గవర్నర్‌ బెదిరించారా….సలహా ఇచ్చారా?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం విజయవాడలో గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అవడం చర్చనీయాంశంగా మారింది. విశాఖ నుంచి నేరుగా హైదరాబాద్‌ వెళ్లాల్సిన గవర్నర్‌, విజయవాడలో ఎందుకు ఆగారు, ముఖ్యమంత్రిని హోటల్‌కు ఎందుకు రమ్మన్నారు, ఏమి మాట్లాడారు? ఇత్యాది విషయాలన్నీ ఆసక్తికరంగా మారాయి. గవర్నర్‌తో 1.40 గంటల పాటు సమావేశమైన అనంతరం ముఖ్యమంత్రి బయటకు వచ్చినపుడు….విలేకరులు స్పందించమని కోరారు. ‘నో బ్రీఫింగ్‌’ అంటూ సిఎం వెళ్లిపోయారు. అయినా…ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఉదయం రెండు ప్రధాన పత్రికల్లో ఒకేరకమైన సారాంశంతో వార్తలువచ్చాయి. కేంద్రంపై దూకుడు తగ్గించాలని, కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని గవర్నర్‌ సూచించారట. రాష్ట్రానికి మేలు జరిగేదాకా తన పోరాటాన్ని ఆపేది లేదని ముఖ్యమంత్రి తెగేసి చెప్పారట. ఇది ఆ రెండు పత్రికల్లో వచ్చిన వార్తల సారాంశం. భేటీ జరిగింది ముఖ్యమంత్రికి, గవర్నర్‌కి మధ్య మాత్రమే. ఆ భేటీలో ఏం మాట్లాడారో ఎవరో ఒకరు చెబితేగానీ బయటకు తెలిసే అవకాశం లేదు. గవర్నర్‌ ఎటూ చెప్పలేదు. ముఖ్యమంత్రి ‘బ్రీఫ్‌’ చేయలేదు. మరి…రెండు పత్రికల్లో ఒకే సారాంశంతో వార్త ఎలా వచ్చిందనేది ప్రశ్నం.

ఇక ఈ భేటీకి సంబంధించి సాక్షి తనదైన శైలిలో కథనాన్ని ప్రచురించింది. గవర్నర్‌ హెచ్చరించారని, దీంతో చంద్రబాబు గవర్నర్‌ ద్వారా కేంద్రాన్ని మంచి చేసుకునేందుకు ప్రయత్నించారని ఆ వార్త సారాంశం. రాష్రంలో జరిగిన అవినీతికి సంబంధించి కేంద్రం వద్ద పూర్తి వివరాలున్నాయని, గతంలో ఐబి చీఫ్‌తో భేటీలోనూ ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పారని ఈ వార్తలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ఉరటూ నిరాహార దీక్ష ఎలా చేస్తారని కూడా గవర్నర్‌ ప్రశ్నించినట్లు రాశారు. ఇంతకీ ఏం జరిగింది. గవర్నర్‌ సలహా ఇచ్చారా?….బెదిరించారా? ఏమో….ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చెప్పాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*