చంద్రబాబుపై విమర్శలు చేస్తే టిటిడి పరువు నష్టం కేసు…బాగుంది బాగుంది!

ఇటీవల శ్రీవారి ఆలయ పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు లేవనెత్తిన వివాదంతో టిటిడి వార్తలకెక్కిన సంగతి తెలిసిందే. శ్రీవారి ఆభరణాలు మాయమయ్యాయని, పోటులో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని, కైంకర్యాలు సరిగా జరగడం లేదని రమణ దీక్షితులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఇదే అంశాలపై వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి కూడా ఆరోపణలు గుప్పించారు. అయితే రమణ దీక్షితులు చేసిన ఆరోపణలకు, విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు తేడావుంది. విజయసాయిరెడ్డి ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. శ్రీవారి ఆలయం నుంచి ఆభరణాలు తస్కరించి తన ఇంటిలో దాచుకున్నారని, 24 గంటల్లో తనిఖీ చేస్తే బయటపడుతాయని చెప్పిన సంగతి తెలిసిందే.

విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల వల్ల టిటిడి పరువుకు భంగం కలిగిందనడంలో అర్థం లేదు. ఇందులో పరువునష్టం అంశం ఏదైనావుంటే…అది ముఖ్యమంత్రికి సంబంధించినది తప్ప….టిటిడికి సంబంధించినది కాదు. ఆయన ఎక్కడా టిటిడిని తప్పుబట్టలేదు. ప్రభుత్వ పెద్దలనే టార్గెట్‌ చేశారు.

ఈ వివాదానికి సంబంధించి తిరుపతి న్యాయస్థానంలో టిటిడి అటు రమణ దీక్షితులుపైన, ఇటు విజయసాయిరెడ్డిపైన పరువునష్టం కేసు దాఖలు చేసింది. ఇందుకోసం రూ.2 కోట్లు ఫీజుగా చెల్లించింది. రమణ దీక్షితులు నేరుగా టిటిడిపైనే ఆరోపణలు చేశారు. ఆయనపైన పరువు నష్టం కేసు వేసినా అర్థముందిగానీ….రాజకీయ ఉద్దేశాలతో, ఎత్తులలో చేసుకున్న విమర్శలపై టిటిడి కేసు వేయడమే విడ్డూరంగా ఉంది.

ఈ వివాదంలో రమణ దీక్షితులుపైన కేసు వేయడాన్ని కూడా సమర్థించలేం. ఎందుకంటే ఆయన చేసిన ఆరోపణలపై ఇప్పటిదాకా సమగ్రమైన విచారణ జరగలేదు. దీక్షితులు లేవనెత్తిన అంశాలన్నీ ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఆ మాటకొస్తే…చాలా మంది మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా రమణ దీక్షితులు ఆరోపణలతో ఏకీభవించారు. ఆయన డిమాండ్‌ చేస్తున్నట్లు సిబిఐ విచారణ జరిపించాలని కోరారు.

విచారణ జోలికి వెళ్లకుండా, భక్తుల అనుమానాలను నివృత్తి చేయకుండా పరువునష్టం కేసులు వేయడం వల్ల ఒరిగేదేమీ ఉండదు. రమణ దీక్షితులు లేవనెత్తిన అంశాలపై బిజెపి ఎంపి సుబ్రమణ్యస్వామి సుప్రీంలో కేసు వేశారు. అయితే…ఇప్పటికే అటువంటి కేసులు రాష్ట్ర హైకోర్టులో పెండింగ్‌ ఉండటం వల్ల…అక్కడికే వెళ్లాలని సుప్రీం సూచించింది. దీంతో ఆయన హైకోర్టులో కేసు వేశారు. ఆ కేసు విచారణలో ఉంది. ఇంతలోనే టిటిడి పరువు నష్టం కేసును స్థానిక కోర్టులో దాఖలు చేసింది.

టిటిడి వంటి ఆధ్యాత్మిక సంస్థలు…పంతాలు పట్టింపులకు పోవడాన్ని భక్తులు ఆమోదించరు. అందులోనూ శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా దశాబ్దాల పాటు పని చేసిన వ్యక్తిపై కేసు వేయడాన్ని అసలు అంగీకరించరు. ఈ వివాదంలో మంచి చెడులను శ్రీవారికే వదిలేసివుండాల్సింది. అంతా సద్దుమణిగిన సమయంలో పరువు నష్టం కేసు వల్ల మళ్లీ వివాదం రాజుకునే అవకాశాలున్నాయి. ఇది టిటిడి ప్రతిష్టకు మంచిది కాదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*