చంద్రబాబుది కొంగజపం…బాబుకు విశ్వసనీయత లేదు : సిపిఎం నేత శ్రీనివాసరావు

ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న హడావుడిని సిపిఎం తేలిగ్గా కొట్టిపారేసింది. జాతీయ స్థాయిలో ఓ కూటమిని ఏర్పాటు చేయగల విశ్వసనీయ చంద్రబాబు లేదని అభిప్రాయపడింది. రాష్ట్రంలో బిజెపిని మించిన నియంతృత్వం, అప్రజాస్వామిక పాలన సాగుతోందని విమర్శించింది. కాంగ్రెస్‌తో కలిసి ఏర్పాటు చేస్తామంటున్న కూటమిలో సిపిఎం చేరబోదని తేల్చి చెప్పింది. సిపిఎం కూడా తమ కూటమిలో చేరుతుందని టిడిపి నాయకులు ప్రచారం చేసుకుంటున్న సమయంలో…ఆ పార్టీ జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు ఈ అంశాలపై స్పష్టతనిచ్చారు. సిపిఎం ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో ఓ వీడియాను పోస్టు చేశారు. అందులో శ్రీనివాసరావు సవివరంగా మాట్లాడారు.

బాబుకు విశ్వసనీయత లేదు
జాతీయ స్థాయి మహాకూటమి కోసం ప్రయత్నించడం ఇదే మొదటి సారికాదు. గతంలో కెసిఆర్‌, మమతా బెనర్జీ, మాయావతి వంటివారు చేశారు. ఇప్పుడు తన అవసరాల కోసం చంద్రబాబు నాయుడు మొదలుపెట్టారు. ఢిల్లీకి వెళ్లి అక్కడ హంగామా చేశారు. ఏదో చేస్తున్నట్లు ప్రజల్లో భ్రమలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం నిర్మించేంతటి విశ్వసనీయత లేదు. గతంలో ఆయన బొంగరాలు తిరిగినట్లు కాంగ్రెస్‌ చుట్టూ, బిజెపి చుట్టూ రకరకాలుగా తిరిగారు. రాష్ట్రానికి అన్యాయం చేయడంలో ఆయన ముందున్నారు.

1998లో యునైటెడ్‌ ఫ్రంట్‌లో ఆయన భాగస్వామిగా వుండి….బిజెపికి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని నడిపి….సాయంత్రం ఢిల్లీలో ప్రెస్‌మీట్‌ పెట్టి, తెల్లారేసరికి హైదరాబాద్‌కు వచ్చి బిజెపి కూటమిలో చేరిపోయారు. ఒక మాటమీద నిలబడే రాజకీయ నిలకడ, విశ్వసనీయత చంద్రబాబు నాయుడికి లేదు. ఆ తరువాత బిజెపితో తెగదెంపులు చేసుకున్నారు. మళ్లీ బిజెపితో కలిశారు. ఇంకోసారి తెగదెంపులు చేసుకున్నారు. ఈ విధంగా రకరాకాల ఫీట్లు నిత్యం చేస్తూనే ఉన్నారు. అందువల్ల చంద్రబాబు చేస్తున్న జాతీయ స్థాయి ప్రయత్నాలకు విశ్వసనీయత రాదు.

ప్రజాస్వామ్యంపై చంద్రబాబుది కొంగజపం
రెండో విషయం…ఇదొక ప్రజాస్వామ్య అనివార్యతగా చెబుతున్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హతే బాబుకు లేదు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను దిగజార్జి, పూర్తిగా నిరంకుశమైన పరిపాలనను తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. ప్రజల్లో ఏ చిన్నపాటి కోరిక వచ్చినా…భూసమస్యలపైనగానీ, గిట్టుబాటు ధరలమీదగానీ, దళితులు తమ మీద జరుగుతున్న దాడుల విషయంలోగానీ, కార్మికులు తమ హక్కుల విషయంలోగానీ, సమ్మెల సందర్భంగాగానీ….అమానుషంగా అణచివేయడం, కేసులు పెట్టండి, అర్ధరాత్రిపూట ఇళ్లపైకి వచ్చి అరెస్టులు చేయడం, చివరికి ఇతర రాజకీయ పార్టీల సభలనూ అనుమతించకపోవడం, ఇతర పార్టీల నేతల కదలికలనూ అదుపు చేయడం, ప్రజా ఉద్యమాలకు సంఘీభావం కూడా చెప్పనీకుండా చేయడం ఆంక్షలు పెట్టడం….ఇటువంటి అప్రజాస్వామ్యక నిరంకుశ పద్దతులను ఇక్కడ అనుసరిస్తున్నారు.

రెండోవైపు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్నానని చెప్పడం అనేది…ప్రజాస్వామ్యంపై కొంగజపం వంటిది. అంతేగాదు రైతుల భూములను బలవంతంగా లాక్కోడానికి భూసేకరణ చట్టాన్ని సవరించిన తీరు, సమ్మెలను అణచివేయడానికి చట్టాలు తీసుకురావడం…ఇవన్నీ బిజెపిని మించి ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. కార్పొరేట్‌ సంస్థల కోసం పని చేస్తున్నారు. ప్రశ్నించేవారి నోరును దౌర్జన్యంగా నొక్కేస్తున్నారు. పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసినా ఏదోఒక నెపంతో ఎన్నికలు వాయిదా వేయడం…ఇదంతా అప్రజాస్వామికం. ఇటువంటి చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదు.

ఎన్నికల కంటే ముందు జాతీయ స్థాయి కూటమికి భూమిక లేదు
జాతీయ స్థాయిలో వివిధ పార్టీలు….డిఎంకే కావచ్చు, ఎన్‌సిపి కావచ్చు, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కావచ్చు….చాలా పార్టీలున్నాయి. ఎన్నికలైన తరువాత ఆనాటి పరిస్థితులను బట్టి ఎలాంటి కూటములు ఏర్పడుతాయో చెప్పలేం. ఎన్నికల ముందు సంబంధించినంత వరకు వివిధ రాష్ట్రాల్లో ఆయా పార్టీలు ఒక శక్తిగా ఉన్నాయి. వీరంతా కలిసి జాతీయ స్థాయిలో కూటమిగా ఏర్పడగల భూమిక ఇప్పుడు లేదు. ఎందుకంటే ఒకపార్టీ ఒక రాష్ట్రంలో బలంగా ఉంటారు. ఇంకోరాష్ట్రంలో బలహీనంగా ఉంటారు. బలంగా ఉన్నచోట ఇంకో పార్టీని కలుపుకోకపోవచ్చు. ఉదాహరణకు ఉత్తర ప్రదేశ్‌ల బిఎస్‌పి, ఎస్‌పి కలుస్తాయి. అదేసమయంలో మధ్యప్రసాద్‌లో బిఎస్‌పి ఇతర పార్టీలతో కలవడం లేదు. ఈ రెండు రాష్ట్రాల్లోనే పరిస్థితి ఇలావుంటే…జాతీయ స్థాయిలో ఫ్రంటు ఎలా సాధ్యవుతుంది. అందుకే ఈ పార్టీలన్నీ కలిసి జాతీయ స్థాయిలో కూటమిగా ఏర్పడే భౌతిక పరిస్థితి లేదు. ఆయా రాష్ట్రాల్లో ఎవరికివారు బిజెపికి వ్యతిరేకంగా పోరాడాలి. ఎన్నికలైన తరువాతే కూటమికి అవకాశాలున్నాయి.

ఏ కూటమిలోనూ సిపిఎం చేరదు
ఒకవేళ ఎన్నికలకు మునుపే ఒక కూటమిగా ఏర్పడినా అందులో సిపిఎం భాగస్వామి కాదు. సిపిఎం 22వ మహాసభ స్పష్టంగా ప్రకటించింది. జాతీయ స్థాయిలో ఎలాంటి కూటమీ ఏర్పాటుకు సిపిఎం ప్రయత్నం చేయదు. ఏ కూటమిలోనూ చేరదు. జాతీయ స్థాయిలో వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యతకు ప్రయత్నిస్తుంది. ఇటువంటి ఐక్యత జాతీయ స్థాయిలో ఏర్పడాలంటే….ఇందుకు రాష్ట్రాల్లో పునాదిపడాలి. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా వచ్చే పార్టీలను; బిజెపిని ఓడింగల పార్టీలను, అక్కడ ప్రజా వ్యతిరేకం కాని పార్టీలను కలుపుకోవాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది.

రాజకీయ ప్రత్యామ్నాయం కోసం వామపక్షాల కృషి
ఈ విధంగా మన రాష్ట్రంలో చూసినపుడు…బిజెపికి మన రాష్ట్రానికి తీవ్రమైన విద్రోహం చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఫ్యాకేజీ ఇవ్వలేదు. మరోవైపు కాంగ్రెస్‌ అన్యాయం చేసింది. బిజెపితో టిడిపి తెగదెంపులు చేసుకుంటే వైసిపి దగ్గరవుతోంది. టిడిపి అటు కాంగ్రెస్‌కు దగ్గరవుతోంది. అధికార పక్షం, ప్రతిపక్షం ఆ పార్టీలతో ఊరేగుతున్నాయి. ఇటువంటి పార్టీలతో కలిసి ప్రత్యామ్నాయం నిర్మించడం అసాధ్యం. అందుకే టిడిపి, వైసిపి, కాంగ్రెస్‌, బిజెపిలకు ఈ నాలుగు పార్టీలకు వ్యతిరేకంగా…నూతన రాజకీయ ప్రత్యామ్నాయం నిర్మించాలని సిపిఎం, సిపిఐ నిర్ణయించుకున్నాయి. ఈ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రమంతా ప్రచారం చేశాయి. సెప్టెంబర్‌ 15న విజయవాడలో భారీ సభ నిర్వహించాయి. ఇది కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ రాజకీయ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని రెండు పార్టీలూ నిర్ణయించుకున్నాయి. ప్రత్యేక పరిస్థితుల్లో జనసేనతో కలిసి రాజకీయ ప్రత్యామ్నాయం నిర్మించాలని, కలిసొచ్చేవారిని కలుపుకోవాలని నిర్ణయించుకున్నాం. ఈ రాష్ట్రంలో టిడిపిని ఓడించడం, కేంద్రంలో బిజెపిని ఓడించడం అనే ప్రధానమైన లక్ష్యతో సిపిఎం, సిపిఐ, జనసేన, కలిసొచ్చే పార్టీలతో నూతన ప్రత్యామ్నాయం కోసం కృషి చేస్తున్నాం. దీనికి లోబడే సీట్ల సర్దుబాటు వంటివి ఉంటాయి. ఇందులో విజయం సాధిస్తామన్న నమ్మకం మాకు ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*