చంద్రబాబుకు చేదు గుళిక వంటి వార్త..!

కాంగ్రెస్‌ పార్టీతో జతకట్టిన సంతోషంలో హుషారుగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఇది నిజంగానే చేదు గుళిక వంటి వార్త. ఒక విధంగా ఆందోళన కలిగించే వార్త. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆయన్ను టెన్షన్‌ పెట్టే సమాచారం. ఇంతకీ అదేమంటే…

ఓటుకు నోటు కేసును రానున్న ఫిబ్రవరిలో విచారించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఈ కేసును సిబిఐతో దర్యాప్తు చేయించి, సాధ్యమైనంత త్వరగా విచారించాలని వైసిపి ఎంఎల్‌ఏ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. కేసు విచారణను ఫిబ్రవరిలో చేపట్టాలని ధర్మాసనం నిర్ణయించింది.

ఇది రాజకీయ రుద్దేశ్యంతో వేసిన కేసు అని చంద్రబాబు తరపు న్యాయవాది చేసిన వాదనను న్యాయమూర్తులు తోసిపుచ్చారు. ఆఖరికి మార్చి – ఏప్రిల్‌లో ఎన్నికలుంటాయని, ఫిబ్రవరిలో విచారణ చేపడితే ఇబ్బంది వస్తుందంటూ చేసిన వాదననూ న్యాయమూర్తులు పరిగణనలోకి తీసుకోలేదు. ఎన్నికలున్నా తామేమీ చేయలేమని, తమ పని తమదేనని తేల్చి చెప్పేశారు.

ఓటుకు నోటు కేసు సుప్రీంలో విచారణకు వస్తే….సిబిఐతో దర్యాప్తు చేయించాలన్న పిటిషన్‌ అభ్యర్థననూ మన్నిస్తుందా లేక తెలంగాణ ఏసిబి అధికారుల ఛార్జిషీట్‌నే పరిగణనలోకి తీసుకుని విచారణ చేపడుతుందా అనేది కూడా అప్పుడు తేలనుంది. ఒకవేళ సిబిఐతో దర్యాప్తు చేయించాలని సుప్రీం నిర్ణయిస్తే చంద్రబాబుకు తిప్పలు తప్పవు.

2015 మే 30న ఓటుకు నోటు వ్యవహారం సంచలనం రేపింది. తెలంగాణ ఎంఎల్‌సి ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిని గెలిపించుకునేందుకు స్టీఫెన్‌సన్‌ అనే నామినేటెడ్‌ ఎంఎల్‌ఏను ప్రలోభపెట్టడానికి రేవంత్‌ రెడ్డి నోట్ల కట్టలు తీసుకెళ్లడం, ఆ సమయంలో చంద్రబాబు కూడా స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్లు ఓ కాల్‌ రికార్డు కావడం తెలిసిన విషయాలే. ఈ రికార్డులోని గొంతు చంద్రబాబుదే అని ఛండీఘడ్‌లోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కూడా ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబునూ నిందితునిగా చేర్చాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టును కోరారు. మొత్తంమ్మీద ఎన్నికల సమయంలో ఈ కేసును విచారణ చేపట్టాలని సుప్రీం నిర్ణయించడం చంద్రబాబుకు ఆందోళన గలిగించే అంశమే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*