చంద్రబాబు ఇంకా మౌనంగా ఉండగలరా..! కెసిఆర్‌కు స‌మాధానం ఇస్తారా?

తెలంగాణ ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చద్రబాబు నాయుడు మొదటి నుంచి చాలా లౌక్యంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కెసిఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి కూటమి కడుతున్నా….తన చేతికి మట్టి అంటకుండా జాగ్రత్తపడు తున్నారు. తెలంగాణలో పొత్తుల వ్యవహారాన్ని ఆ రాష్ట్ర నాయకులు తేల్చుకుంటారంటూ తప్పించుకున్నారు. తెలంగాణ టిడిపి నేతలు తాము కాంగ్రెస్‌తో జతకట్టడం గ్యారెంటీ అని చెబుతున్నా చంద్రబాబు నాయుడు మాత్రం ఏమీ మాట్లాడటం లేదు.

ఎన్నికలపై పార్టీ శ్రేణులతో చర్చించడానికి హైదరాబాద్‌ వెళ్లిన చంద్రబాబు…కెసిఆర్‌ను ఒక్కమాట కూడా అనకుండా….తెలివిగా బిజెపిని తిట్టేసి వచ్చేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బాబు మాట్లాడుతూ….’నిన్న మొన్నటిదాకా మనకు సహకరించారు. ప్రత్యేక హోదాకు మద్దతు కూడా ఇచ్చారు. కలిసి పని చేద్దాం అనుకున్నాం…ఎప్పుడైతే మోడీతో విభేదించామో వీళ్లు కూడా రివర్స్‌ అయ్యారు…’ అంటూ టిఆర్‌ఎస్‌ను ఉద్దేశించి మాట్లాడారు. అంటే…తమకు కెసిఆర్‌తో గొడవ పెట్టకోవడం ఇష్టం లేదనే సంకేతాలు ఇచ్చారు.

మనసులో మాట ఎలావున్నా…ఆచరణ ముఖ్యం. రేపు ఆంధ్రప్రదేశ్‌లో గెలవాలంటే కాంగ్రెస్‌తో అవగాహన తప్పనిసరి. దీన్ని దృష్టిలో ఉంచుకుని…తెలంగాణలో కాంగ్రెస్‌తో టిడిపి జతకట్టింది. అందుకే చంద్రబాబు నాయుడు లౌక్యం ప్రదర్శిస్తూ…కెసిఆర్‌నుగానీ, ఆయన పాలననుగానీ పొల్లెత్తు మాట అనకుండా జాగ్రత్తపడుతున్నారు. ఆఖరికి ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డిని బలంగా ఇరికిస్తున్నా…ఆ అంశంపై గట్టిగా మాట్లాడలేకున్నారు.

చంద్రబాబు నాయుడి ‘లౌక్యం’ అర్థం చేసుకున్న కెసిఆర్‌…ఇ ఉపేక్షించకూడదన్న భావనతో బాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబును నానామాటలూ అన్నారు. తెలంగాణ ద్రోహి అన్నారు. ఓటుకు నోటు కేసులు పట్టుబడిన దొంగ అని వ్యాఖ్యానించారు. తెలంగాణకు కరెంటు కోతలతో గోసపడుతుంటే…పైశాచిక ఆనందం పొందిన రాక్షసుడు అని తిట్టారు. ఎన్‌కౌంటర్ల పేరుతో వందలాది తెలంగాణ బిడ్డలను పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడని దుయ్యబట్టారు. అటువంటి చంద్రబాబుతో కాంగ్రెస్‌ ఎలా పొత్తు పెట్టుకుంటుందని నిలదీశారు. ఓటుకు నోటు కేసు సమయంలో టిడిపి-టిఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం జరిగినపుడు…కెసిఆర్‌ ఎంత ఘాటుగా మాట్లాడారో ఇప్పుడు అంతకు మించి మాట్లాడారు.

తెలుగుదేశం పార్టీని ఈ స్థాయిలో కెసిఆర్‌ టార్గెట్‌ చేస్తారని ఎవరూ ఊహించలేదు. రేవంత్‌ రెడ్డిపై కేసులు పెట్టినా, ఇంకోటి చేసినా తెలంగాణ టిడిపి నేతలు మాట్లాడుకుంటున్నారు తప్ప చంద్రబాబు జోక్యం చేసుకోవడం లేదు. తాజాగా కెసిఆర్‌ విరుచుకుపడిన తీరు చూసిన తరువాత కూడా చంద్రబాబు మౌనంగా ఉండగలరా…అనేది ప్రశ్న. ఇప్పుడు బాబు తరపున ఎవరెవరో సమాధానాలు చెప్పినా ప్రయోజనం లేదు. కచ్చితంగా ఆయనే స్పందించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటికీ మౌనంగా ఉంటే….ఓటుకు నోటు కేసుకు చంద్రబాబు భయపడుతున్నారని ఇప్పటికే జరుగుతున్న ప్రచారం రూఢీ అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడి ముందున్నది ఒకటే మార్గం. కెసిఆర్‌కు దీటుగా సమాధానం ఇవ్వడమే. మరి ఆ ధైర్యం బాబుకు ఉందా లేదా అనేదే ప్రశ్న. ఓటుకు నోటు కేసు వచ్చినపుడు ‘హైదరాబాద్‌లో నేనూ పోలీస్‌ స్టేషన్ల పెడతా…నాకూ ఏసిబి వుంది…మీ సంగతి చూస్తా’ అంటూ కెసిఆర్‌పై కత్తి దూసిన చంద్రబాబు ఆ తరువాత మిన్నకుండిపోయారు. ఉన్నఫలంగా అమరావతికి వచ్చేశారు. చంద్రబాబు ఆ రోజు మాట్లాడినంత తీవ్రతతో ఈ రోజు మాట్లాడగలరా? కెసిఆర్‌ దాడికి బాబు ఎలా సమాధానం ఇస్తారు? ఇదే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్న అంశం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*