గాలి ముద్దుకృష్ణమ నాయుడి కొడుకుల మధ్య సయోధ్య కుదిరిందట..!

గాలి ముద్దుక్రిష్ణమ నాయుడు…ఈ పేరు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సుపరిచితం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్‌టి రామారావుకు సన్నిహితునిగా పేరుపొంది, రాజకీయాల్లో చేరిన అనతికాలంలోనే మంత్రిపదవులు దక్కించుకున్న ఆయన చిత్తూరు జిల్ల్లాలో మాత్రమే కాకుండా రాష్ట్రమంతటికీ బాగా తెలిసిన వ్యక్తి అయ్యారు. చంద్రబాబు ఎన్‌టిఆర్‌తో విభేదించిన సమయంలో ముద్దుక్రిష్ణమ నాయుడు తన ఆరాధ్యదైవం ఎన్‌టిఆర్‌తోనే నిలబడ్డారు. ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరారు. మళ్లీ టిడిపిలోకి ప్రవేశించారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా ప్రజలకు దగ్గరగా ఉండే నాయకుడు. సొంత నియోజకవర్గం నగరిలో ఏ కార్యకర్త ఇంటిలో ఏ కార్యం జరిగినా ( అది శుభమైనా, అశుభమైనా) తప్పక వెళ్లేవారు. ఇదే ఆయన్ను కార్యకర్తలకు దగ్గర చేసింది.

గత ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేసి రోజా చేతిలో ఓటమిపాలైన ముద్దుక్రిష్ణమ నాయుడు…ఆ తరువాత స్థానిక సంస్థల కోటా కింద ఎంఎల్‌సి అయ్యారు. ఆ పదవీకాలం ముగియకుండానే ఆయన ఆనారోగ్యంతో కన్నుమూశారు. తన జీవితకాలంలో రాజకీయ వారసుడెవరో ప్రకటించలేకపోయారు. ముద్దుక్రిష్ణమకు జగదీష్‌, భాను అనే ఇద్దరు కుమారులున్నారు. ఎవర్ని తన రాజకీయ వారసునిగా ప్రకటించినా ఇంకొకరు రచ్చకెక్కేపరిస్థితి ఉండటంతో…ముద్దుక్రిష్ణమ నాయుడు ఆ పని చేయలేకపోయారు. కుమారులను ఒప్పించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, ఆ వేదనతోనే ఆయన అరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారని, ఈ క్రమంలోనే ముద్దు మరణించారని చెబుతారు.

ముద్దుక్రిష్ణమ నాయుడు మరణించిన తరువాత ఎంఎల్‌సి పదవి అదే కుటుంబంలోని వారికి ఇవ్వాలని టిడిపి నిర్ణయించింది. అప్పుడు కూడా ఇద్దరు కొడుకులు పోటీపడ్డారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ముద్దు సతీమణికి ఇచ్చారు. వచ్చే శాసన సభ ఎన్నికల కోసం ఇప్పుడు నగరి నియోజకవర్గానికి అభ్యర్థిని ఖరారు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసం చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ఆ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అక్కడ కూడా భాను, జగదీష్‌ పొత్తలుపోకుండా భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో…మీలో ఎవరికి టికెట్టు కావాలో తేల్చుకునిరండి…లేదంటే వేరేవాళ్లకు ఇస్తాను అని చంద్రబాబు వార్నింగ్‌ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి.

ఈ క్రమంలో….గాలి కుటుంబ సభ్యులు అమరావతిలోనే తిష్టవేసి చర్చించారు. ఇద్దరిలో ఎవరికి టికెట్టు ఇచ్చినా పార్టీ గెలుపు కోసం పని చేస్తామని, ఎవరికి ఇవ్వాలో అధిష్టానమే నిర్ణయించాలంటూ నిర్ణయాన్ని చంద్రబాబుకు వదిలేసినట్లు సమాచారం. ఇంకా నియోజకవర్గం నుంచి హాజరైన ఇతర కార్యకర్తలతోనూ చర్చించిన తరువాత నగరి అభ్యర్థిని చంద్రబాబు ప్రకటిస్తారని ఆదివారం (07.10.2018) మధ్యామ్నానికి వార్తలు వచ్చాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*