చంద్రబాబుకు కెసిఆర్‌ ఉచ్చు బిగిస్తున్నారా..?

తెలంగాణలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే….ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉచ్చు బిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఫైర్‌బ్రాండ్‌గా ఉంటూ ఓటుకు నోటు కేసులో చిక్కుకుని, ఇటీవలే కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న రేవంత్‌ రెడ్డిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించడం, ఆయన మనీ ల్యాండరింగ్‌ వంటి ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు ప్రకటించడం తెలిసిందే.

ఇదే క్రమంలో ఓటు నోటు కేసులో నిందితుడుగా ఉన్న ఉదయ్‌ సింహ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. అంతటితో ఆగకుండా….ఉదయ్‌ సింహ బంధువు రణధీర్‌ రెడ్డి ఇంటిలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఐటి అధికారుల పేరుతో దాడులు చేసి ఇంట్లో నుంచి కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌ తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే పెద్ద చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్‌లో చేరిన తరువాత కూడా దూకుడుగా ఉన్న రేవంత్‌ రెడ్డిని ఇరికించడం కోసమైతే….ఇప్పటికే ఆయన ఇంటిపై దాడులు నిర్వహంచి సేకరిచిన ఆధారాలు సరిపోతాయి. అయినా….ఉదయ్‌ సింహ ఇంటిలో, రణధీర్‌ ఇంటిలోనూ సోదాలు నిర్వహంచడం, కంప్యూటర్‌ హార్డ్డ్‌ డిస్క్‌ తీసుకెళ్లడం చూస్తుంటే….ఇంకా ఏవో బలమైన ఆధారాల కోసం శోధిస్తున్నట్లు అనిపిస్తుంది. ఓటుకు నోటు కేసులో సిబిఐ చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావించింది. ఈ కేసులో రికార్డు అయిన గొంత చంద్రబాబుదేనని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ తేల్చిందికూడా. అయినా ఇప్పటిదాకా బాబును అరెస్టు చేయలేదు.

ఈ కేసులో కెసిఆర్‌తో చంద్రబాబు రాజీ చేసుకున్నారన్న వార్తలొచ్చాయి. కేసు బయటికొచ్చిన సమయంలో….’హైదరాబాద్‌ మాకు కూడా రాజధాని. ఇక్కడ నేనూ పోలీస్‌ స్టేషన్లు పెడతా. నాకూ ఏసిబి ఉంది…’ అంటూ హూంకరించిన చంద్రబాబు నాయుడు ఆ తరువాత ఉన్నఫలంగా హైదరాబాద్‌ వదిలి అమరావతికి వచ్చేశారు. కేసు రాజీలో భాగంగానే బాబు అమరావతికి చేరారని, అందుకు ఈ కేసును కెసిఆర్‌ కూడా పక్కనపెట్టారని ప్రచారం జరిగింది.

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఓటుకు నోటు కేసులో కదలిక వస్తోంది. నేరుగా ఈ కేసును కదిలించకుండా….ఇంకెక్కడో తీగ లాగడం ద్వారా డొంక కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్‌ రెడ్డి వద్ద ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని మొదలుపెట్టి, ఆయన అకౌంట్‌లో భారీగా నిధులు జమవడం, ఈ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పాలని ఐటి అధికారులు ప్రశ్నించడం, ఇదే సందర్భంలో ఓటుకు నోటు కేసులో పట్టుబడిన రూ.50 లక్షలు ఎక్కడని అడగడం; ఉదయ్‌ సింహాను కూడా ఇదే ధోరణిలో ప్రశ్నించడం చూస్తుంటే…ఓటుకు నోటు కేసును కదిలించే ప్రయత్నం చేస్తున్నారన్న సంగతి అర్థమవుతుంది.

తన ఇంట్లో దొరికిన హార్డ్‌ డిస్క్‌ కొన్ని నెలల క్రితం ఉదయ్‌ సింహా తనకు ఇచ్చారని రణధీర్‌ రెడ్డి చెబుతున్నారు. ఇంతకీ ఆ హార్డ్‌ డిస్క్‌లో ఏముంది? ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించిన విషయాలు అందులో ఉన్నాయా? ఉదయ్‌ సింహాను విచారించిన నేపథ్యంలో అతను ఇచ్చిన సమాచారంతోనే…రణధీర్‌ ఇంట్లో సోదాలు చేసి హార్డ్‌ డిస్క్‌ తీసుకెళ్లారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమి కడుతున్న నేపథ్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయన్నది బహిరంగ రహస్యం. ఈ కూటమిలో టిడిపి ఎంత వేగంగా ముందడుగు వేస్తే…ఈ కేసు ఉచ్చు అంత వేగంగా బాబు మెడకు చుట్టుకోవడం ఖాయం. అందుకే చంద్రబాబు నాయుడు మాత్రం మొదటి నుంచి ఆచితూచి మాట్లాడుతున్నారు.

ఆ మధ్య తెలంగాణలో పొత్తుల సంగతి తేల్చడానికి హైదరాబాద్‌ వెళ్లిన చంద్రబాబు….కెసిఆర్‌ను పొల్లెత్తుమాట అనలేదు. బిజెపిని తిట్టేసి, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య, ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య గొడవలు సృష్టిస్తున్నారంటూ పెద్ద మనిషి తరహా మాటలు చెప్పేసి వచ్చేశారు. ఇటీవల కూడా ఇటువంటి ధోరణితోనే మాట్లాడారు. ‘మొన్నటి దాకా బాగున్నారు. అన్నింటిలోనూ సహకరించారు. టిఆర్‌ఎస్‌తో కలిసి వెళదామనుకున్నాం. ఎప్పుడైతే బిజెపిని వ్యతిరేకించానో…వీరు కూడా రివర్స్‌ అయిపోయారు’ అని చంద్రబాబు అన్నారు. అంటే…తనకు టిఆర్‌ఎస్‌పైన, కెసిఆర్‌పైన వ్యతిరేకత లేదని చెప్పకనే చెప్పారు.

అయినా…తెలంగాణలో నాలుగు సీట్లు గెలుచుకోకుంటే తెలుగుదేశం పార్టీ ఉనికి ఉండదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో గెలవాలంటే కాంగ్రెస్‌ మద్దతు కావాలి. అందుకే అనివార్యమై కాంగ్రెస్‌తో కలిసి కదులుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కలిస్తే కెసిఆర్‌కు ఏ ఇబ్బందీ లేదుగానీ…తెలంగాణలో ఆ పని చేయడం టిఆర్‌ఎస్‌కు నష్టం కలిగించడమే. అందుకే ఓటుకు నోటు అస్త్రాన్ని బయటకు తీశారు కెసిఆర్‌. ఈ పరిస్థితుల్లో బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*