చంద్రబాబుగారూ…బిజెపి నాయకులకు మీరైనా చెప్పండి!

బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా కన్నా లక్ష్మీనారాయణను నియమిస్తూ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా నిర్ణయం తీసుకున్నారు. ఆ పదవి కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న సోము వీర్రాజు తీవ్ర నిరాశ చెందారు. మొన్నటిదాకా అధ్యక్షునిగా ఉన్న హరిబాబు రాజీనామా చేయగానే…వీర్రాజు తెలుగుదేశంపై వీర లెవల్లో ఊగిపోవడం మొదలుపెట్టారు. ఇప్పటిదాకా ఎవరూ చేయనంత తీవ్రమైన వ్యాఖ్యలు చంద్రబాబుపై చేశారు. వీర్రాజు ఎప్పుడు మాట్లాడినా సంచలనమే. ఆయన దూకుడు చూసి…బిజెపి అధ్యక్ష పదవి ఆయనకే ఇస్తారని అంతా భావించారు. తీరా….తీరా గత ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన కాంగ్రెస్‌ సీయర్‌ మోస్ట్‌ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణకు అధ్యక్ష పదవి కట్టబెట్టారు. దీనిపై సోమ వీర్రాజు అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు పార్టీ పదవులకు రాజీనామా చేసినట్లూ వార్తలొస్తున్నాయి. పార్టీలో సీనియర్‌గా ఉన్న వీర్రాజుకు ఇవ్వకుండా, దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో ఉండి, అక్కడ పదవులు అనుభవించి వచ్చిన వ్యక్తికి ఎలా అధ్యక్ష పదవి ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. బిజెపిలో పదవులు ఇవ్వడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. కొత్తగా చేరిన వారికి అంత తేలిగ్గా పదవులు ఇవ్వరు. అలాంటిది కన్నా కోసం నిబంధనలనూ పక్కనబెట్టారు. పైగా ఆయన వైసిపిలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న తరువాత, చివరి నిమిషంలో నిలువరించి పదవి ఇచ్చారు. అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏముందని వీర్రాజు అనుచరులు, ఇంకా బిజెపిలో దీర్ఘకాలంగా ఉంటున్న నాయకులు ప్రశ్నిస్తున్నారు.

అయినా…ఇది పాతకాలం బిజెపి కాదనే విషయాన్ని ఆ పార్టీని అంటిపెట్టుకున్న నాయకులు మరచిపోతున్నారు. ఇది మోడీ, షా ద్వయం నడిపిస్తున్న పార్టీ. నిబంధనల పేరుతో చేతులు కట్టుకుని కూర్చోవడం చేతకాదు. అధికారం కోసం ఏమైనా, ఏదైనా చేయొచ్చు అనేది ఈ ఇద్దరి నీతి. నిబంధనలు, నైతికత, సిద్ధాంతాలు అన్నీ తోటకూర కట్ట అని భావించడమేకాదు…దానికి అనుగుణంగానే రాజకీయాలు నడుపుతున్నారు. కర్నాకటలో యడ్యూరప్పను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా, అవినీతి సామ్రాట్‌గా పేరు పొందిన గాలి జనార్థన్‌ రెడ్డి కుటుంబంలోని వారికి టికెట్లు ఇచ్చినా, అద్వానీ వంటి వారిని పక్కన పెట్టేసినా….మోడీ రాజకీయ నీతి అదే. రాష్ట్రంలో కాపు సామాజికవర్గంపై కన్నేసిన అగ్రనేతలు అందుకు అనుగుణంగానే కన్నాకు అధ్యక్షపదవి కట్టబెట్టారు. ఇవన్నీ వదిలేసి కడుపు చించుకోవడం కంఠశోష వల్ల వీర్రాజు అనుచరులకు ఒరిగేదేమీ ఉండదు. తెలుగుదేశం, బిజెపి తెగదెంపులు చేసుకున్న తరువాత చంద్రబాబు నాయుడు బిజెపిని ఉద్దేశించి ఒక మాట చెబుతున్నారు…’రాష్ట్రంలో బిజెపికి ఒక్క ఓటయినా వస్తుందా…’ అంటున్నారు. ‘ఒక్క ఓటు రాని పార్టీ పదవి కోసం ఎందుకు తన్నుకుంటున్నారు…’ అని చంద్రబాబుతోనైనా చెప్పిస్తే వీర్రాజు ఊరుకుంటారేమో! హరిబాబు సహా చాలామంది బిజెపి నాయకులు చంద్రబాబు మాటే వినేవారని ఆ మధ్య చెప్పుకునేవారు!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*