చంద్రబాబు ఆస్తుల లెక్కల్లో కనికట్టు ..!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి కుటుంబం తమ ఆస్తుల వివరాలను వెల్లడించింది. గత 8 సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఆస్తుల వివరాలను ప్రకటిస్తూ వస్తున్నారు. ఇందుకు ఆ కుటుంబాన్ని అభినందించాల్సిందే. తమలాగే అన్ని రాజకీయ కుటుంబాలూ ఆస్తుల వివరాలను ఏటా ప్రకటించాలని లోకేష్‌ సూచించారు.

లోకేష్‌ ప్రకటించిన ప్రకారం నారావారి కుటుంబ ఆస్తుల విలువ రూ.88 కోట్లు మాత్రమే. ఇది చూశాక నావారారి కుటుంబ ఆస్తుల విలువ ఇంతానా..! ఆశ్చర్యం కలగకమానదు. ఎందుకంటే…హెరిటేజ్‌ వంటి ఒక పెద్ద కార్పొరేట్‌ సంస్థను నడుపుతున్న ఆ కుటుంబం ఆస్తుల విలువ అంత తక్కువగా ఎందుకుందనేది ప్రశ్న.

అసలు సంగతి ఏమంటే…నారావారి కుటుంబం చాలా తెలివిగా వివరాలు ప్రకటించింది. ఆస్తుల విలువ అంటే ఈరోజుటి విలువ ప్రకటించాలి తప్ప…ఎప్పుడో వాటిని కొనుగోలు చేసినప్పటి విలువ ప్రకటిస్తే ఎలా..? దీనికి ‘ఆస్తుల వివరాలు’ అంటే సరిపోతుందిగానీ… ‘ౖఆస్తుల విలువ’ అంటే అని చెప్పడం సరికాదు. ఫలానా చోట ఫలానా ఆస్తివుందని చెప్పడం వేరు…ఆ ఆస్తి విలువ ఎంతో చెప్పడం వేరు. ఆస్తుల విలువ ప్రకటిస్తున్నా మంటూ ఎప్పుడో వాటిని కొనుగోలు చేసిన విలువను చెప్పడం సరికాదు.

ఉదాహరణకు హెరిటేజ్‌ షేర్ల అంశానికే వస్తే…చంద్రబాబు కుటుంబానికి చెందిన పెట్టుబడుల సంస్థ నిర్వాణ హోల్డింగ్స్‌ పేరుతో 51 లక్షల షేర్లు ఉన్నట్లు ప్రకటించారు. ఈ షేర్ల విలువ రూ.10.82 కోట్లుగా చెప్పారు. ఈ లెక్కన చూస్తే ఒక్కో షేర్‌ విలువ రూ.21 మాత్రమే. కానీ ప్రస్తుతం హెరిటేజ్‌ షేర్‌ విలువ రూ.2000 దాకా ఉంది. ఈ మాటన లోకేష్‌ స్వయంగా చెప్పారు. రూ.2000 లెక్కన లెక్కిస్తే…51 లక్షల షేర్ల విలువ రూ.1000 కోట్లు అవుతుంది.

ఇక నారా భువనేశ్వరి పేరుతో కోటి 27 లక్షల షేర్లు ఉన్నాయి. వీటి విలువ రూ.19.95 కోట్లుగా లెక్క చెప్పారు. అంటే ఒక్కో షేరు ధర రూ.19 మాత్రమే. ఇప్పటి విలువ ప్రకారం లెక్కిస్తే రూ.2000 కోట్లు అవుతుంది. నారా బ్రాహ్మణికి 2 లక్షల షేర్లు ఉన్నాయి. వీటి విలువ రూ.78 లక్షలుగా చూపారు. వాస్తవ విలువ రూ.40 కోట్లు.

ఒక హెరిటేజ్‌ షేర్ల రూపంలోనే వేలాది కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు లెక్క. ఈ లెక్కలు చెప్పకుండా ఎప్పుడో 1990 నాటి విలువను ఇప్పుడు చెప్పడంలో అర్థమేముంటుంది. అటువంటప్పుడు తమకు ఫలానా ఫలానా ఆస్తులున్నాయని మాత్రం వెల్లడిస్తే సరిపోయేది. అవి భూములైనా, గృహాలైనా, షేర్లయినా ప్రస్తుత విలువ ప్రకారం లెక్కించి చెప్పడం పెద్ద సమస్య కాదు. మొత్తంగా తేలేదేమంటే చంద్రబాబు కుటుంబ ఆస్తుల విలువ రూ.88 కోట్లు కాదు. వేల కోట్లే..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*