చంద్రబాబుకు నిజంగా ఆ జబ్బు ఉందా?!

గత ఎన్నికల్లో కలిసి పోటీచేసి, నాలుగేళ్లపాటు అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అధికారాన్ని కలిసి పంచుకున్న బిజెపి, తెలుగుదేశం ఇప్పుడు ఉప్పు-నిప్పులా ఉన్నాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జబ్బులనూ అంటగట్టారు బిజెపి నాయకులు. ఆ పార్టీ ముఖ్య నాయకులు విష్ణు కుమార్‌ రాజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ‘ఫియర్‌ సైకోసిస్‌’ అనే వ్యాధితో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు బహిరంగ సభల్లో మాట్లాడుతూ…కర్నాటక ఎన్నికల తరువాత బిజెపి మన రాష్ట్రంపైన దృష్టి సారిస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వానికిగానీ, తనకుగానీ ఏదైనా జరిగితే ప్రజలంతా వలయంలా ఏర్పాడి కాపాడాలని వ్యాఖ్యానించారు. తనపైన కేసులు పెట్టడానికి కుట్రలు చేస్తున్నారని కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు తీరుపైన తెలుగుదేశం శ్రేణుల్లోనూ కొంత ఆందోళన వ్యక్తమయింది. కేంద్ర ఇంటలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌ బాబుతో సమావేశమవడం, గవర్నర్‌ సిఎంను పిలిపించుకుని మాట్లాడటం, గవర్నర్‌ ఢిల్లీకి వెళ్లడం, బిజెపి నాయకులు తరచూ పోలవరంపై సిబిఐ విచారణ జరిపించాలని కోరడం….వంటి పరిణామాల నేపథ్యంలో బాబు కాస్త ఆందోళన చెందారు. కేసుల్లో ఇరికించాలనుకుంటే….కేంద్రానికి పెద్ద సమస్య కాదు. ఏదో ఒకపేరుతో కేసులు బనాయించొచ్చు. సోనియాను వ్యతిరేకించి వైసిపిని స్థాపించిన జగన్‌ మోహన్‌ రెడ్డిపైనా సిబిఐ కేసులు బనాయించారు. ఆ కేసులు తేలిన తరువాత నిర్దోషిగా బయటపడితే పడొచ్చుగానీ…జగన్‌ ఇప్పటికే ఆరు నెలలు జైలు జీవితం గడిపారు. ఆ విధంగా తనపైనా కేసులు బనాయించవచ్చన్న ఆందోళన చంద్రబాబులో ఉంది. అందుకే ఆయన నోట తరచూ ఆందోళన, భయంతో కూడిన మాటలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిజెపి నాయకులు ఆయన్ను ఎద్దేవా చేస్తున్నారు. బాబు ఫియర్‌ సైకోసిస్‌ వ్యాధితో బాధపడుతున్నారని, ఏమీ లేకపోయినా ఏదో జరగబోతున్నట్లు చెబుతూ ఆందోళన చెందుతున్నారని అంటున్నారు.

ఇంతకీ ఫియర్‌ సైకోసిస్‌ అంటే ఏమిటంటే….ఏదో తెలియని భయం వెంటాడటం. అన్నం తిన్నాలన్నా భయం, పడుకోవాలన్నా భయం, బయటకు వెళ్లాలన్నా భయం, ఎవరిని చూసినా భయం…ఇదే ఫియర్‌ సైకోసిస్‌ వ్యాధి లక్షణాలు. ముంబయి పేలుళ్ల తరువాత ఆ నగర జనంలో చాలా మంది ఫియర్‌ సైకోసిస్‌తో బాధపడ్డారట. ఎవరి నుంచి ఎటువంటి ముప్పు ముంచుకొస్తుందోనని ఆందోళన చెందారట. అయితే…అకారణ భయంతో బాధపడే ఈ వ్యాధి రెండు మూడు రోజులకు మించి ఉండదని వైద్యులు చెబుతున్నారు. బిజెపి నాయకులు చెబుతున్నట్లు నిజంగానే బాబుకు ‘ఫియర్‌ సైకోసిస్‌’ వ్యాధి ఉందనుకోవాలా?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*