గొల్లపల్లి మహద్భాగ్యం…! శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల స్వగ్రామం ఇదే..!

తిరుపతి నుంచి ముత్యాలరెడ్డిపల్లి, వైకుంఠపురం, ఉప్పరపల్లి దాటుకుని ముందుకు వెళితే రామానుజపల్లి వస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళితే గొల్లపల్లి గ్రామం కనిపిస్తుంది. ఈ గ్రామానికీ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవారి ఆలయానికి దశాబ్దాల అనుబంధం ఉంది. ఆలయ ప్రధాన అర్చకులు ఈ గ్రామానికి చెందినవారనే సంగతి చాలామందికి తెలియదు. మొన్నటిదాగా ప్రధాన అర్చకులుగా పనిచేసిన ఏవి రమణ దీక్షితులుగానీ, ప్రస్తుతం ప్రధాన అర్చకులుగా ఉన్న వేణుగోపాల దీక్షితులుగానీ…గొల్లపల్లి కుటుంబీకులే. ఇక్కడ గొల్లపల్లి అంటే…ఇంటిపేరు కాదు. ఊరిపేరు. ప్రధాన అర్చకుల పూర్వీకులు గొల్లపల్లిలో ఉండటం వల్ల…వారికి గొల్లపల్లి కుటుంబీకులుగా, వంశీకులుగా పేరువచ్చింది.

స్వామీ మాది (ధర్మచక్రం ఎడిటర్‌ ఆదిమూలం శేఖర్‌) గొల్లపల్లి….మీరు గొల్లపల్లి వంశీకులు కదా…మా గొల్లపల్లికి, మీకూ ఏదైనా అనుబంధం ఉందా అంటూ… ప్రస్తుత ప్రధాన అర్చకులు ఎ.వేణుగోపాల దీక్షితులు వద్ద గొల్లపల్లి ప్రస్తావన తీసుకురాగానే…ఆయన ఎంతగానో పులకించిపోయారు. తెరలు తెరలుగా కళ్లముందు కదిలిన తన చిన్ననాటి జ్ఞాపకాలను, గొల్లపల్లితో అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. వేణుగోపాల దీక్షితులు చిన్నతనంలో గొల్లిపల్లిలోనే ఉన్నారు. ఆయన తాతగారు ఎ.సుందరరామ దీక్షితులు, తండ్రి ఎ.రామచంద్ర దీక్షితులు ఊళ్లో జీవించారు.

తిరుపతి నుంచి గొల్లపల్లికి వెళ్లేటప్పుడు, ఊరి మొదట్లోనే…’అయ్యోరు బాయి (బావి)’ అనివుంది. ఇక్కడ బాదం, కిచ్చిలి, జామ తదితర చెట్ల మధ్య, ఆహ్లాదకర వాతావరణంలో ఓ పెంకుటిల్లు ఉండేది. ఈ ఇంట్లోనే వేణుగోపాల దీక్షితుల పూర్వీకులు నివసించారు. (క్రమంగా ఆ ఇల్లుపాడుబడిపోయింది). ఇక్కడే ఓ పెద్దబావి ఉండేది. అందుకే దాన్ని అయ్యోరు బాయి అని పిలిచేవారు. ఈ బావికి చుట్టూవున్న భూములను వేణుగోపాల దీక్షితులు పూర్వీకులు సాగుచేశారు.

వాస్తవంగా గొల్లపల్లిలోని భూములన్నీ వేణుగోపాల దీక్షితుల కుటుంబమే ఇనాం కింద అనుభవిస్తుండేది. రైతులు సాగు చేసుకుని ఎంతోకొంత కౌలు అయ్యోరు కుటుంబానికి చెలించేవారు. అర్చకుల కుటుంబాలు జీవించడానికి అప్పట్లో పాలకులు చేసిన ఏర్పాటు ఇది. భూపరిమితి చట్టం వచ్చాక….ఎవరు దున్నుతున్న భూములు వారి సొంతమయ్యాయి. చట్టానికి లోబడి కొంత భూమిని వేణుగోపాల దీక్షితుల కుటుంబం ఉంచుకుంది. ఇప్పటికీ వేణుగోపాల దీక్షితులుకు ఇక్కడ కొంత భూమివుంది.

‘నా చిన్నతనంలో గొల్లపల్లిలోనే ఉన్నాను. అప్పట్లో గొల్లపల్లిలో స్కూలు లేదు. పక్కనేవున్న రామానుపల్లి స్కూల్‌కెళ్లి చదువుకున్నాను. మేమంతా తిరుపతికి వచ్చేసినా మా నాన్నమ్మ పద్మావతమ్మ అక్కడేవుండి వ్యవసాయం చేయించేవారు. అప్పుడప్పుడూ గొల్లపల్లికి వెళ్లి వచ్చేవాళ్లం.’ అంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు వేణుగోపాల దీక్షితులు. ఒకసారి తన తండ్రి బావిలో పడిపోతే గ్రామస్తులు కాపాడిన ఉదంతాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు ఆయన. ‘ఊరు మొదట్లోనే ఉండటం వల్ల ఊర్లోకి వెళ్లాల్సిన అవసరం ఎప్పుడోగాని వచ్చేదికాదు…జాతరకు గంగమ్మ గుడి వద్దకు వెళ్లేవాళ్లం. అక్కడి సమీపంలోని ఇంట్లో మా పెదనాన్న వాళ్లు కొంతకాలం కాపురం ఉన్నారు’ అని చెప్పారు దీక్షితులు.

ఇక వేణుగోపాల దీక్షితుల పెదనాన్న ఎఎస్‌ పాపన్న దీక్షితులు కుటుంబమూ ఇదే గ్రామంలో ఉండేది. పాపన్న దీక్షితులు కుమారుడు సుందరరామ దీక్షితులు కూడా ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో అర్చకులుగా ఉన్నారు. ఆయనా ధర్మచక్రంతో రెండు మాటలు ముచ్చటించారు. తాను గొల్లపల్లి స్కూలులోనే చదువుకున్నానని చెప్పారు. ఊళ్లోని భజనమందిరం, నడివీధి గంగమ్మ…అన్నీ ఇప్పటికీ గుర్తున్నాయని చెప్పుకొచ్చారు.

గొల్లపల్లికి ఆనుకునే తూర్పన చిగురువాడ, పశ్చిమాన పైడిపల్లి ఉన్నాయి. ఈ రెండు గ్రామాలూ శ్రీవారి ఆలయ అర్చకులకు సంబంధించినవే. పెద్దింటి వంశానికి చిగురువాడ కేంద్రమైతే, పైడిపల్లి వంశీకులకు పైడిపల్లి కేంద్రంగా ఉండేది. అదేవిధంగా తిరుపతమ్మ వంశమూ శ్రీవారి ఆలయ అర్చత్వంలో ఉన్న సంగతి తెలిసిందే. మిరాశీ వ్యవస్థ రద్దు కాకమునుపూ ఈ నాలుగు కుటుంబాల్లోని వారు వంతుల వారీగా సంవత్సరానికి ఒకరు అర్చకత్వం చేసేవారు. అంటే ఒకొక్కరికి అర్చకత్వం వంతు వచ్చే సరికి ఏడెనిమిదేళ్లు పట్టేది. కానీ మిరాశీ వ్యవస్థ రద్దయి…టిటిడి అర్చకులను నియమించిన తరువాత… ఇప్పటిదాకా గొల్లపల్లి వంశస్తులే ప్రధాన అర్చకులుగా ఉంటున్నారు.

గొల్లపల్లి వంశం – అర్చకత్వం
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఆలయాల్లో మిరాశీ వ్యవస్థ రద్దవడంతో టిటిడిలోనూ మిరాశీకి మంగళం పాడారు. అప్పటిదాకా టిటిడిలో మిరాశీ పద్ధతిలో అర్చకత్వం బాధ్యతల్లో ఉన్నవారికి ఉపాధి చూపించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. ఈ మేరకు నాలుగు ప్రధాన అర్చక, 4 ముఖ్య అర్చక, 43 అర్చక పోస్టులను స ష్టించింది. ఈ పోస్టుల్లో అప్పటిదాకా మిరాశీ వ్యవస్థలో పని చేస్తున్న కుటుంబాల వారిని నియమించమని సూచించింది. 1. పెద్దింటి, 2.పైడిపల్లి, 3. గొల్లపల్లి, 4. తిరుపతమ్మ కుటుంబాలు మిరాశీలో ఉండేవి. ఈ నాలుగు కుటుంబాల నుంచే ప్రధాన అర్చక, ముఖ్య అర్చక, అర్చక పోస్టుల భర్తీ కోసం టిటిడి కసరత్తు చేసింది. ఈ నాగులు కుటుంబాల వివరాలను సేకరించింది. ఆయా కుటుంబల్లో ఏ పోస్టుకు ఎవరు అర్హులో గుర్తించి, నియమించింది. ఇందులో గొల్లపల్లి కుటుంబం నుంచి రమణ దీక్షితులు ప్రధాన అర్చకులయ్యారు.

గొల్లపల్లి కుటుంబంలో ఎ.వెంకటరమణ దీక్షితులు, ఎ.సుందరరామ దీక్షితులను మొదటి తరంవారిగా టిటిడి గుర్తించింది. ఈ కసరత్తు జరిగేనాటికే ఈ ఇద్దరు జీవించి లేరు. అయితే…ఎ.వెంకటరమణ దీక్షితులు ఎవి రమణ దీక్షితులను తన కుమారుడిగా దత్తత తీసుకున్నారు. అంటే రమణ దీక్షితులు….వెంకటరమణ దీక్షితులు దత్తపుడ్రన్నమాట. ఇక సుందరరామ దీక్షితులకు పాపన్న దీక్షితులు, రామచంద్ర దీక్షితులు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పాపన్న దీక్షితులు ఈ నియామకాలు జరిగడానికి రెండేళ్ల ముందే మరణించారు. పాపన్న దీక్షితులుకు ఎఎస్‌. సుందరరామ దీక్షితులు, ఎఎస్‌. క్రిష్ణమూర్తి దీక్షితులు, ఎఎస్‌. వెంకటకుమార్‌ దీక్షితులు అనే ముగ్గురు కుమారులున్నారు. పాపన్న దీక్షితులు లేకపోవడం వల్ల ఈ ముగ్గురూ అర్చక పోస్టులకు సరిపడా విద్యార్హతలే ఉండటం వల్ల అర్చక పోస్ట్లుల్లో నియమించారు. ఆ విధంగా వీరికి ప్రధాన అర్చక పోస్టు తప్పిపోయింది.

ఇక ఎ.సుందరరామ దీక్షితులు రెండో కొడుకైన ఎ.రామచంద్ర దీక్షితులు అంకవైకల్యం కారణంగా అర్చకత్వానికి అర్హులు కాలేకపోయారు. ఈ సుందరరామ దీక్షితులుకు ఎ.వేణుగోపాల దీక్షితులు, ఎ.గోపినాథ్‌ దీక్షితులు, ఎ.రామక ష్ణ దీక్షితులు అనే ముగ్గురు కుమారులున్నారు. అప్పటికే ఈ ముగ్గురూ తిరుమల శ్రీవారి ఆలయంలో పని చేస్తున్నారు.

ఈ కసరత్తు అనంతరం గొల్లపల్లి వంశంలో మొదటి తరంలో గుర్తించబడిన ఇద్దరిలో (ఎ.వెంకటరమణ దీక్షితులు, ఎ.సుందరరామ దీక్షితులు) వెంకటరమణ దీక్షితులు దత్త పుత్రుడైన ఎవి రమణ దీక్షితులుకు ప్రధాన అర్చకునిగా నియమించడానికి అవసరమైన అర్హతలు ఉండటంతో ఆయన్ను ఎంపిక చేశారు. ఇప్పుడు రమణ దీక్షితులు స్థానంలో అంటే గొల్లపల్లి వంశం నుంచి వేణుగోపాల దీక్షితులను టిటిడి ఎంపిక చేసింది.

1 Comment

  1. పెద్దింటి కుటుంబం వారి ఈనాం గ్రామం చిగూరువాడ కాదు, వేమూరు. చిగూరువాడ తిరుపతమ్మగారి కుటుంబానికి చెందిన ఈనాం గ్రామం.

Leave a Reply

Your email address will not be published.


*