు. గోవిందరాజ స్వామి గుడిదగ్గర ఉండే స్టేట్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ సెంటర్లోనే కూర్చునే వాళ్లం. రోజూ పత్రికల్లో వచ్చిన వార్త గురించి చర్చోపచర్చలు జరిగేవి. ఏ పత్రిక ఏఅంశాన్ని లీడ్‌ తీసుకుందనేది ప్రధాన చర్చ. ఆరోజుల్లో ఏడీగా పనిచేసిన నేకంటి వెంకటరమణమూర్తి కూడా మాచర్చల్లో పాలుపంచుకునేవారు. రమణమూర్తి స్వయంగా నటుడే కాకుండా, ప్రముఖ రంగస్థ నటుడు స్థానం నరసింహారావు అల్లుడు కూడా.

అక్షర దోషం లేని మనిషి….
తిరుపతి సాక్షిలో ఎడిషన్‌ ఇన్‌చార్జిగా, న్యూస్‌ కోఆర్డినేటర్‌గా పని చేసిన జీఆర్‌ మహర్షి (జి.రామాంజనేయు) మంచి రచయిత. కంప్యూటర్‌పై పనిచేసే రోజులొచ్చినా పెన్నుతో రాసే అవాటును పోగొట్టుకోలేదు. అలాగని కంప్యూటర్‌పైన పనిచేయడం చేతకాదని కాదు. ఫన్‌డేలో తాను రాసే కామ్‌ను కూడా పెన్నుతోనే రాసి కంపోజింగ్‌కు ఇచ్చేవారు. ఎక్కడా కొట్టివేతలు, దిద్దుబాట్లు కనిపించేవి కావు. అలారాయడం అసాధారణమే అనిపించింది. ఎంతటి వారికైనా ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒక చోట అక్షర దోషాలు దొర్లటం చాలా సహజం. మహర్షి చేతిలో ఏదైనా వార్త  పడిందంటే ఒక్కటంటే ఒక్క అక్షర దోషం కూడా దొర్లదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో స్మృతులు.

సీనియర్‌ సినీనటికి ‘వార్త’తో వృద్ధాప్యంలో వసంతం

తెలుగు సినిమా రంగం మరచిపోలేని ఒక మందహాసాన్ని నా కథనం గుర్తు చేసింది. తొలితరం సినీ, రంగస్థల నటి, శతాధిక వృద్ధురాలైన జవ్వాది గంగారత్నం ఇంకా ఉన్నదన్న విషయాన్ని ఆ కథనం తెలియచేసింది. తిరుపతి ‘వార్త’లో సబ్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నప్పుడు,  పన్నెండేళ్ల క్రితం  ‘చెలి’ పేజీలో ‘మౌనంలో నాటి మాట జలపాతం’ అన్న శీర్షికన నేను రాసిన కథనం ఆమె జీవితంలో చివరి ఏడాది వసంతాన్ని పూయించింది. గయ్యాళి అనగానే  తొలుత సూర్యాకాంతం, ఆ తరువాత ఛాయాదేవి గుర్తుకు వస్తారు. అంతకంటే ముందు, గయ్యాళి అంటే గంగారత్నమే! రంగస్థంపైనే కాకుండా వెండితెరపై కూడా ఆమె గయ్యాళి పాత్రకు ప్రాణం పోసింది. గంగారత్నానికి ముగ్గురు పిల్లలు. చిన్న కూతురు మరణించింది. కొడుకు ఎటో వెళ్లిపోయాడు. వృద్ధురాలైన పెద్ద కూతురు దగ్గర నెల్లూరు జిల్లాలోని తోటపల్లి గూడూరు మండం ఈదూరులో కాలం వెళ్లదీస్తోంది.  ఎన్ని సినిమాల్లో నటించినా, రంగస్థంపై ఆమె కోసం ఎన్ని సార్లు ‘వన్స్‌మోర్‌’ వినిపించినా వృద్ధాప్యంలో బతకడానికి తన కంటూ ఏమీ మిగ్చుకోలేదు. జ్ఞాపకాలు తప్ప. చక్కెర వ్యాధి, రక్తపోటు స్థిరాస్తుగా మిగిలాయి. కళ్లుసరిగా కనిపించవు. చెవు సరిగా వినిపంచవు. పళ్లు మాత్రం కద లేదు. సముద్రపుగాలికి రెపరెపలాడే తాటాకు గుడిసెలో ఓ కుక్కి మంచంపైన పడుకుని జ్ఞాపకాతో ఉక్కిరి బిక్కిరైపోతుంటుంది. ‘మౌనంలో నాటి మాట జపాతం’ అన్న కథనానికి ‘మా’ సంస్థ (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) స్పందించింది. హాస్య నటుడు ఏవీయస్‌ అప్పుడు దానికి అధ్యక్షుడుగా ఉన్నారు. ‘వార్త’ను సంప్రదించి గంగారత్నాన్ని, ఆమె పెద్ద కుమార్తెను హైదరాబాదుకు రప్పించారు. సినీ నటు, నిర్మాతలు, దర్శకులు‌ అంతా కలసి ఆమెను ఘనంగా సన్మానించారు. ఆమె బతికున్నంత కాలం నెలనెలా వెయ్యి రూపాయు పంపుతానని  వేదికపైనుంచి ఘనంగా ప్రకటించిన ఓ దర్శకుడు ఒక్క నెలంటే ఒక్క నెల కూడా పంపకపోవడం ఈ ఘట్టంలో ఒక చేదు నిజం. అయితే అధికారులు స్పందించి వృద్ధ కళాకాఎఉలకు ఇచ్చే పెన్షన్ ఇప్పించారు. ఆ పెన్షన్‌తో, సినీ రంగ ప్రముఖులిచ్చిన డబ్బుతో ఆమె జీవితంలో చివరి ఏడాది ఆర్థిక సమస్య లేకుండా హాయిగా జరిగిపోయింది. నా కథనం వల్లే చివరి రోజుల్లో ఊపిరి పీల్చుకుంటున్నానని, ఒక్క సారి వచ్చి చూసి పొమ్మని గంగారత్నం అనేక మార్లు కబురంపింది. త్వరలో వస్తానని ఆమెకు బదులిచ్చినా సెలవు సమస్య వల్ల ఏడాది వరకు వెళ్ల లేకపోయాను. ఏడాది తిరిగేసరికల్లా గంగారత్నం మృతి వార్త చదవాల్సి వచ్చింది. నాకథనం ఒక శతాధిక వృద్ధురాలికి ఇలా సహాయపడిందన్న తృప్తి ఎంత కలిగించిందో, ఆమె కబురంపినా మళ్లీ చూడలేకపోయానన్న బాధ కూడా నన్ను వెంటాడుతూనే ఉంది.

  • రాఘవశర్మ, తిరుపతి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*