గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెస్తున్నారా? టిటిడి అధికారుల తొందరపాటు చర్యలు

గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తేవడమంటే ఏమిటో…టిటిడిలో జరుగుతున్న పరిణామాలను చూస్తే అర్థమవుతుంది. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు లేవనెత్తిన సున్నితమై అంశాలపై లౌక్యంగా వ్యవహరించాల్సిన టిటిడి అధికారలు…దూకుడుగా, తొందరపాటుగా తీసుకుంటున్న చర్యలతో వివాదం మరింత జఠిలం అవుతోంది. ఇక్కడే సమసి పోవాల్సిన వివాదాన్ని జాతీయ స్థాయి సమస్యగా మార్చేస్తున్నారు. దీనివల్ల తిరుపతిలో అనవసరమైన అలజడి రేగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

కారణాలు ఏమైనా కావచ్చుగానీ….రమణ దీక్షితులు కొన్ని ఆరోపణలు, విమర్శలు చేశారు. ఆయన లేవనెత్తిన అంశాలపై అవకాశం ఉంటే టిటిడి అధికారులు వివరణ ఇచ్చివుండాల్సిందే. ఆయన తప్పుచేశారని భావిస్తే… నోటీసులు ఇచ్చి, వివరణ అడిగివుండాల్సిందే. అలాకాకుండా…ఏమాత్రం సంయమనం పాటించకుండా, 65 ఏళ్ల వయో పరిమితిని తెరపైకి తెచ్చి 24 గంటల్లో ఆయన్ను ప్రధాన అర్చక పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతటితో ఆగలేదు. నోటీసులు ఇచ్చి నిర్ణయాన్ని అమలు చేయడానికి తొందరపడిపోయారు. రమణ దీక్షితులు అందుబాటులో లేరనే పేరుతో ఇంటికి నోటీసులు అంటించి అమర్యాదగా వ్యవహరించారు. దీంతో పాటు తిరుమలలోని మిగతా అర్చకులను, జియ్యంగార్లను ఒత్తిడి చేసి రమణ దీక్షితులుకు వ్యతిరేకంగా ప్రెస్‌మీట్‌ పెట్టించారు. దీక్షితులు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని చెప్పించారు. మరోవైపు అధికార పార్టీ నాయకులు దీక్షితులుపై రాజకీయ ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. దీంతో టిడిపి, బిజెపిలు కూడా రంగలోకి దిగి ప్రతి విమర్శలు చేస్తున్నాయి.

రమణ దీక్షితులును ఉన్నఫలంగా తొలగిచడాన్ని హిందూ సంస్థలు, బ్రాహ్మణ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నిజంగా 65 ఏళ్ల నిబంధన ఉంటే ఇన్నాళ్లు దాన్ని అమలు చేయకుండా, ప్రశ్నించినపుడే ఎందుకు వేటు వేశారని నిలదీస్తున్నారు. రమణ దీక్షితులు చేసిన ఆరోపణలను జనం పెద్దగా పట్టించుకోలేదుగానీ….ఆయనపై ఆఘమేఘాల మీద చర్యలు తీసుకోవడంతో అందరి దృష్టి ఈ అంశంపైనే పడింది. తొలగించాల్సింది రమణ దీక్షితులను కాదు…డాలర్‌ శేషాద్రిని అంటూ హిందూ మత సంస్థలు ఆందోళనకు దిగుతున్నాయి. ఈ వివాదం రాజకీయ రంగు పులుముకోవడంతో దీక్షితులుకు మద్దతుగా పెద్ద స్థాయిలో ఆందోళనలు జరిగే సూచలను కనిపిస్తున్నాయి. రమణ దీక్షితులు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఆ విధంగా కోర్టు కూడా జోక్యం చేసుకుంటుంది.

టిటిడి ఎందుకు ఇంత దుందుడుకుగా వ్యవహరిస్తున్నారనేది ప్రశ్న. రమణ దీక్షితులు చేసిన విమర్శలతో ప్రభుత్వానికీ కోపం వచ్చింది. అందుకే ఇంత వేగంగా చర్యలు తీసుకున్నారన్న అభిప్రాయం సర్వత్రా ప్రబలుతోంది. మత చాందస శక్తులు తిరుపతిలో అలజడి సృష్టించడానికి ఎప్పటి నుంచో కాచుకుని కూర్చున్నాయి. ఈ పరిస్థితుల్లో టిటిడినే ఒక అజెండాను వారి చేతిలో పెట్టినట్లు అయింది. రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై టిటిడినే ఒక కమిటీని నియమించి విచారణ జరిపింవుంటే ఇంతదాకా వచ్చేది కాదు. జరగబోయే పరిణామాలకు టిటిడి అధికారులే బాధ్యత వహించాల్సివుంటుంది.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*