చంద్రబాబు ఊపిరి పీల్చుకోవచ్చు!

కర్నాటక ఎన్నికల తరువాత బిజెపి మన రాష్ట్రంపైన పడుతుందని; తనను వ్యక్తిగతంగానీ, ప్రభుత్వాన్నిగానీ ఇబ్బందిపెట్టే సూచనలున్నాయని, అదే జరిగితే తనకు అండగా నిలబడాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చెబుతూ వచ్చారు. కర్నాకట ఎన్నికల ఫలితాలు ఈనెల 15వ తేదీనే వెల్లడైనప్పటికీ…బిజెపి నాయకులు ఆ రాష్ట్ర వ్యవహారాల నుంచి ఊపిరి పీల్చేకోలేకపోయారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ లభించకపోవడం; ఇదే సమయంలో కాంగ్రెస్‌, జెడిఎస్‌ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధపడటం; అయితే గవర్నర్‌ బిజెపికే అవకాశం ఇవ్వడం; బల నిరూపణకు గవర్నర్‌ 15 రోజుల గడువు ఇచ్చినా సుప్రీం కోర్టు మాత్రం రెండు రోజుల్లో అది జరిగిపోవాలని ఆదేశించడం, తక్కువగా ఉన్న సభ్యల కోసం వేటాడటం….ఇటువంటి పనుల్లో బిజెపి నాయకులు తలమునకలుగా ఉన్నారు. బల నిరూపనలో బిజెపి గెలిస్తే మరింత రెట్టించిన అత్యుత్సాహంలో ఆంధ్రప్రదేశ్‌పైనా తన కొరడా ఝుళిపించివుండేదేమో. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా సంఖ్యాబలాన్ని సంపాదించుకోలేకపోవడంతో ఓటింగ్‌కు మునుపే యడ్యూరప్ప రాజీనామా చేశారు. ఇది బిజెపికి చెంపపెట్టు వంటిది. బిజెపి ఓటమితో దేశమంతా ఆ పార్టీ వ్యతిరేకులు సంబరాలు చేసుకుంటున్నారు. బిజెపి మాత్రం విషాదంలో మునిగిపోయింది. 104 స్థానాలు సంపాదించుకున్నా, ఇంకో ఏడు స్థానాలు సంపాదించుకోలేక దక్షిణాదిన ప్రభుత్వ ఏర్పాటు అవకాశాన్ని కోల్పోవడం ఆ పార్టీకి తీవ్ర నిరాశ, నిస్పృహలను కలిగించాయి.

ఇప్పుడు ఇదంతా ఎందుకంటే…బిజెపి బల పరీక్షలో నెగ్గివుంటే ఆ పార్టీ నాయకులు రొమ్మువిరుస్తూ, జబ్బ చరిస్తూ ఉండేవాళ్లు. కర్నాటక వ్యవహారంతో ఇప్పటికే బిజెపి చాలా అప్రతిష్టపాలయింది. ఈ పరిస్థితుల్లో…రాష్ట్రపై కొరడా ఝుళిపించాలని ఆ పార్టీ నేతలకు ఉన్నా ఇప్పట్లో ఆ పని చేయజాలదు. ఎందుకంటే…కక్షపూరితంగానే ఆంధ్రప్రదేశ్‌పై దాడికి పాల్పడుతోందన్న ప్రచారం దేశమంతా వ్యాపిస్తుంది. ఇది వచ్చే 2019 ఎన్నికలకు ఏమాత్రం ఆ పార్టీకి మంచి చేయదు. అందుకే…చంద్రబాబుపైన ఎంత కోపం ఉన్నా, ఆయనలో ఎన్ని తప్పులు ఉన్నా ఇప్పట్లో బాబువైపు చూడదు. ఈ పరిణామాలతో చంద్రబాబు నాయుడు ఊపిరి పీల్చుకోవచ్చు.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*