చంద్రబాబుకు కంటిలో నలుసులా మారిన అజేయ కల్లం..!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లంకు మొదటి నుంచి సమర్ధుడన్న పేరువుంది. నిజాయితీగా ఉంటారన్న కీర్తివుంది. ఆయన టిటిడి ఈవోగా పని చేసిన సందర్భంలోనూ పాలనలో తనదైన ముద్ర వేశారు. అటువంటి వ్యక్తి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు….తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చికాకుపెట్టిస్తున్నాయి.

మరో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు కూడా ప్రభుత్వంపై రోజూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే….ఆయన ఉద్యోగ విరమణ తరువాత బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పని చేయడం, ప్రస్తుతం బిజెపిలో చేరడంతో ఐవైఆర్‌ మాటలకు రాజకీయ రంగు అద్దడానికి అవకాశం ఉంది. అజేయ కల్లం విషయంలో అటువంటి అవకాశం లేదు.

తాత్కాలిక సచివాలయ నిర్మాణం కోసం చదరపు అడుగుకు రూ.11,000 ఖర్చు చేశారని కల్లాం చెప్పారు. అదేవిధంగా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విధాన నిర్ణయం ప్రకారం….ఎవరికీ సొంతంగా భూములు విక్రయిచకూడదు. కేవలం లీజుకు మాత్రమే ఇవ్వాలి. కానీ కోట్లాది రూపాయల విలువైన భూములను లక్షల రూపాయలకు ఇచ్చేశారన్నది ఆయన రెండో ఆరోపణ. ప్రభుత్వ ధనంతో దీక్షలు, సభలు నిర్వహిస్తూ రాజకీయ ప్రచారం చేసుకోడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. ప్రచారానికి పెడుతున్న ఖర్చుతో మంచి సంక్షేమ పథకాలు ప్రారంభించివుండొచ్చుని చెప్పారు.

అజేయ కల్లం చెస్తున్న ఆరోపణలపై టిడిపి నేత కుటుంబరావు స్పందించారు. సచివాలయ నిర్మాణానికి చ.అ.కు రూ.2,300 మాత్రమే చెల్లించామని, పర్యావరణహితమైన ఏర్పాట్ల కోసం చ.అ.కు. 3,500 చెల్లించినట్లు వెల్లడించారు. అంటే మొత్తంగా చ.అ.కు రూ.8,500 చెల్లించారన్నమాట. సాధారణంగా చ.అ.కు రూ.2000 చెల్లిస్తే ఇంధ్రభవనం వంటి ఇంటిని నిర్మించవచ్చు. అటువంటిది కుటుంబారావు లెక్కల ప్రకారం చూసినా రూ.5,800 అనేది చాలా పెద్దమొత్తమే. రెండున్నర రెట్లు ఎక్కువ. అయినా…తాత్కాలిక సచివాలయం కోసం అంత వెచ్చించాల్సిన అవసరం ఏముంది? రూ.2,000 పనికి రూ.5,800 చెల్లించారంటేనే ఇందులో ఏదో మతలబు ఉందన్న సంగతి తెలిసిపోతోంది.

ఇక సచివాలయం, అసెంబ్లీ భవనాల నాణ్యత ఎలావుందో ఇప్పటికే పలుసార్లు బయటపడింది. చిన్నపాటి వర్షాలకే కురవడం, నీళ్లు నిలిచిపోవడంపై వర్షం కురిసినప్పుడల్లా మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి.

ఇక ఐటి సంస్థలకు భూముల ఎక్కడ కేటాయించారో చెప్పాలని కుటుంబరావు ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక భూబ్యాంకు ఏర్పాటు చేసి పరిశ్రమల పేరుతో భూపందేరం చేస్తున్నారు. ఏ పరిశ్రమకు ఎంత భూమి ఇచ్చారు, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంతమందికి ఉపాధి వచ్చింది అనే వివరాలను వెల్లడించాల్సింది ప్రభుత్వమేగానీ అజయ్‌ కల్లాం కాదు.

ఇక అజయ్‌ కల్లాం రాయలసీమకు సంబంధించి కీలక విషయాలను వెల్లడిచారు. హెచ్‌సిఎల్‌ కంప్యూటర్స్‌ సంస్థ అధినేత శివనాడార్‌…తాను తిరుపతిలో హెచ్‌సిఎల్‌ కంపెనీని ఏర్పాటు చేయాలనుకుంటే….ప్రభుత్వ పెద్దలు రాజధాని గొప్పలు చెప్పుకోవడం కోసం ఆ సంస్థను అమరావతికి తరలించారని చెప్పారు. తనకు తిరుపతిలో పెట్టడమే అనుకూలంగా ఉంటుందని, శ్రీవారి భక్తుడనైన తనకు తిరుపతిలో పెట్టాలన్న కోరిక ఉందని శివనాడార్‌ చెప్పినా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదట. తిరుపతిలో హెచ్‌సిఎల్‌ సంస్థ వచ్చివుంటే వేల మందికి ఉపాధి లభించేది.

ఇటువంటి అంశాలు ఎన్నో అజయ్‌ ల్లాం వద్ద ఉన్నాయి. ఇవన్నీ బయటికొస్తే… ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేక కొట్టుమిట్టాడాల్సిందే. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన వ్యక్తికి కీలకమైన విషయాలన్నీ తెలివుంటాయనడంలో సందేహం లేదు. అందుకే ఆయన చేస్తున్న ఆరోపణలకు ప్రాధాన్యత లభిస్తోంది. అజేయ కల్లం మాటలు జనంలోకి వెళితే…ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి అప్రతిష్ట తప్పుదు. అందుకే…ఆయన విమర్శలకు సరైన సమాధానం ఇవ్వకుండా….ఆయనపై కులం ముద్ర, రాజకీయ ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*