చంద్రబాబు అంత సాహసం చేస్తారా..!

Nara Chandrababu Naidu

రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు రాజీనామా చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. చంద్రబాబు నాయుడు సహా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు తన సభ్యత్వాలకు రాజీనామా చేసి, గవర్నర్ కి సలమర్పిస్తారని చెబుతున్నారు. ఇలా రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికల్లో గెలవడం ద్వారా…. అమరావతిలోనే రాజధాని ఉండాలని ప్రజలు బలంగా కోరుకుంటు న్నారన్న సందేశం పంపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే బాబు అంతటి‌ సాహసం చేయగలరా అనేది ప్రశ్న. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చావుదెబ్బ తినింది. 175 స్థానాలు కూడా ముప్పై మూడు స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. ఇందులోనూ ఇప్పటికే ముగ్గురు పార్టీ నుంచి జారిపోయారు. ఇక మిగిలింది 20 మంది మాత్రమే. ఇందులో రాజీనామాలకు ఎంతమంది సిద్ధపడతా రన్నది ప్రశ్న.‌ రాజీనామాలే చేయాల్సివస్తే చంద్రబాబు కూడా చేయాల్సివుంటుంది.

టిడిపి ఎంఎల్ఏల్లో కొందరైనా బాబు మాటకు కట్టుబడి రాజీనామాలు చేస్తారని‌‌ అనుకుందాం. రాజీనామాలను ఆమోదించడం స్పీకర్ చేతిలో ఉంటుంది. వెంటనే ఆమోదిస్తారన్న గ్యారెంటీ లేదు. వెంటనే ఉప ఎన్నికలు జరుగుతాయన్న నమ్మకం లేదు. రాజీనామాలు ఆమోదించి, ఎ‌న్నికలు జరిగేలోపు రాజధాని వివాదం వేడి తగ్గిపోవచ్చు. ఇటువంటి చిక్కులు‌ అనేకం ఉన్నాయి.

ఒకవేళ ఎన్నికలు జరిగినా…మళ్లీ గెలవడం అంత తేలిక కాదు. రాయలసీమలో టిడిపికి మూడు సీట్లు ఉన్నాయి. ఇక్కడ హైకోర్టు పెడుతుంటే…దానికి వ్యతిరేకంగా రాజీనామాలు చేసి, ఓట్లు ఏమని‌ అడగగలరు. ఉత్తరాంధ్రలోనూ ఇదే పరిస్థితి. అసలు రాజధాని ఉన్న మంగళగిరులోనూ‌ టిడిపి ఎంఎల్ఏ లేరు. రాజధాని సెంటిమెంట్ కాస్తాకూస్తో ఉందనుకుంటున్న అక్కడైనా టిడిపి ఎంఎల్ఏ ఉండి, రాజీనామా చేసివుంటే…తిరిగి గెలిచే అవకాశం ఉండేది. అదీలేదు. ఈ పరిస్థితుల్లో టిడిపి ఎంఎల్ఏలు‌ రాజీనామా చేసే సాహసం చేస్తారని అనుకోలేం.

తెలంగాణ ఉద్యమం జరిగేటపుడు. టిఆర్ఎస్ ఎంఎల్ఏలు రాజీనామా చేసి, తిరిగి ఘన విజయం‌ సాధించడం ద్వారా…ప్రజల్లో తెలంగాణ ‌సెంటిమెంటయ బలంగా ఉందని నిరూపించారు. అదేవిధంగా…కాంగ్రెస్ తో విభేదించి జగన్ సొంత పార్టీ పెట్టుకున్నాక…తనతో వచ్చిన ఎంఎల్ఏలతో రాజీనామా చెయించి, తిరిగి‌‌ గెలిపించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఉద్వేగంగానీ, జగన్ కు అప్పుడు ఉన్నంత చరిష్మాగానీ టిడిపికి ఇప్పుడు లేవు. అటువంటప్పుడు రాజీనామాలు చేసి గెలవడం అంత తేలికైన పని కాదు. తేడా వస్తే రాజకీయంగా టిడిపి తన తల తనే నరుక్కున్న చందంగా మారుతుంది.

ఏదిఏమైనా చంద్రబాబు ఇప్పుడు చిక్కుల్లో ఉన్నారు. అమరావతి పేరుతో రైతులను రెచ్చగొట్టి ఉద్యమం చేయిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో బాబు ఏదోఒకటి చేయకుంటే రైతుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. ఈ పరిస్థితిని నుంచి చంద్రబాబు ఏ విధంగా బయటపడతారో చూడాలి.
– ఆదిమూలం శేఖర్

1 Comment

  1. చంద్రబాబు ఒక చచ్చిన పాము. దమ్ముంటే అందరిచేత రాజీనామా చేయించాలి.

Leave a Reply

Your email address will not be published.


*