చంద్రబాబు ఘనతను చాటిచెప్పిన సాక్షి..!

ఈ శీర్షక చదవగానే నమ్మశక్యంగా లేకపోవచ్చు. ఎప్పుడూ చంద్రబాబును, టిడిపిని ఏకిపారేసే సాక్షి పత్రిక….ఆయన్ను ఆకాశానికెత్తడం ఏమిటి…అనే అనుమానం కలగవచ్చు. అయితే…25.10.2018 నాటి సాక్షి పత్రిక చూస్తే ‘చంద్రబాబు అత ఉద్ధండుడా…’ అని అనిపించకమానదు. ఇంతకీ సంగతి ఏమిటంటే….

సిబిఐలో జరుగుతున్న పరిణామాలపై ప్రధాన సంచిక పతాక శీర్షికలో ఓ కథనాన్ని ప్రచురించారు. ఆ కథనం చదవితే….సిబిఐలో ఎలాంటి నియామకాలైనా చంద్రబాబు కనుసన్నల్లో జరుగుతాయోమో అనిపిస్తుంది. సిబిఐలో ఏ అధికారినైనా చంద్రబాబు తన గుప్పెట్లో ఉంచుకోగలరన్న భావన కలుగుతుంది.

ప్రధాన నరేంద్ర మోడీ ప్రత్యేక ఆసక్తితో నియమించినట్లు చెబుతున్న ఆస్తానాను, డైరెక్టర్‌ అలోక్‌వర్మను ఇద్దరినీ….మెనేజ్‌ చేసి కొన్ని కేసులను సానుకూలంగా మార్చుకున్నారట. ఆ ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించి, కొత్త డైరెక్టర్‌గా తమ వ్యక్తి అయిన మన్నెం నాగేశ్వరరావును నియమింపబడేలా పక్కా వ్యూహం పన్నారట. ఇదీ సాక్షి పత్రిక కథనం.

ఈ కథనం చదివిన తరువాత…ఢిల్లీలో చంద్రబాబు నాయుడికి అంత పలుకుబడి ఉందా…అనిపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సిబిఐ మొత్తం ఆయన చేతుల్లోనే ఉన్నట్లు అనిపిస్తుంది.

సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ అనేది బహిరంగ రహస్యం. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా, బిజెపి చేతిలో అధికార పగ్గాలున్నా….సిబిఐ వంటి సంస్థలను అవి దుర్వినియోగం చేస్తున్నాయనడంలో సందేహం లేదు. అయితే సిబిఐని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన గుప్పెట్లో ఉంచుకోగలరా..? అనేదే ప్రశ్న.

రాజకీయాల్లో మైండ్‌గేమ్‌ కూడా చాలా అవసరం. అవతలి వారి భయం, బలహీనత ఇవతలి పక్షానికి బలంగా మారుతుంది. సిబిఐ కేసుల గురించి టిడిపి తీవ్ర భయాందోళనలకు గురవుతోందన్న భావన ఇటీవల దాకా ఉంది. ఈరోజు కాకున్నా రేపైనా టిడిపి నేతలపై కేసులు నమోదవుతాయన్న నమ్మకంతో వైసిపి నేతలున్నారు. ఈ స్థితి టిడిపి శ్రేణులకు లోలోన ఆందోళన కలిగిస్తూనేవుంది.

సాక్షి కథనంతో రివర్స్‌ అయింది. ఈ కథనాన్ని ఏ లక్ష్యంతో ప్రచురించారోగానీ….ఇది తెలుగుదేశం నేతల్లో మరింత ధైర్యాన్ని; వైసిపి నేతల్లో ఆందోళననకు కలించడానికి బాగానే ఉపయోగపడుతుంది. తమ నేత చంద్రబాబు నాయుడు ఢిల్లీస్థాయిలో చక్రం తిప్పగలరన్న విశ్వాసాన్ని టిడిపి నేతల్లో కలుగుతుంది. అంతటి శక్తిమంతున్ని మనం ఏమి చేయగలం…అనే నైరాశ్యం వైసిపిలో చోటుచేసుకుంటుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*