చంద్రగిరి రీపోలింగ్…నిజాలు చెప్పని మీడియా..!

చంద్రగిరి నియోజకవర్గం లో ఐదు పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ జరపాలని ఈసి తీసుకున్న నిర్ణయం పై అధికార తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పోలింగ్ జరిగిన 30 రోజుల తరువాత రీపోలింగ్ జరపడం ఏమిటని ప్రశ్నిస్తోంది. తాము కోరిన చొట రీపోలింగ్ కు అంగీకరించని ఈసి…వైసిపి అడిగిన చోట రీపోలింగ్ జరిపిస్తోందని, ఇది‌ వివక్ష చూపడమే అని‌ విమర్శిస్తోంది.‌

తెలుగుదేశం పార్టీకి బలమున్న ఈ గ్రామాల్లో…వైసిపికి అనుకూలంగా ఓటు వేస్తారన్న అనుమానంతో దళితులను ఓటు వేయనీయలేదని, టిడిపి నేతలు రిగ్గింగ్ చేశారని గత 30 ఏళ్లుగా జరిగిందే ఈ ఎన్నికల్లోనూ జరిగిందని, అందుకే రీపోలింగ్ డిమాండ్ చేశామని, సిసి పుటేజీలు పరిశీలించిన తరువాత రీపోలింగ్ కు అనుమతించారని వైసిపి చెబుతోంది.

టిడిపి, వైసిపి ఎవరి వాదనలు వారు వినిపిస్తారు. ఇందులో నిజం ఉండొచ్చు..లేకపోవచ్చు. అయితే ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చాల్సిన బాధ్యత మీడియాపైన ఉంది. ఈ గ్రామాల్లో దళితులని ఓటు వేయనీయలేదని, వాళ్ల ఓట్లు కూడా టిడిపి నేతలే వేసేశారని వైసుపి చేస్తున్న ఆరోపణల్లో నిజముందా లేదా అని తేల్చడం పెద్ద సమస్య కాదు. దళితవాడలకు వెళ్లి విచారిస్తే వాస్తవం ఏమిటో తెలుస్తుంది.‌ నిజంగానే దళితులను ఓట్లు వేయనీకుండా‌ అడ్డుకుని వుంటే…ఆలస్యంగానైనా రీపోలింగ్ పెట్టడాన్ని ఆహ్వానించాలి. మీడియా కూడా దళితుల పక్షాన నిలబడి వాళ్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సహకరించాలి.

అయితే మీడియా ఆ పని చేయలేదు. దళితుల అంశాన్ని అసలు పట్టించుకోలేదు.‌ రీపోలింగ్ పెట్టడమే అప్రజాస్వామ్యం అనేవిధంగా గగ్గోలు పెడుతోంది. దళితులను ఓటు వేయనీయ కపోవడం అప్రజాస్వామ్యం కాదా….!

ఇక్కడ కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. తిరుపతికి కూతవేటు దూరంలో ఉన్న కొన్ని పల్లెల్లో ఇప్పటికీ పెత్తందారులు…దళితులను అణగదొక్కుతున్నారు. ఓటు వేయనీయడం లేదు. ఇప్పుడు రీపోలింగ్ జరుగుతున్న కమ్మపల్లిలో తమను 30 ఏళ్లుగా ఓటు వేయనీయటం లేదంటూ ఎన్నికల ముందే దళితులు జిల్లా కలెక్టరుకు, ఎన్నికల సంఘానికి, ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు…దళితులు చెప్పినది వాస్తమేనని తేల్చారు. అయినా కూడా ఈ ఎన్నికల్లోనూ తమను ఓట్లు వేయనీలేదని దళితులు వాపోతున్నారంటే…జిల్లా ఎన్నికల అధికారులు ఎలా పని చేశారో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు రీపోలింగ్ అనివార్యం అయిందని వైసిపి చెబుతోంది.

ఈ గ్రామాల్లో ఎన్నికలు ఏవిధంగా ఏకపక్షంగా జరుగుతాయో చెప్పడానికి కొన్ని లెక్కలను వైసిపి చూపుపోంది. 2014లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో ఈ గ్రామాల‌లో…. ఎన్‌.ఆర్‌.క‌మ్మ‌ప‌ల్లి – మొత్తం ఓట్లు 626. టిడిపికి 624, వైసిపికి 2 ఓట్లు మొత్తం 13 మంది అభ్య‌ర్ధుల‌కు సున్నా. వెంక‌ట రామాపురం లో మొత్తం ఓట్లు 320 అందులో టిడిపికి 316 వైసిపికి ఒక్క ఓటు వ‌చ్చింది. రావిళ్ల‌వారిప‌ల్లి (రీపోలింగ్ జ‌ర‌గ‌డం లేదు) మొత్తం ఓట్లు 508. తెలుగుదేశానికి వ‌చ్చింది ఎన్నో తెలుసా? 508. కొత్త కండ్రిగ‌లో మొత్తం ఓట్లు 859 కాగా టిడిపికి 812 వ‌చ్చాయి. క‌మ్మ‌ప‌ల్లిలో 931 ఓట్లు ఉండ‌గా టిడిపికి 771 ఓట్లు వ‌చ్చాయి. పుల‌వ‌ర్తివారి ప‌ల్లిలో 716 ఓట్లు ఉంటే అందులో 499 టిడిపికి వ‌చ్చాయి. ఇవి ఓటర్లు స్వచ్ఛందంగా వేస్తే వచ్చినవి కావని, రిగ్గింగు చేసుకున్నవని చెబుతున్నారు.

ఈ గ్రామాల్లో పరిస్థితులు సవ్యంగా లేవనడానికి ప్రాతిపదిక కనిపిస్తోంది.‌ ఇటువంటి చోట రీపోలింగ్ జరగడాన్ని తప్పుపట్టాల్సిన అసరం లేదుగానీ…ఇంత ఆలస్యంగా ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అనేదానిపైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఈసిపైన ఉంది. ఈ అంశంలో మీడియా ఈసిని ప్రశ్నించవచ్చు.‌ అంతేగానీ…రీపోలింగే అప్రజాస్వామ్యం అనడం, దళితుల హక్కుల గురించి పట్టించుకోపోవడం ప్రజా పాత్రికేయం అనిపించుకోదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*