చంద్రబాబుపై ఎవరూ ఊహించని కేసులు రాబోతున్నాయా?

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న తనపైన కక్ష సాధించడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగంగానే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కర్నాటక ఎన్నికల తరువాత రాష్ట్రంపై బిజెపి దృష్టి పెడుతుందని కూడా చంద్రబాబు చెప్పారు. పోలవరంపై ఏసిబి విచారణ జరగవచ్చని, రాజధాని భూముల వ్యవహారంపైన కేసులు బనాయించవచ్చని రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఓటుకు నోటు కేసును వేగవంతం చేసి జైలుకు పంపిస్తారన్న ఆందోళనలూ తెలుగుదేశం శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే..ఇవేవీ కాకుండా, ఎవరూ ఊహించని కేసులు బాబుపై బనాయించవచ్చని తెలుస్తోంది. మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు చింతా మోహన్‌ తిరుపతిలో జరిగిన ఓ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ….’రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున డబ్బులు విదేశాలకు తరలిపోయినట్లు కేంద్రం వద్ద నివేదకలున్నాయి. ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా అందరూ ఇదే అడుగుతున్నారు. కర్నాటక ఎన్నికల తరువాత రాష్ట్రంలో ప్రకంనలు రాబోతున్నాయి’ అని చెప్పారు. ముఖ్యమంత్రి పేరును ఆయన ప్రస్తావించలేదుగానీ…. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు చంద్రబాబును ఉద్ధేశించే అనుకోవాలి.

చింతా మోహన్‌కు ఢిల్లీ విస్తృత పరిచయాలున్నాయి. అన్ని పార్టీల పెద్దలతో దగ్గరగా మెలిగే నాయకుడు ఆయన. తరచూ ఢిల్లీ వెళుతుంటారు. ఉన్నత స్థానాల్లోని అధికారులతోనూ సంబంధాలుంటాయి. అందుకే ఆయన చెబుతున్న మాటలను తేలిగ్గా కొట్టిపారేయలేం. అక్రమంగా విదేశాలకు డబ్బులు తరలించడమంటే తీవ్రమైన నేరకిందకే వస్తుంది. దీనికి సంబంధించి కఠిన చట్టాలు, శిక్షలూ ఉంటాయి. ఇలాంటి కేసులే బాబుపైన, లోకేష్‌పైన పెడుతారా…అనే అనుమానాలు కలుగుతున్నాయి. ‘దీనికి సంబంధించి చంద్రబాబుకూ ఇప్పటికే సంకేతాలు అందివుండొచ్చు. అందుకే ఆయన అంతగా ఆందోళనపడుతున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా జనాన్ని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.’ అని పరిశీలకులు చెబుతున్నారు. కర్నాటక ఎన్నికల తరువాత ఏం జరగబోతోంది అనేదానిపై ఇప్పటికే అందరిలోనూ ఉత్కంఠవుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*