చంద్రబాబుకు బిసిల భయం..!

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా బిసిలు… క్రమంగా తమ పార్టీకి దూరమవుతున్నారేమో అనే భయం, ఆందోళన టిడిపి నేతల్లో కనిపిస్తోంది. బిసిలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేనంతగా కంగారుపడుతున్నారు. బిసి నేతలతోనే మీడియా సమావేశాలు పెట్టించి… తెలుగుదేశం పార్టీనే బిసిలకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందని చెప్పిస్తున్నారు. గత కొన్ని రోజులుగా అన్ని జిల్లాల్లోనూ టిడిపి బిసి నాయకులంతా విలేకరుల సమావేశం నిర్వహించి ఈ మాటలు చెబుతున్నారు.

కొన్ని రోజుల క్రితం తెలంగాణ మాజీ మంత్రి, ప్రస్తుత ఎంఎల్‌ఏ తలసాని శ్రీనివాస యాదవ్‌ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి….బిసిల గురించి మాట్లాడారు. నిన్నమొన్న కూడా తెలంగాణలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు బిసిలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. తాను ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి బిసిలకు నాయకత్వం వహిస్తానని, తనకు బిసిల్లో ఒక శాతం మందినైనా ప్రభావితం చేయగల సత్తా ఉందని చెప్పారు. అప్పటి నుంచి టిడిపి నేతల్లో ఆందోళన మరీ ఎక్కువైనట్లు కనిపిస్తోంది.

ఇప్పటిదాకా బిసిలంతా గంపగుత్తుగా టిడిపికి ఓట్లు వేస్తూ వస్తున్నారు. ఆ పార్టీకి పునాదిగా నిలబడ్డారు. అయితే…2014 ఎన్నికల తరువాత టిడిపిలో వచ్చిన మార్పులు బిసిలను పునరాలోచింపజేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు తమ సామాజికవర్గానికి ఇచ్చిన ప్రాధాన్యత బిసిలకు ఇవ్వలేదన్న ఆవేదన టిడిపిలో ఉన్న బిసి నేతల్లోనే వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో టిడిపిలో బలమైన బిసి నేత కనిపించడం లేదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దేవేంద్రగౌడ్‌, శ్రీనివాసయాదవ్‌ వంటి వాళ్లు చాలామంది కనిపించేవారు. ఇప్పుడు కెసి కృష్ణమూర్తి వంటి వాళ్లు ఉన్నా….ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా…ఆ పదవి అలంకారప్రాయంగా మాత్రమే మిగిలిపోయింది.

టిడిపిలో తమ ప్రాధాన్యత ఎందుకు తగ్గిపోతోందో అనే ఆలోచన బిసి నేతల్లో మొదలయింది. దీన్ని పసిగట్టే కెసిఆర్‌ ఆ కోణం నుంచి నరక్కురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. తలసాని శ్రీనివాస యాదవ్‌ను రంగంలోకి దింపారు. శ్రీనివాస యాదవ్‌ మాట్లాడినప్పటి నుంచి బిసిల్లో పెద్ద చర్చ జరుగుతోంది. బిసిలకు టిడిపి ప్రత్యేకంగా చేసింది ఏముందన్న ప్రశ్న మొదలయింది. బిసిల నుంచి ఐదారు శాతం ఓట్లు అటూఇటూ అయినా టిడిపి ఇబ్బందుల్లో పడిపోతుంది. దీనికి సంబంధించిన ఇంటిలిజెన్స్‌ నివేదికలు ప్రభుత్వానికి చేరుతున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబులో ఆందోళన మొదలయింది. టిడిపికి బిసిలను దూరం చేయాడానికి కొన్ని పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అందుకే బిసిలంతా తమతోనే ఉన్నారని చెప్పించేందుకు టిడిపి బిసి నేతలతో ప్రెస్‌మీట్లు పెట్టిస్తున్నారు.

బిసిలను రాజకీయ భిక్షపెట్టింది తెలుగుదేశం పార్టీయేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారుగానీ….నాడు ఎన్‌టిఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారన్నా, ఆ తరువాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కారన్నా అందుకు కారణం బలహీనవర్గాలవారే. బిసిల వల్ల తెలుగుదేశం పార్టీ లాభపడింది తప్ప….తెలుగుదేశం వల్లే చంద్రబాబు సామాజికవర్గం బాగుపడిందనేది వాస్తవం. అయితే…దీన్ని రివర్స్‌లో చెబుతున్నారు.

టిడిపికి బిసిల నుంచి వస్తున్న మద్దతు ఎంత, ఆ పార్టీ బిసిలకు ఇస్తున్న సీట్లు ఎన్ని అనే చర్చకూడా ఇప్పుడు మొదలయింది. టిడిపికి బిసిలే ఆధారమైనపుడు…బిసి నేతనే ముఖ్యమంత్రిగా ఎందుకు చేయకూడదన్న ప్రశ్న కూడా వస్తోంది. బిసిని ముఖ్యమంత్రి చేస్తామనే మాట టిడిపి అధినేతల నోట ఏనాడైనా వినిపించిందా? ఎంతకాలమైనా బిసిలు పంచాయతీ వార్డు మెంబర్‌, సర్పంచు పదవులు, ఎంపిటిసి పదువులకే పరిమితవ్వాలా? ఇటువంటి ఆలోచన బిసిల్లో మెల్లగా రాజుకుంటోంది. ఇది ఎక్కడికి దారితీస్తుందో అనే ఆందోళన చంద్రబాబులో కనిపిస్తోంది.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*