చంద్రబాబు కలలు కల్లలేనా..!

ఎపిలో ఎన్నికల ఫలితాలు కాసేపు పక్కన బెడితే జాతీయ రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగు తున్నాయి. ఎన్నికల ప్రకటన రాక ముందు ప్రతిపక్షాలలో వుండిన….ప్రధానంగా కాంగ్రెస్ కూటమిలో వున్న ఉత్సాహం, ఐకమత్యం ప్రస్తుతం కనిపించడం లేదు. మరీ ఈ కూటమి కోసం అహర్నిశలు కృషి చేసిన చంద్రబాబు నాయుడు కలలు కల్లలయ్యే విధంగా రాజకీయ పరిణామాలు సంభవిస్తున్నాయి.

గమనార్హమైన అంశమేమంటే బిజెపి క్యాంపు లోనూ, మరో వేపు కాంగ్రెస్ క్యాంపులోనూ రోజులు గడిచే కొద్ది నిరుత్సాహం గూడు కట్టుకొంటోంది..

వాస్తవం చెప్పాలంటే దేశంలో ప్రతిపక్షాల అనైక్యత మోదీకి మరింత ఊతం ఇస్తోంది. తొలి రోజుల్లో బీరాలు పలికిన ప్రతిపక్ష నేతలు ఎన్నికల వచ్చే సరికి ఎవరి దారి వారిదైనది. ఇందుకు ప్రజల సమస్యలు కారణం కాకపోగా ప్రధాని పీఠం పైననే వీరికీ తేడా వచ్చింది. యుపిలో కాంగ్రెస్ ను పక్కన బెట్టి మాయావతి, అఖీలేశ్ జట్టుకట్టారు. కాంగ్రెస్ తో కలిస్తే రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పదవికి పోటీ పడే అవకాశం వుంటుందని ఇలా చేశారు. తుదకు ఈ పరిస్థితి ఎంత వరకు వెళ్లిందంటే కాంగ్రెస్ పోటీ వలన బిజెపి లాభ పడుతుందని మాయావతి ఆరోపిస్తున్నారు.

మరో వేపు కర్నాటకలో ఒకే వేదిక ఎక్కిన రాహుల్ గాంధీ కేజ్రీ వాల ఎన్నికల ఒప్పందం చేసుకోలేక పోయారు. వీరి పోరు ఎంత వరకు వెళ్లిందంటే ఢిల్లీలో బిజెపి గెలుపొంది తే కాంగ్రెస్ కారణమని కేజ్రీవాల్ విమర్శించుతున్నారు.

ఇదిలావుండగా పలు వేదికపై మమత బెనర్జీ రాహుల్ గాంధీ పాలు పంచుకొని మోదీ వ్యతిరేక గానం చేసినా తుదకు బెంగాల్ లో ఇరువురు ఒకరి కొకరు పోటీ పడ్డారు.

జాతీయ స్థాయిలో మోదీ వ్యతిరేక ఫ్రంట్ ఇన్ని చీలికలు పేలికలుగా వుంటే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో సాగించే మోదీ వ్యతిరేక గానానికి అర్థమే లేకుండా పోతోంది.

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… రాహుల్ గాంధీని ప్రధానిని చేసి జాతీయ స్థాయిలో తనకు టిడిపి కి రక్షణ కవచం ఏర్పాటుకు తంటాలు పడుతుంటే ప్రప్రథమంగా మమత బెనర్జీ షాక్ ఇచ్చారు. అంటే రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి అంగీకరించని జాబితాలో మాయావతి, అఖీలేశ్ తో పాటు మమత బెనర్జీ కూడా చేరారు. ఈ స్థితిలో కేజ్రీవాల్ స్పందన ఇంతకు మించి వుండక పోవచ్చు. అంటే రాహుల్ గాంధీ అండతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలను కొంటున్న చంద్రబాబు కు ఎదురు దెబ్బె.

ఇదిలావుండగా మరో వైపు బిజెపి ఆశలు కూడా నీరుగారిపోతున్నాయి. ప్రస్తుతం తన వెంబడి వున్న మిత్రులతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు జరిగే అవకాశాలు కనిపించడం లేదు.
ఇంకొక వేపు రెండు డిజిట్ లలో స్థానాలు సంపాదించే ఆరేడు ప్రాంతీయ పార్టీలు ముందుకు వస్తున్నాయి. వీరిలో ఎక్కువ మంది కాంగ్రెస్ బిజెపి యేతర ప్రాంతీయ పార్టీలుగా వున్నాయి.

యుపి లో మాయావతి అఖీలేశ్ ఒడిషా లో నవీన్ పాట్నాయక్ బెంగాల్ లో మమత బెనర్జీ తెలంగాణలో కెసిఆర్ అన్నీ కలసి వస్తే ఎపిలో జగన్మోహన్ రెడ్డి కెసిఆర్ ఊహించు తున్నట్లుమూడవ ఫ్రంట్ ఊపిరి పోసుకొనే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.

అటు బిజెపి వెంబడి గాని ఇటు కాంగ్రెస్ వెంబడి గాని రెండంకెలలో స్థానాలు కైవశం చేసుకొనే పెద్ద ప్రాంతీయ పార్టీలు లేవు. అయితే గియితే తమిళ నాడులో కాంగ్రెస్ కూటమికి చెందిన డియంకె ఎపిలో టిడిపి మాత్రం వున్నాయి

ప్రస్తుతం జరిగిన పోలింగ్ జరుగ నున్న ఎన్నికలు పరిశీలించితే అటు బిజెపి గాని ఇటు కాంగ్రెస్ గాని స్వతహాగా గాని మిత్రులతో గాని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కనిపించడం లేదు. స్వతంత్రంగా వ్యవహరించే ప్రాంతీయ పార్టీలు మద్దతు కూడ గట్ట వలసి వుంది.
స్వతంత్రంగా వ్యవహరించే పార్టీలు సాధ్య మైనంత వరకు బిజెపి ని, కాంగ్రెస్ ను గద్దె ఎక్కించే అవకాశాలు తక్కువగా వున్నాయి. అనుకోని విధంగా ఏమైనా జరిగి రెండు జాతీయ పార్టీలు ఏదైనా సింగిల్ డిజిట్ లో మెజారిటీ కి తక్కువ స్థానాలు సంపాదించి నపుడే కేంద్రంలో జాతీయ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది. ఆలాంటి సూచనలు కనిపించడం లేదు.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడి నపుడే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హవా కనిపిస్తుంది.

ఆలా కాకుండా కాంగ్రెసు బిజెపి పార్టీలతో సంబంధం లేకుండా ప్రాంతీయ పార్టీల నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు జరిగితే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలలు కల్లలుగా మిగిలి పోక తప్పదు. అయితే మరో ముఖ్యమైన అంశ మేమంటే అటు బిజెపి ఇటు కాంగ్రెస్ మద్దతు లేకుండా కేవలం ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఏమాత్రం లేదు.

ఎన్నికలు ఫలితాలు ఏలా వుంటాయో ఏమో గాని కలగూర గంప లాగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే వాస్తవం చెప్పాలంటే దాని ఆయుషు కొద్ది కాలమే. ఎందు కంటే గతంలో ఇలాంటి అనుభవాలు చాలా వున్నాయి. తనకు అనువైన పరిస్థితులు గాని గిట్టని వాతావరణం నెలకొన గానే కల గూర గంప ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే జాతీయ పార్టీ వెనక్కి తగ్గుతుంది.

ఇవన్నీ అటుంచి ఎపిలో ఫలితాలు ఏలా వచ్చినా కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రభుత్వం ఏర్పడినా దానికి మద్దతు ఇచ్చే పార్టీల బట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తు ఆధారపడి వుంది. ఒక వేళ ఎపిలో టిడిపి ఓటమి చెందితే ప్రస్తుతం షికారు చేస్తున్న పుకార్లు ప్రకారం రాహుల్ గాంధీ ప్రభుత్వానికి కెసిఆర్ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చినా చంద్రబాబు కష్టాల కడలి ఈద వలసినదే.

ప్రస్తుతం టిడిపి భవిష్యత్తు మొత్తంగా ఎపిలో తిరిగి అధికారంలోకి రావడం పైగా కేంద్రంలో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పే ప్రభుత్వం నెల కొనడం.అయితే ఆలాంటి సూచనలు కనిపించడం లేదు. జాతీయ స్థాయిలో నేతలు ఎవరికి వారుగా వున్నారు. చంద్రబాబు నాయుడు సలహాల కన్నా వారి వారి రాష్ట్రాల పార్టీ ప్రయోజనాలకు ప్రధాని పదవిపై మోజుకు పరిమిత మౌతున్నారు.
జాతీయ స్థాయిలో సంభవిస్తున్న పరిణామాలు పరిశీలించితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఊహలకు, కలలకు అనుకూలంగా లేవు.

– వి.శంకరయ్య, 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*