చంద్రబాబుగారూ ఇదేమి వాదన…! ఇదెక్కడి లాజిక్‌..!!

విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ ఆక్రమించిన కోట్లాది రూపాయల విలువ చేసే 40 ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. శనివారం తెల్లవారుజామునే రెవెన్యూ అధికారులు జెసిబి యంత్రాలతో, పోలీసు బలగాలతో యూనివర్సిటీకి చేరుకుని కూల్చివేతలు మొదలుపెట్టారు. తెల్లారేసరికి కూల్చివేతలు పూర్తిచేసి, ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ యూనివర్సిటీ టిడిపి అధినేత నారా చంద్రబాబు కుమారుడైన నారా లోకేష్‌ తోడల్లు శ్రీభరత్‌కు చెందినది. ఇంకా చెప్పాలంటే నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడి కుటుంబానికి చెందినది. అందుకే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ భూముల అక్రమణను తొక్కిపెట్టారన్న విమర్శలొచ్చాయి.

గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూములను ఆక్రమించడమేగాక అందులో అనుమతి లేకుండా కట్టడాలు, అండర్‌ గ్రౌండ్‌ రోడ్లు నిర్మించింది. దీనిపైన గతంలోనే రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆక్రమణలను అంగీకరిస్తూనే….ఆ భూములను ఎకరా రూ.18 వేల వంతన తమకే విక్రయిస్తే కొనుగోలు చేస్తామని సదరు యూనివర్సిటీ యాజమాన్యం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఆ ప్రతిపాదను పరిశీలించి, తుది నిర్ణయం తీసుకునేలోపే ఎన్నికలొచ్చి ప్రభుత్వం మారిపోయింది. ఇప్పటి ప్రభుత్వం ఆక్రమణలను తొలగించింది.

ఈ వ్యవహారంలో తేలేదేమంటే…గీతం యూనివర్సిటీ భూములను ఆక్రమించుకున్నది వాస్తవం. ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వమే ఈ ఆక్రమణలను ధ్రువీకరించింది. అందువల్లే ఇప్పుడు చంద్రబాబు గట్టిగా ఖండించలేదకున్నారు. గీతం యూనివర్సిటీ భూములను ఆక్రమించలేదని చెప్పలేకున్నారు. అందుకే సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.

గీతం యూనివర్సిటీకి చెందిన వైద్య కళాశాల 2900 మంది కోవిడ్‌ బాధితులకు ఉచితంగా చికిత్స చేసింది…అటువంటి సంస్థ నిర్మాణాలను కూల్చేస్తారా..? అని చంద్రబాబు ఆక్రోశించారు. వందల కోట్ల రూపాయల భూములను ఆక్రమించుకుని, కొందరు కోవిడ్‌ రోగులకు చికిత్స అందిస్తే….ఆక్రమణలను చూసీచూడనట్లు వదిలేయాలా? కోటి రూపాయలు తినేసి వంద రూపాయల సేవ చేస్తే మహనీయులైపోతారా? ఇదేమి వాదన. అదేవిధంగా ఉత్తరాంధ్రకు తలమానికంగా ఉన్న యూనివర్సిటీలో ఆక్రమణలు కూల్చుతారా అని కూడా బాబు మండిపడ్డారు. ఈ లెక్కన ఏ విద్యాసంస్థయినా యథేచ్ఛగా ఆక్రమణలు చేసుకోవచ్చన్నమాట.

ఇక రెండో వాదన ఎప్పుడూ ఉండేదే. అదే కక్షసాధింపు. ‘టిడిపి నేతలపై కక్షసాధిస్తున్నారు. మొన్న సబ్బం హరి, ఇప్పుడు గీతం యూనివర్సిటీ నిర్మాణాలను కూల్చేశారు. నిర్మించలేని వాళ్లకు కూల్చే హక్కులేదు.’ ఇదీ చంద్రబాబు చెప్పిన మరోమాట. అనంతపురం జెసి దివాకర్‌ రెడ్డి కాలం చెల్లిన వాహనాలు తిప్పుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే…దాన్ని కట్టడి చేయడాన్ని కూడా కక్షసాధింపుగానే చెప్పారు. అచ్నెన్నాయుడు ఈఎస్‌ఐ మందుల కుంభకోణంలో కోట్లు మింగితే అదీ కక్షపాధింపు అన్నారు. పదిమంది కోవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోడానికి కారణమైన రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యంపై కేసులు పెడితే.,..కక్షసాధింపుగా అభివర్ణించారు. ఇప్పుడు అదీ పల్లవి అందుకున్నారు.

గీతం యూనివర్సిటీలో ఆక్రమణలు లేవనుకుంటే లేవని చెప్పాలి. అంతేగానీ ఆక్రమణలు ఉన్నాయని తేలి, ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకుంటే కక్షసాధింపు అని చెప్పడంలో అర్థం లేదు. తమ వాదనలో బలం లేపుడు ఇటువంటి సెంటుమెంటు అంశాలు తెరపైకి తెస్తారు. అయితే ఇవి చట్టం ముందు నిలబడవు.

ఏదిఏమైనా గీతం వర్సిటీ ఆక్రమణలోని 40 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోడాన్ని అభినందించాలి. ఇటువంటి భూములు ఎక్కడున్నా గుర్తించి స్వాధీనం చేసుకుని ప్రజోపయోగ కార్యక్రమాల కోసం వినియోగించాలి.

ధర్మచక్రం ప్రతినిధి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*