చంద్రబాబుకు కేంద్రం తొలిదెబ్బ!

నిన్నమొన్నటి బిజెపికి మిత్రపక్షంగా ఉంటూ, కేంద్రంలో అధికారాన్ని పంచుకున్న టిడిపి…ఇటీవల కాలంలో ప్రత్యేక హోదా పేరుతో వీధుల్లోకి వచ్చి ఆ పార్టీని తీవ్రంగా ఎండగడుతోంది. ‘మీరు రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదు’ అని టిడిపి ప్రభుత్వం అంటుంటే…’మేము చాలా ఇచ్చాం’ అని కేంద్రం వాదిస్తోంది. కేంద్రం ఇస్తున్న నిధుల గురించి జనానికి చెప్పకుండా, కేంద్ర నిధులతో అమలువుతున్న పథకాలకూ చంద్రబాబు తన పేరు పెట్టుకుని మోసం చేస్తున్నారని బిజెపి ఆరోపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలయ్యే పథకాల్లో ప్రధాన మంత్రి మోడీ ఫొటో పెట్టడం లేదని బిజెపి ఎత్తిచూపింది. దీనికి టిడిపి కూడా ఘాటుగా స్పందించింది. మన్మోహన్‌ సింగ్‌ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్‌, ఇతర బిజెపి పాలిత ప్రాంతాల్లో మన్మోహన్‌ ఫొటోలు మీరు పెట్టారా అంటూ టిడిపి ఎదురు ప్రశ్నించింది.

ఈ యుద్ధం ఇలా జరుగుతున్న క్రమంలోనే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అన్ని రాష్ట్రాలకు కొత్త ఆదేశాన్ని ఇచ్చింది. కేంద్రం నుంచి గ్రామాలకు వస్తున్న నిధుల వివరాలను ప్రతి పంచాయతీలో గోడలపైన రాయాలని ఆదేశించింది. ఇలా రాసిన గోడల ఫొటోలను తమకు పంపాలని అధికార యంత్రాంగానికి సూచించింది. గోడలు పెట్టలేని చోట ఫ్లెక్సీలైనా ఏర్పాటు చేయాలని చెప్పింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయాలని చెబుతున్నప్పటికీ….చంద్రబాబును దృష్టిలో ఉంచుకునే ఈ ఆదేశాలు ఇచ్చారు. దీనివల్ల కేంద్రం నుంచి నిధులు గ్రామాలకు వచ్చాయని ప్రజలకు తెలియజేయాలన్నది బిజెపి ఉద్దేశం. గోడ రాతలు రాయకుంటే….భవిష్యత్తులో రావాల్సిన నిధులు ఆపేసే ప్రమాదమూ ఉంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. గోడలపైన కేంద్ర ప్రభుత్వ నిధుల వివరాలను రాయిస్తుందా? లేక రాయించకుండా మొరాయిస్తుందా? ఏమైనా ఇది చంద్రబాబును ఇరుకునపెట్టే చర్యే. ఇంకో విధంగా చెప్పాలంటే చంద్రబాబును కేంద్రం కొట్టిన తొలి దెబ్బ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*