గల్లా కుటుంబం టిడిపిలో ఉంటుందా?

చంద్రగిరి నియోజకర్గం నుంచి నాలుగు పర్యాయాలు గెలుపొంది, కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన సీనియర్‌ నాయకురాలు గల్లా అరుణ కుమారి టిడిపి నాయకత్వం తీరుతో అలకబూనినట్లు వార్తలొస్తున్నాయి. తాను చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా కొనసాగలేనని చంద్రబాబుకు చెప్పినట్లు పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. తమ కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే క్రియాశీల రాజకీయాల్లో ఉండాలనుకున్నామని, అందుకే తనను పార్టీ బాధ్యతల నుంచి తప్పించాలని కోరినట్లు సమాచారం. ఆమె నిజంగా ఆ అభిప్రాయంతో ఉన్నారా? లేక పార్టీ నాయకత్వంపై కినుక వహించి అలా మాట్లాడుతున్నారా? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.

చంద్రగిరి నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు కాంగ్రెస్‌ తరపున గెలిచిన ఆమె….గత ఎన్నికల సమయంలో, విధిలేని పరిస్థితుల్లో టిడిపిలో చేరారు. వైసిపి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిపై పోటీచేసి ఓటమిపాలయ్యారు. గత లోక్‌సభ ఎన్నికల్లోనే రాజకీయ రంగప్రవేశం చేసిన ఆమె తనయుడు గల్లా జయదేవ్‌ గుంటూరు నుంచి లోక్‌సభకు టిడిపి తరపున ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లోనూ గల్లా కుటుంబం టిడిపితో ఉంటుందా అనేది అనుమానమే. జరుగుతున్న పరిణామాలు ఈ సందేహాలకు ఆస్కారం కలిగిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నుంచి చంద్రబాబు తనయుడు లోకేష్‌ పోటీ చేస్తారని చెబుతున్నారు. అరుణ కుమారిని పలమనేరుకు వెళ్లమని చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. చంద్రగిరి నుంచి ఆరు పర్యాయాలు పోటీ చేసి నాలుగు సార్లు గెలుపుపొందిన ఆమెకు ఇక్కడ బలమైన అనుచర గణం ఉంది. కులాలతో సంబంధం లేకుండా ఊరూరా ఆమె మద్దతుదారులున్నారు. ఆమె ఎటువెళితే అటు గుడ్డిగా వెళ్లేంతగా అభిమానించే కార్యకర్తలున్నారు. ఇలాంటి నియోజకవర్గాన్ని వదులుకున్ని, పలమనేరుకు వెళ్లడం ఇబ్బందే.

గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి ఆమె కాస్త నిరాశ చెందారు. అయినా ఎంఎల్‌సిగానైనా ఎన్నికై, మంత్రి పదవి చేపట్టాలన్నది ఆమె లక్ష్యం. ఎంఎల్‌సి ఎన్నికల్లో ఎవరెవరికో సీట్లు ఇచ్చారుగానీ అరుణకు ఇవ్వలేదు. ఇటీవల గాలి ముద్దుక్రిష్ణమ నాయుడు ఎంఎల్‌సిగా ఉంటూ అనారోగ్యంతో మరణించారు. ఇప్పుడు మళ్లీ ఆ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారైనా తనకు ఎంఎల్‌సి సీటు ఇస్తారని గల్లా ఆశపెట్టుకున్నారు. అయితే…గాలి కుటుంబంలోని ఒకరికి ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ముద్దుక్రిష్ణమ ఇద్దరు కుమారులు ఇద్దరూ పోటీ పడటంతో…ఆఖరికి ఆయన సతీమణికి సీటు ఖరారు చేశారు. వాస్తవంగా స్థానిక సంస్థల్లో టిడిపికి ఎక్కువ ఓట్లు ఉన్నాయి. అందుకే ముద్దుక్రిష్ణమ నాయుడు ఎన్నికైనపుడు కూడా వైసిపి అభ్యర్థిని దించలేదు. దీంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. వైసిపి అభ్యర్థిని పెట్టడం లేదు. అంటే ఏకగ్రీవం అవుతుంది. సీటు ఇచ్చివుంటే….గల్లా ఎంఎల్‌సి అయిపోయేవారు. వచ్చే ఎన్నికలతో సంబంధం లేకుండా ఆమె చట్టసభల్లో ఉండేవారు. 2019 ఎన్నికల్లో టిడిపి గెలిచి అధికారంలోకి వస్తే…మంత్రి పదవి గ్యారెంటీ అయ్యేది. అటు చంద్రగిరి ఎంఎల్‌ఏ టికెట్టు ఇవ్వకుండా, ఇటు ఎంఎల్‌సి పదవి ఇవ్వకుండా…ఎక్కడికో పలమనేరుకు వెళ్లడ ఏమిటి…? అనేది గల్లా అరుణ ప్రశ్న. ఈ నేపథ్యంలోనే ఆమె అలకబూని, తనను చంద్రగిరి నియోజకవర్గ బాధ్యతల నుంచి కూడా తప్పించమని కోరినట్లు తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే…వచ్చే ఎన్నికల్లో గల్లా కుటుంబం టిడిపితోనే ఉంటుందా? అని ఎవరైనా అడిగితే…’చెప్పలేం’ అనే సమాధానమే చెప్పాల్సివుంటుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*