గోదావరి పుష్కరాల చావుల పాపం…మీడియాది, మత ప్రభోదకులదే…!

మూడేళ్ల క్రితం గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట జరిగి 29 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రధాన కారణం పత్రికలు, టివి ఛానళ్లు, మత ప్రబోధకులేనని తేల్చేసింది…ఈ ఘటనపై విచారణ కోసం నియమించిన సోమయాజులు కమిషన్‌. ఇది తేల్చడానికి ఒక కమిషన్‌ అవసరమా…అనిపించేలా నివేదిక ఇచ్చింది.

రాజమండ్రిలో విఐపిల కోసం ప్రత్యేక ఘాట్‌ ఏర్పాటు చేసినా…ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబం సామన్యుల కోసం ఏర్పాటు చేసిన స్నానాల ఘాట్‌కు వచ్చింది. వేలాది మంది గుమిగూడిన ఆ ప్రాంతంలో నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ఛానల్‌ షార్ట్‌ ఫిల్మ్‌ తీయడానికి ప్రభుత్వం అనుమతించిందని, ఆ షూటింగ్‌ కోసమే చంద్రబాబు నాయుడు సామాన్యుల ఘాట్‌కు వచ్చారన్న ఆరోపణలు వచ్చాయి.

వేలాది మంది గుమిగూడే చోట సరైన ఏర్పాట్లు లేకపోవడం, కనీసం అంబులెన్సులు రావడానికి వెళ్లడానికి కూడా దారి లేకపోవడం…వంటి వైఫల్యాలు అనేకం ఉన్నాయి. వేలాది మంది ఒక్కసారిగా స్నానానికి ఉపక్రమించిన క్రమంలో తొక్కిసలాట జరిగి…29 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయపడ్డారు.

ప్రభుత్వ తప్పొప్పులను, అధికారుల వైఫల్యాలను సమగ్రంగా అధ్యయనం చేసి, విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిన కమిషన్‌….పుష్కరాల గురించి మీడియా అతిగా ప్రచారం చేయడం వల్లే అనర్థం జరిగిందన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. ఫలానా సమయానికి స్నానం చేస్తేనే పుణ్యం లభిస్తుందని టివి ఛానళ్లు, పత్రికలు ఊదరగొట్టడం వల్ల జనం ఒక్కసారిగా స్నానానికి ఉపక్రమించారని కమిషన్‌ పేర్కొంది. మత ప్రబోధకులు కూడా ఫలానా సమయానికే మునగాలని ముహూర్తం నిర్ణయించడాన్ని కూడా కమిషన్‌ తప్పుబట్టింది.

అయినా…ఇది మీడియా తప్పు ఎలా అవుతుంది? మీడియా అంతగా ప్రచారం చేసినపుడు…వేలాది మంది వస్తారని తెలిసినపుడు….అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? ఇప్పుడు మీడియా విస్తృతమయింది. పుష్కరాలకు ఉన్న ప్రాధాన్యత రీత్యా దానికి ఎక్కువ ప్రచారం కల్పించిన మాట వాస్తవం. పుష్కరాలతో ప్రభుత్వానికి ఏ సంబంధం లేకున్నా…కొన్ని నెలల ముందు నుంచే ప్రచారం హోరెత్తించింది. గోదావరి పుణ్య స్నానాలు ఆచరించమని ప్రోత్సహించింది. ఈ విషాదానికి ప్రభుత్వ తీరు కారణం కాదా?

పుష్కరాల చావుల పాపాన్ని మీడియాపైకి, ప్రబోధకులపైకి నెట్టేయడం సమంజసం కాదు. మీడియా కాస్త ఎక్కువగా ప్రచారం చేసివుంటే చేసివుండొచ్చు. చివరిగా ప్రజలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అధికారులది. ఆ కోణంలో వైఫల్యాలు ఎక్కడున్నాయో నిర్ధిష్టంగా తేల్చి, బాధ్యులైనవారిపైన చర్యలు తీసుకుంటే….భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు పునరావృత్తం కాకుండా ఉంటాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*