గాలి జనార్థన్‌ రెడ్డిని మించిన విలేకరులు..!

అధిక వడ్డీలు ఆశ చూపి ప్రజల నుంచి రూ.900 కోట్లు దండుకున్నట్లు చెబుతున్న ‘అంబిడెంట్‌’ సంస్థ కేసులో ఓ విలేకరి, టివి ఛానల్‌ యజమాని పాత్ర కూడా ఉన్నట్లు వార్తలు బయటికొస్తున్నాయి. ఈ కేసు నుంచి బయటపడేస్తానంటూ గాలి జనార్ధన్‌ రెడ్డి సంబంధిత వ్యక్తుల నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నట్లు ఆరోపణలు రావడం, ఆయన్ను అరెస్టు చేయడం తెలిసిన విషయాలే.

ఈ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ ఆంగ్ల దినపత్రికలో పనిచేసి బయటికొచ్చిన విలేకరి, బెంగళూరులోని ఓ టివి ఛానల్‌ యజమాని కలిసి అంబిడెంట్‌ నిర్వాహకులను బెదిరించారని చెబుతున్నారు. సంస్థకు అనుకూలంగా వార్తలు రాయడానికి రూ.40 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఆపై వ్యతిరేక కథనాలు ప్రసారం కాకుండా ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసి, రూ.3 కోట్లు తీసుకున్నారట. అప్పటికీ ‘సంతృప్తి’ చెందని ఆ మీడియా ప్రతినిధులు… అంబిడెంట్‌కు రూ.900 కోట్లు దాకా వచ్చిందని తెలుసుకుని, తమకు రూ.37 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారట. ఈ వ్యవహారాలకు సంబంధించిన ఆధారాలు సిబిఐ చేతికి దొరికినట్లు వార్తలొచ్చాయి.

అంబిడెంట్‌ విషయంలో మీడియా ప్రతినిధులు పోషించిన పాత్ర చూస్తే…గాలి జనార్ధన్‌ రెడ్డి కంటే రెండు ఆకులు ఎక్కువే మేశారనిపిస్తుంది. అనుకూలంగా వార్తలు రాయాలన్నా డబ్బులే…వ్యతిరేక వార్తలు ఆపాలన్నా డబ్బులే. మీడియానే ఇంతగా అవినీతి కూపంలో మునిగిపోతే…ఇక ప్రజాస్వామ్యాన్ని రక్షించేది ఎవరో..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*