గోడమీద పిల్లిలా కూర్చున్న దేవెగౌడ!

కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌, బిజెపి హోరాహోరీ తలపడుతున్నట్లు కనిపిస్తున్నా….మాజీ ప్రధాని దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్‌ (ఎస్‌) పార్టీ కూడా ప్రభావంతమైన పాత్రే పోషిస్తోంది. ఆ పార్టీకి 40-50 సీట్లు దాకా వస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే…అందర్నీ వేధిస్తున్న ప్రశ్న ఏమంటే…ఎన్నికల అనంతరం జెడిఎస్‌ ఎటు వెళుతుంది, ఎటువంటి పాత్రి పోషిస్తుంది అనేదే. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లి ప్రచారం చేస్తున్న టిడిపి నాయకులు బిజెపిని ఓడించమంటున్నారు. అంతే కాంగ్రెస్‌కుగానీ, జెడిఎస్‌కుగానీ ఓట్లు వేసుకోండని అర్థం. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ బెంగుళూరుకు వెళ్లి…కాంగ్రెస్‌, బిజెపిలకు కాకుండా జెడిఎస్‌కు ఓట్లేయమని పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బిఎస్‌పి అధినేత మాయావతి కర్నాటకకు వెళుతున్నారు. జెడిఎస్‌ గెలుపు కోసం ప్రచారం చేస్తామని ప్రకటించారు. ఇదంతా బాగానేవుందిగానీ….దేవేగౌడనే అంత పారదర్శకంగా లేరనిపిస్తోంది. ఎందుకంటే…ఆయనకు మద్దతు ఇస్తున్న మూడు రాష్ట్రాల పార్టీలూ బిజెపిని వ్యతిరేకిస్తూ…దేవగౌడకు మద్దతు ఇస్తుంటే, ఆయన మాత్రం బిజెపితో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిజెపికి కూడా జెడిఎస్‌ను పెద్దగా టార్గెట్‌ చేయడం లేదు. కాంగ్రెస్‌పైనే కత్తులు దూస్తోంది. జెడిఎస్‌ కూడా అంతే…స్థానికంగా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది తప్ప బిజెపిని ఏమీ అనడం లేదు. మోడీ కర్నాటక సభల్లో మాట్లాడుతూ ‘దేవెగౌడ అంటే నాకు ఎంతో గౌరవం. ఆయన వస్తానంటే కారు తలుపులు తీసి ఆహ్వానిస్తా. వెళ్లిపోతానంటే కారు తలుపులు తీసి పంపుతా….అంతటి గొప్ప వ్యక్తిని (దేవగౌడను) కాంగ్రెస్‌ అవమానిస్తోంది’ అంటూ దళపతిపైన ఎనలేని ప్రేమను కురిపించారు. ఈ ప్రశంసల వెనుక…ఎన్నికల అనంతర ప్రయోజనాలు దాగి ఉన్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. తమకు కొన్ని సీట్లు తగ్గితే…జెడిఎస్‌ సహకారం తీసుకోవాలని బిజెపి భావిస్తోంది. గతంలోనూ బిజెపి సహకారంతో దేవగౌడ తనయుడు కుమారస్వామి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. యడ్యూరప్ప సిఎం అయ్యేందుకు జెడిఎస్‌ సహకరించింది. అందుకే దేవగౌడపైన బిజెపి ఆశలు పెట్టుకుంది. జెడి(ఎస్‌)లో ఎస్‌ అంటే సెక్యులర్‌. అంటే లౌకికత్వం. బిజెపితో అంటకాగి ఆ మాటకే విలువ లేకుండా చేశారు దేవెగౌడ.

జెడిఎస్‌ రెండొ తలుపులు కూడా తెరుచుకుని సిద్ధంగా ఉంది. మాయావతి వంటివారి సహకారం తీసుకోవడం అంటే…ఎన్నికల తరవాత అటు కాంగ్రెస్‌తో కలవడానికి కూడా అవకాశాన్ని అట్టిపెట్టుకుంది. బిజెపిని దూరంగా పెడతానని హామీ ఇవ్వకుంటే మాయావతి వంటివారు ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశమే లేదు. దేవేగౌడ వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు. ఎన్నికల అనంతరం ఎటుకావాలంటే అటు దూకడానికి అనుకూలంగా గోడమీద పిల్లలా కూర్చున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*